తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

'దిశ కలెక్టివ్​'... ఆరోగ్యం, పర్యావరణ హితం - దిశ కలెక్టర్​ సంస్థ వార్తలు

పెద్దలకోసం... ఐ గ్రో, పిల్లలకోసం... గ్రీన్‌స్కూల్స్‌, ఆడవాళ్లకోసం... విమెన్‌ సొసైటీ, పర్యావరణ ప్రేమికుల కోసం... స్వాప్‌ పార్టీ.. వీటన్నింటి వెనకున్నది 'దిశ కలెక్టివ్‌' సంస దీన్ని ముందుండి నడిపిస్తోంది తేజస్వి దంతులూరి... ఫిల్మ్‌మేకర్‌గా కెరీర్‌ని కొనసాగిస్తూనే... దిశ కలెక్టివ్‌ని వేదికగా చేసుకుని ఆరోగ్య, పర్యావరణ కార్యక్రమాలు చేపడుతోందామె..

Health and environmental programs with 'Disha Collective' .
'దిశ కలెక్టివ్​'తో ఆరోగ్య, పర్యావరణ కార్యక్రమాలు.. ఎందరికో ఉపయోగం

By

Published : Oct 6, 2020, 9:39 AM IST

ఉపాధి కోసం, మంచి కెరీర్‌కోసం కొడుకులు, కూతుళ్లు, మనవలు వలసవెళ్లిపోగా... బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా మిగిలిపోయిన పెద్దవాళ్లు కనిపిస్తారు పల్లెల్లో. మామూలుగా అయితే వీళ్లని పట్టించుకోవడానికి, మనసు విప్పి మాట్లాడ్డానికి ఎవరూ ఉండరు. కానీ గుంటూరులోని కర్లపాలెం, పిట్లవానిపాలెం మండలాల్లో మాత్రం ఇటువంటివారికో భరోసా దొరుకుతుంది. ఇలాంటి పదికుటుంబాలకు ఓ ఆరోగ్యకార్యకర్త ఉన్నారు. ఆ ఆరోగ్యకార్యకర్తలే వీళ్ల బాగోగులు చూసుకుంటున్నారు. మందులు ఏమన్నా అవసరం అయితే ప్రభుత్వం నుంచి సాయం అందుతుంది. పిల్లలు దగ్గర లేరన్న బాధ లేకుండా చూసుకుంటారు.

అటు పిల్లలకీ పెద్దవాళ్లు ఎలా ఉంటున్నారో అనే చింత లేకుండా... ఆ కుటుంబాలన్నింటికీ వాట్సాప్‌ గ్రూపుల ద్వారా నెట్‌వర్క్‌ ఏర్పరిచి వీడియోకాల్స్‌ చేయిస్తారు. ఈ కార్యక్రమం పేరు ఐగ్రో. ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలని నిర్వహిస్తోంది దిశ కలెక్టివ్‌. ఈ సంస్థ చేస్తున్న తాజా కార్యక్రమాల్లో ఇదీ ఒకటి. పదేళ్ల క్రితం దిశ అసలు ఎందుకు ప్రారంభమయిందో వివరిస్తున్నారు సంస్థ సహ వ్యవస్థాపకురాలు తేజస్వి.

పదేళ్లక్రితం పుణెలో...
గుంటూరు పిట్లవానిపాలెంలో ఐగ్రో సెంటర్

తేజస్వి పుట్టింది గుంటూరులో. తండ్రి సత్యనారాయణరాజు మెదక్‌లోని ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలో పనిచేసేవారు. దాంతో పదోతరగతి వరకూ హైదరాబాద్‌లోనే చదువుకుంది. తర్వాత తండ్రికి బదిలీ కావడంతో పుణె వెళ్లింది. 'ఏ సమస్య అయినా మనవరకూ వస్తేకానీ... పరిష్కారం కోసం ప్రయత్నించం. పదేళ్ల క్రితం మా కుటుంబానికీ ఇదే పరిస్థితి ఎదురయ్యింది. మా దగ్గరి బంధువు ఒకరు చిన్న వయసులోనే అనారోగ్యం కారణంగా దూరమయ్యారు. ఆ మరణం మమ్మల్ని బాగా బాధపెట్టింది. పరిష్కారం కోసం ఆలోచించి.. ఆరోగ్యంపై అందరికీ అవగాహన పెంచాలనుకున్నాం. ఇందుకోసం నేను, నాన్న, మరికొందరు కలిసి దిశ స్టడీసర్కిల్‌ సెంటర్‌ పేరుతో పుణెలో ఒక సంస్థని ప్రారంభించాం. క్యాన్సర్‌, డయాబెటిస్‌, హెచ్‌ఐవీ... ఇలా ఒక్కోరోజు ఒకో అంశంపై డాక్టర్లు, సైంటిస్టులు, ఆరోగ్య నిపుణులు దిశ కేంద్రానికి వచ్చి మాట్లాడి వెళ్లేవారు. ఏడాది తర్వాత నిపుణులు చెప్పిన ఆ సూచనలని ఆచరణలో పెట్టాలని అనుకున్నాం. దాంతో నాన్న వీఆర్‌ఎస్‌ తీసుకుని హైదరాబాద్‌ వచ్చేశారు. తెల్లాపూర్‌ ప్రాంతాన్ని ఎంచుకుని అక్కడే ‘దిశ కలెక్టివ్‌ సెంటర్‌’ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థని ప్రారంభించాం' అంటూ దిశ ప్రారంభం వెనుక ఉన్న కారణాన్ని వివరించింది తేజస్వి.

పిల్లల కోసం సైన్స్‌స్కూల్‌తో మొదలుపెట్టి...
దిశ కలెక్టర్​ నడుపుతున్న తేజస్వి దంతులూరి

శారీరక, మానసిక ఆరోగ్యంతో సామాజిక ఆరోగ్యం కూడా ముఖ్యమే అనే తేజస్వి దిశలో మొదటిసారి పిల్లలకోసం ‘సండే సైన్స్‌ స్కూల్‌’ని ప్రారంభించింది. 'పుణెలో పర్యావరణ స్పృహ ఎక్కువ. అక్కడికి వెళ్లీవెళ్లడంతోనే ఒక ఎన్జీవోతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. అదే ఇక్కడ దిశని విస్తరించడానికి ఉపయోగపడింది. మొదట పిల్లల్లో సైన్స్‌ పట్ల అవగాహన పెంచేందుకు 'సండేసైన్స్‌ స్కూల్‌'ని ప్రారంభించాము. పిల్లలకు ఆసక్తి కలిగేలా సైన్స్‌ని ప్రయోగాలతో పాఠాలుగా చెప్పేవాళ్లం. ఆ తర్వాత శారీరక ఆరోగ్యం మెరుగుపడేందుకు జిమ్నాస్టిక్స్‌లో వాళ్లకు శిక్షణ ఇచ్చాం. అలాగే పిల్లలకోసం గ్రీన్‌స్కూల్స్‌ని మొదలుపెట్టాం. పచ్చని పొలాల మధ్య నడిచే ఈ స్కూల్లో పిల్లలకు ‘గద్దవచ్చే కోడిపిల్ల’, ‘పులీ-మేక’, ‘ఏడుపెంకులాట’ ఇలాంటి గ్రామీణ ఆటలు ఆడించేవాళ్లం. ఇవి వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేవి. పర్యావరణ చర్చలు నడిపించేవాళ్లం. ఇవన్నీ జరుగుతున్నప్పుడే మహిళలకోసం యోగా, ఆరోగ్యంపై కొన్ని వర్క్‌షాపులు కూడా జరిగేవి. అందులో కొంతమంది తల్లులు మా పిల్లలకు పోషకాలు అందాలంటే ఏం చేయాలి అనేవారు. అప్పుడే ఆర్గానిక్‌ ఆహారంపై దృష్టిపెట్టాం. జిల్లాల నుంచీ, నగరం చుట్టుపక్కల నుంచీ ఆర్గానిక్‌ ఆహారం సేకరించి అందించేవాళ్లం. అలా ఐదేళ్ల క్రితం ప్రారంభించిన దిశ- డీడీఎస్‌ ఆర్గానిక్‌ స్టోర్స్‌ ఈ రోజు వందమంది మహిళారైతులతో కలిసి పని చేస్తోంది' అంటోంది తేజస్వి.

పర్యావరణ ప్రేమికుల కోసం స్వాప్ పార్టీ

క్లోతింగ్‌ స్వాప్‌ పార్టీలు...

క్లోత్‌స్వాప్‌ పార్టీ అంటే.. వాడకుండా వార్డ్‌రోబుల్లో మిగిలిన దుస్తులని అమ్మకానికి పెట్టడం. ఈ ఏడాది అలాంటి పార్టీలనే నిర్వహించింది తేజస్వి. ఈ పద్ధతి పర్యావరణానికెంతో మేలు చేస్తుంది. దాన్నే దిశలోనూ ప్రారంభించాం. పర్యావరణ ప్రేమికులు బాగానే ఆదరించారు అనే తేజస్వి పుణెలో బీయెస్సీ ఫిజిక్స్‌ చదివి హైదరాబాద్‌ యూనివర్సిటీ నుంచి మీడియా కమ్యునికేషన్స్‌లో మాస్టర్స్‌ పూర్తిచేసింది. ఫిల్మ్‌మేకింగ్‌ని కెరీర్‌గా ఎంచుకున్న తేజస్వి స్నేహితులతో కలిసి చేసిన 'రేడియో విమెన్‌' అనే డాక్యుమెంటరీ చిత్రానికి యునెస్కో అవార్డుని గెల్చుకుంది. తాజాగా లాక్‌డౌన్‌ సమయంలో 'హీరా- లైఫ్‌ ఇన్‌ ఎ లాంగ్‌ షాట్‌' అనే లఘచిత్రాన్ని నిర్మించింది. హీరా అనే పారిశుద్ధ్య కార్మికురాలి గురించి తీసిన చిత్రం ఇది. దీన్ని ప్రదర్శించగా వచ్చిన డబ్బుని హీరా పిల్లల చదువుకోసం అందిస్తోంది తేజస్వి.

ఇదీ చదవండిః50 లక్షల మంది చూపు ఆమె వైపు.!

ABOUT THE AUTHOR

...view details