తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

చీరలన్నీ పాడైపోతే.. రాత్రంతా కూర్చుని మళ్లీ డిజైన్​ చేశా! - శ్రావ్య వర్మ సక్సెస్​ కథనం

అమ్మానాన్నలు ఇంజినీరింగే చదవాలని పట్టుబట్టారు.. ఆ అమ్మాయి మాత్రం సినిమాలమీద ఇష్టంతో చదువుని మధ్యలో ఆపేసి డిజైనింగ్‌ రంగాన్నే ఎంచుకుంది. ఆపైన వినూత్న ప్రయోగాలు చేస్తూ ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో తనదైన ముద్రవేసుకుంది. విజయ్‌దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌... కీర్తిసురేష్‌, రష్మిక మందాన వంటి సినీతారలకి వ్యక్తిగత స్టైలిస్ట్‌గా రాణిస్తూనే... రెడీ, టాక్సీవాలా, భీష్మవంటి చిత్రాలతో తనేంటో నిరూపించుకుంది శ్రావ్యవర్మ.

success story shravya varma
చీరలన్నీ పాడైపోతే.. రాత్రంతా కూర్చుని మళ్లీ డిజైన్​ చేశా!

By

Published : Oct 10, 2020, 1:12 PM IST

శ్రావ్యవర్మ.. వినూత్న ప్రయోగాలు చేస్తూ ఫ్యాషన్​ డిజైనింగ్​ రంగంలో తనదైన ముద్రవేసుకుంది. విజయ్‌దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌... కీర్తిసురేష్‌, రష్మిక మందాన వంటి సినీతారలకి వ్యక్తిగత స్టైలిస్ట్‌గా రాణిస్తూనే... రెడీ, టాక్సీవాలా, భీష్మవంటి చిత్రాలతో తనేంటో నిరూపించుకుంది

తాతయ్య ప్రోత్సాహం...

చిన్నప్పట్నుంచీ సినిమాలు బాగా చూసేదాన్ని. నటీనటులు వేసుకునే దుస్తుల్ని ఎక్కువగా గమనించేదాన్ని. పెద్దయ్యాక ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేస్తానంటే, ఇంట్లో ఒప్పుకోలేదు. దాంతో సికింద్రాబాద్‌లోని సీఎస్‌ఐఐటీలో ఆర్కిటెక్చర్‌లో జాయిన్‌ అయ్యా. ఉదయం కాలేజీకి వెళ్లి మధ్యాహ్నం వస్త్ర దుకాణాల ప్రకటనలకు డిజైన్‌ చేస్తూ పని నేర్చుకున్నా. తర్వాత ఓ టీవీ షోకి పనిచేశా. ఆ నిర్మాతే సినిమా ఛాన్స్‌ ఇచ్చారు. దానికి మంచి పేరు రావడంతో ‘రెడీ’ చిత్రానికి పనిచేసే అవకాశం వచ్చింది. అప్పటివరకూ ఇంట్లో తెలీదు. తర్వాత ఓ పత్రికలో వచ్చిన ఇంటర్వ్యూ చూసి అమ్మానాన్న చాలా కోప్పడ్డారు. తాతగారు మాత్రం మెచ్చుకున్నారు. తర్వాత ఇంట్లో వాళ్లు నన్ను అర్థం చేసుకున్నారు. అలా కాలేజీ చదువు పూర్తికాకుండానే ఈ కెరీర్‌లోకి వచ్చేశాను. పదేళ్లుగా నాదైన ముద్రతో పనిచేస్తున్నాను.

అందరినీ మెప్పించాలి...

సినిమాలకు పనిచేయడం మొదలుపెట్టిన కొత్తల్లో తెరపై నేను డిజైన్‌ చేసిన దుస్తులు మాత్రమే బాగా కనిపించాలనుకునేదాన్ని. రెండు మూడు ప్రాజెక్టులు చేశాకకానీ అర్థం కాలేదు... సినిమాలోని 24 క్రాఫ్ట్స్‌లో ఏదీ మరొకదాన్ని డామినేట్‌ చేయకూడదని. మనం రూపొందించిన దుస్తుల్లో నటీనటులు కంఫర్ట్‌గా.. సహజంగా ఉండాలంతే. స్టైలిస్ట్‌... పేరు స్టయిల్‌గా ఉన్నప్పటికీ ఈ రంగంలో ఒత్తిడి ఎక్కువే. ఒక క్లైంట్‌కు మాటిచ్చామంటే... ఆసుపత్రిలో ఉన్నా, ప్రమాదం జరిగినా అనుకున్న సమయానికి డెలివరీ చేయాల్సిందే. లేకపోతే షూటింగ్‌ ఆగిపోయి నిర్మాతకి చాలా నష్టం జరుగుతుంది. డిజైన్‌ చేసిన దుస్తులు దర్శకుడికీ, హీరోహీరోయిన్లకే కాదు కెమెరామ్యాన్‌కీ నచ్చాలి. వీళ్లలో ఎవరికి నచ్చకపోయినా పని మళ్లీ మొదలుకే వస్తుంది. హీరోకీ, హీరోయిన్‌కీ ఒకే రంగు దుస్తులు ఉండకూడదు. వెనకాల జూనియర్‌ ఆర్టిస్ట్‌లకు వేసుకునే దుస్తులతో మ్యాచ్‌ కాకూడదు. లేదంటే ఫ్యాబ్రిక్‌ని మార్చి మళ్లీ కుట్టాలి. స్టైలిస్ట్‌ది చాలా కీలకమైన బాధ్యత. పొద్దున 6 గంటలకు సెట్‌కి రమ్మంటే అయిదింటికే అక్కడ ఉండాలి.

విజయ్‌తో ప్రయోగాలు...
శ్రావ్య డిజైన్​ చేసిన కుర్తాలో విజయ్​ దేవరకొండ

పెళ్లిచూపులు' సమయంలో విజయ్‌ దేవరకొండ ఒక అవార్డు ఫంక్షన్‌కు వెళ్లాడు. ఆ వేడుకలో అందరూ విజయ్‌ సూట్‌ గురించే మాట్లాడుకున్నారు. అది డిజైన్‌ చేసింది నేనే. తనకి బాగా నప్పింది. 'ఇంత స్టైలిష్‌గా ఉన్నాడు ఎవరీ అబ్బాయి' అంటూ ఆరాలు తీశారు. స్టార్‌ అవ్వకముందు నుంచీ అతని గురించి నాకు తెలుసు. కాబట్టే ఒక స్టైలిస్ట్‌గా అతని వ్యక్తిత్వం ప్రతిబింబించేలా దుస్తులు డిజైన్‌ చేస్తాను. అప్పటికే పాపులర్‌ అయిన నటీనటులతో ఇటువంటి ప్రయోగాలు చేయలేం. అభిమానులు కూడా ఒప్పుకోరు.

విజయ్‌కి నోటా, టాక్సీవాలా సినిమాలతోపాటు అనేక వేడుకలకీ, మ్యాగజైన్లకీ డిజైనర్‌గా పనిచేశా. ఇంకా కీర్తిసురేష్‌, రష్మిక, పృథ్వీరాజ్‌, దుల్కర్‌ సల్మాన్‌, రక్షిత్‌ శెట్టి, క్రీడాకారులు సింధు, శ్రీకాంత్‌... వీళ్లందరికీ వ్యక్తిగత డిజైనర్‌గా పనిచేశా. ప్రత్యేక సందర్భాలకూ దుస్తుల్ని డిజైన్‌ చేస్తుంటా. కీర్తిసురేష్‌ జాతీయనటి అవార్డుని అందుకున్నప్పుడు కట్టుకున్న చీర, సైనా- కశ్యప్‌ల పెళ్లి దుస్తులూ... నేనే డిజైన్‌చేశా.

చీరలన్నీ పాడయ్యాయి..
సూపర్​స్టార్​ రజినీకాంత్​తో

రజినీకాంత్‌- కీర్తిసురేష్‌ నటిస్తున్న 'అన్నాత్తై' సినిమాకి పనిచేస్తున్నా. రామోజీ ఫిల్మ్‌సిటీలో తెల్లవారుజామున షూటింగ్‌. రాత్రి 11 గంటలకు ప్రొడక్షన్‌ అబ్బాయికి డిజైన్‌ చేసిన చీరలనిచ్చి పంపించాను. ఆ అబ్బాయి బైక్‌పై వెళ్తుండగా మధ్యలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో చీరలన్నీ పాడయ్యాయి. ఈ విషయం రాత్రి ఒంటి గంటకు ఫోన్‌చేసి ఎవరో చెప్పారు. ఆ అర్ధరాత్రి సమయంలో టైలర్లను నిద్రలేపి బతిమాలుకున్నాను. ఫ్యాబ్రిక్స్‌ దొరక్కపోతే వేరే చీరల్లో నుంచి కట్‌ చేసి రాత్రంతా కుట్టించి పొద్దున 6 గంటలకు స్వయంగా చిత్రీకరణ జరుగుతున్న చోటుకి వెళ్లి ఇచ్చి వచ్చాను. అది చాలా పెద్ద సినిమా. సెట్‌లో వందలమంది ఉంటారు. నా వల్ల షూటింగ్‌ ఆగిపోకూడదు కదా. అందుకే అంత శ్రమపడ్డాను.

నిర్మాతగానూ మారా..
మహానటి కీర్తి సురేశ్​తో

నా ఫ్రెండ్‌ ఒకరు ‘గుడ్‌లక్‌ సఖి’ కథ చెప్పాడు. వినగానే బాగుందనిపించి కీర్తిసురేష్‌కి చెప్పా. ఏం ఆలోచించకుండానే చేస్తానంది. అలాగే దేవీశ్రీప్రసాద్‌నూ అడిగాను. తనూ అంగీకరించాడు. వాళ్లు ఒప్పుకోవడంవల్లే మొదటిసారి నిర్మాతగా మారి ‘గుడ్‌లక్‌ సఖి’ చిత్రాన్ని నిర్మిస్తున్నా. ఇందులో కీర్తి ఎలాంటి మేకప్‌ లేకుండా సహజంగా నటిస్తోంది. ఆ సినిమాలో తన కాస్ట్యూమ్స్‌ని డిజైన్‌ చేసింది నేనే. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ దగ్గర వస్తువులు అమ్మే మహిళల వేషధారణ స్ఫూర్తితో తనకీ దుస్తులు డిజైన్‌ చేశా. నగేష్‌ కుకునూరు దర్శకత్వం వహించిన ఈ సినిమాని నవంబరులో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం.

ఇదీ చదవండిః'నాకు కళ్లు లేవు.. కానీ అమ్మ ప్రపంచాన్నే చూపించేసింది'

ABOUT THE AUTHOR

...view details