తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

పదే పదే చెప్పి విసిగించకన్నారు! - Pareshamma with vasundhara

సమయానికి వానలు పడక, బోర్ల నుంచి చుక్క నీరు రాక.. రైతన్నల ఆవేదనలను చిన్నప్పటి నుంచీ కళ్లారా చూసిందామె. అందుకే వారికి చేయూతనివ్వాలనుకుంది. ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో జల సంరక్షణ విషయంలో 16 గ్రామాల పల్లెల్లో చైతన్యాన్ని తెచ్చింది. ఆ కష్టమే తనకి యూఎన్‌డీపీ ఉమెన్‌ వాటర్‌ ఛాంపియన్‌ పురస్కారాన్ని అందించింది. ఆమే చిత్తూరు జిల్లాకు చెందిన పారేశమ్మ. తన అనుభవాలను వసుంధరతో పంచుకున్నారిలా...!

Interview with Pareshamma
Interview with Pareshamma

By

Published : Jun 4, 2021, 6:37 AM IST

మాది తంబళ్లపల్లెకి దగ్గర ఉన్న గోపిదిన్నె గ్రామం. ఇక్కడే ఐదో తరగతి వరకూ చదువుకున్నా. ఆపై పదోతరగతి వరకూ బురకాయల కోట రెసిడెన్షియల్‌ పాఠశాలలో చదువుకున్నా. తర్వాత ఐటీఐ చదివి ఓ డెయిరీలో ఉద్యోగం చేశా. ఈలోగా పెళ్లయ్యింది. కులాంతర వివాహం కావడం, ఎవరి సహకారమూ లేక.. ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు కూలి పనులూ చేశా. అదే సమయంలో ఫౌండేషన్‌ ఫర్‌ ఎకోలాజికల్‌ సెక్యూరిటీ (ఎఫ్‌ఈఎస్‌) సంస్థలో కమ్యూనిటీ రిసోర్స్‌పర్సన్‌ పోస్టు ఉందని తెలిసి ప్రయత్నించా. వారు ఇది ఉద్యోగం కాదు.. బాధ్యత అని చెప్పారు. గుజరాత్‌ కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థ రెండు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా పర్యావరణ పునరుద్ధరణ, వనరుల పరిరక్షణ వంటి అంశాల్లో కృషి చేస్తోంది. ఆ విధానాలను పల్లెలకు వెళ్లి రైతులకు చెప్పాల్సి ఉంటుంది. ఇది నాకు తెలిసిన రంగం. ఆసక్తి ఉన్న అంశం. అందుకే ఇష్టంగా ఒప్పుకున్నా. ఎందుకంటే.. మా నాన్న రైతు. నా చిన్నప్పుడు సాగునీటి కోసం ఆయనొక్కడే బావి తవ్వడం ఎప్పుడూ నా కళ్లలో మెదిలేది. తర్వాతి కాలంలో గ్రామస్థుల్లో చాలామంది బోర్లు తవ్వితే.. చుక్క నీరు పడని వైనమూ చూశా. అందుకే రైతులకు మేలు చేసే ఈ బాధ్యతల్ని ఇష్టంగా ఎంచుకున్నా.

ఊరూరా తిరిగి...
2015 నుంచి ఎఫ్‌ఈఎస్‌ సంస్థలో కమ్యూనిటీ రిసోర్స్‌ పర్సన్‌గా తంబళ్లపల్లె మండలంలోని పదహారు పంచాయతీల్లో పని చేస్తున్నా. మొదట్లో నలుగురిని పోగేయడానికి చాలా కష్టపడేదాన్ని. నిజానికి ఆ రైతులంతా వ్యవసాయంలో అనుభవమున్న వాళ్లే... కానీ ఆధునిక పద్ధతుల్ని, జల సంరక్షణ విధానాలను అనుసరించడంలో వెనకబడి ఉన్నారు. మొదట్లో ఏం చెప్పాలని ప్రయత్నించినా వినేవారు కాదు. అసలు నీకేం తెలుసు అని ఎదురు ప్రశ్నించేవారు. పదే పదే చెప్పి విసిగించకని కసురుకునే వారు. అయినా నేను వెనకడుగు వేయలేదు. ఓ మంచి లక్ష్యంతో పని చేసినప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయని సమర్థించుకునేదాన్ని. ఇంకాస్త సూటిగా, స్పష్టంగా వారిపై ప్రభావం చూపేలా చెప్పాలనే ఆలోచనతో ఆయా అంశాలపై పట్టు తెచ్చుకోవడం కోసం మా సంస్థ అధికారుల సాయంతో సాధన చేసేదాన్ని. ఆ ప్రాంతంలో భూసారం ఎంత? నీళ్లు ఎంత లోతులో ఉన్నాయి? ఏఏ పంటల్ని అక్కడ పండించొచ్చు, జాగ్రత్త పడకపోతే నష్టాలేంటి... ఇలా ఒక్కో అంశాన్నీ వారికి అర్థమయ్యేలా చెప్పేదాన్ని. అందరినీ ఒక తాటిపైకి తీసుకు రావడానికి చాలా కష్టపడ్డా. నీటి నిర్వహణపై సరదా ఆటలు ఆడించేదాన్ని. వివిధ ప్రయోగాలు చేయించేదాన్ని. మెల్లిగా తంబళ్లపల్లె మండలం ఆ చుట్టు పక్కల పదహారు గ్రామాల్లో పట్టు తెచ్చుకోగలిగా. క్రమంగా వారంతా ఉపాధి హామీ పనుల్లో భాగంగా నీటికుంటలు, చెరువులు, ట్రెంచ్‌లు, చెక్‌డ్యామ్‌లు నిర్మించుకున్నారు. వరి, టొమాటో వంటి వాటికి బదులుగా నీటి అవసరం తక్కువగా ఉండే చిరుధాన్యాలు, వేరుసెనగ వంటి పంటలవైపు దృష్టి మళ్లించారు. ఫలితంగా నీటి కొరత తగ్గింది. ఆ ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగాయి. ఫలితంగా పంట, దాంతో పాటు తగిన ఆదాయమూ అందుకుంటున్నారు. తాజాగా నీటి నిర్వహణలో మహిళల నాయకత్వం అనే ఆంశంపై యూఎన్‌డీపీ ఓ వర్క్‌షాప్‌ని నిర్వహించింది. వారు నా సేవల్ని గుర్తించి ఉమెన్‌ వాటర్‌ ఛాంపియన్‌ అవార్డునిచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ గౌరవం అందుకున్న ఏకైక మహిళను కావడం సంతోషాన్నిచ్చింది. మావారు గ్యాస్‌ ఏజెన్సీలో పనిచేస్తారు. మాకో పాప, బాబు. వారిని బాగా చదివించాలి, నా వల్ల మరెన్నో గ్రామాలకు లబ్ధి చేకూరాలి... ఇవీ నా లక్ష్యాలు!

కూతురిగా, భార్యగా, నెచ్చెలిగా, ఉద్యోగిగా.. పరిపూర్ణంగా మన్ననలు అందుకోవాలంటే ఎక్కువే కష్టపడాలి. ఇన్ని బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం కష్టమే. కానీ లక్ష్య సాధన కోసం నిబ్బరంగా ఉండాలి. ధైర్యంగా దూసుకుపోతేనే ఆనందాలను సొంతం చేసుకోవచ్చు.

- సిమెరాన్‌ భాసిన్‌, వైస్‌ ప్రెసిడెంట్‌, లీషియస్‌

ఇదీ చూడండి: అడవికే అమ్మయింది.. ఎందరికో ఆదర్శమయింది

ABOUT THE AUTHOR

...view details