తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

సేవలు చేస్తూ.. వ్యాపారవేత్తలై జీవితంలో గెలిచారు!

వ్యాపారవేత్తలు కావాలని కలలు కనలేదు... సేవలు చేసి పేరు తెచ్చుకోవాలనీ అనుకోలేదు. పరిస్థితులే వీరిలో పట్టుదలను పెంచాయి. నలుగురికీ ఆదర్శంగా నిలిపాయి.

Doing services .. Businessmen have won in life!
సేవలు చేస్తూ.. వ్యాపారవేత్తలై జీవితంలో గెలిచారు!

By

Published : Oct 25, 2020, 1:31 PM IST

భర్త ఐఏఎస్‌... భార్య సర్పంచ్‌

బిహార్‌లోని సీతామర్హి జిల్లాలో ఒక గ్రామం అది. ఊరి పేరైతే ఘనంగా సింహవాహిని అని ఉంది కానీ అభివృద్ధి ఆ ఊరికి దరిదాపుల్లో లేదు. అది తన అత్తగారి ఊరు కావడంతో రీతూ జైస్వాల్‌ తరచూ అక్కడికి వెళ్లేది. ఓసారి అలాగే వెళ్తుంటే ఆమె కారు రోడ్డుమీద బురదలో కూరుకుపోయింది. దాన్ని తీయడానికి సాయం వచ్చిన ఊరివాళ్లు తమ సమస్యలన్నీ ఆమె ముందు ఏకరువు పెట్టారు. సర్పంచ్‌ ఏ పనీ చేయించడం లేదన్నారు. దాంతో అక్కడ ఉన్నన్ని రోజులూ రీతూ ఊరంతా తిరిగిచూసి అందరితోనూ మాట్లాడింది. ఆ తర్వాత ఏడాదే ఎన్నికలు రావడంతో ఊరి సర్పంచ్‌గా పోటీ చేసి గెలిచింది. ప్రభుత్వనిధుల కోసం ఎదురుచూస్తూ కూర్చోకుండా సొంత డబ్బుతో ఊరికి రోడ్లు వేయించింది. కరెంటు తెచ్చింది. ఇంటింటికీ మరుగుదొడ్డి కట్టించింది. ప్రతి పనినీ స్వయంగా పర్యవేక్షిస్తూ మంచి పల్లెకి ఉండాల్సిన సౌకర్యాలన్నీ ఏర్పాటుచేసింది. ఎన్జీవోల సహకారం తీసుకుని పిల్లలందరినీ బడిబాట పట్టించింది. ఆదర్శ యువసర్పంచిగా బిహార్‌ తరఫున పలు జాతీయ వేదికలపైన ప్రసంగించిన రీతూ భర్త దిల్లీలో ఐఏఎస్‌ అధికారి. ఊరి సమస్యలన్నీ చూశాక తానేం చేయాలనుకుంటున్నదీ భర్తతోనూ పిల్లలతోనూ చర్చించిందట రీతూ. హాస్టల్లో ఉండి చదువుకుంటామని పిల్లలు హామీ ఇవ్వడంతో రీతూ అత్తగారింట ఉంటూ పట్టుదలగా గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపించింది.

భర్త ఐఏఎస్‌... భార్య సర్పంచ్‌

రోజుకూలీ వ్యాపారవేత్త అయ్యాడు!

కుటుంబ పరిస్థితి బాగోక పదహారేళ్లకే చదువు మానేసి కూలీగా మారాడు అరవింద్‌. రోజంతా పనిచేసి అలసి ఇంటికి చేరే ఆ కుర్రాడిని డీజే కార్యక్రమాలు ఆకట్టుకునేవి. ఎక్కడ అలాంటి కార్యక్రమం జరుగుతున్నా వెళ్లిపోయేవాడు. స్వతహాగా సంగీతంలో అభిరుచి ఉండటంతో త్వరగా ఆ కళ పట్టుబడింది. సొంత వాద్యబృందంతో ప్రదర్శనలు ఇవ్వడం మొదలెట్టాడు. హరియాణాలో ఏ వేడుక అయినా డీజే తప్పనిసరి. దాంతో అరవింద్‌ సంపాదన లక్షల్లోకి వెళ్లింది. కుటుంబం ఆర్థికంగా కోలుకుంది. ఒకసారి వేదిక కూలిన ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న అరవింద్‌ పటిష్ఠంగా ఉండే వేదిక సరంజామా ఎక్కడ దొరుకుతుందని ఓ వ్యాపారిని అడిగితే అతడు వెక్కిరించాడట. వాటిని ఇక్కడెవరూ తయారుచేయరనీ చైనా నుంచీ దిగుమతి అవుతాయనీ చెప్పి వాటిని కొనే స్థోమత నీకు లేదులే అన్నట్లు మాట్లాడాడట. అవేమీ నాణ్యమైనవి కావని తెలిశాక అరవింద్‌కి పట్టుదల పెరిగింది. కొన్ని నెలలపాటు పరిశోధించి, లోను తీసుకుని సొంతంగా దిట్టమైన వేదికకు పనికొచ్చే అల్యూమినియం సరంజామాని తయారుచేసి డీజేలకే కాదు, కార్పొరేట్‌ సంస్థలకూ అద్దెకిస్తున్నాడు. ‘నన్ను వెక్కిరించిన వ్యాపారికే మొదటి సెట్‌ తీసుకెళ్లి ఇచ్చాను’ అనే అరవింద్‌ తన ‘డెవిల్‌ ట్రస్‌’ కంపెనీ ప్రస్తుతం రూ.15 కోట్ల టర్నోవర్‌ సాధించడమే కాదు, ఎన్నో అవార్డులూ గెల్చుకుందనీ, వేదిక కూలే ఘటనలు ఇక ఉండవనీ గర్వంగా చెబుతాడు.

పట్టు వదలని విక్రమార్కుడు!

వరసగా అరడజను వ్యాపార ప్రయత్నాలు వైఫల్యాలుగా మారి లక్షల్లో అప్పులు మిగిలిస్తే ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందో రితేష్‌ లోహియాకి బాగా తెలుసు. వస్త్ర పరిశ్రమలో వాడే రసాయనాల తయారీతో వ్యాపారరంగంలోకి దిగాడు రితేష్‌. అది సరిగ్గా సాగకపోవడంతో స్టోన్‌ కటింగ్‌ ఫ్యాక్టరీ, తర్వాత వాషింగ్‌ పౌడర్‌ తయారీ మొదలెట్టాడు. అదీ లాభంలేదని స్టాక్‌ మార్కెట్‌లోకి అడుగుపెడితే అక్కడా అట్టర్‌ఫ్లాప్‌. చివరికి భార్య నగలమ్మి అప్పులు తీర్చాడు. కొన్నాళ్లపాటు మూతబడిన ఫ్యాక్టరీలో మిగిలిన సామాన్లను అమ్ముకుంటూ గడిపాడు. చివరికి అమ్మడానికి ఏమీ లేక, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ పాడుబడిన సామాను మధ్య కాలక్షేపం చేస్తున్న రితేష్‌ ఖాళీ పెయింటు డబ్బాని స్టూలు లాగా మార్చి రంగువేసి ఇంటికి తీసుకెళ్లాడు. చూసినవాళ్లంతా అది బాగుందనడంతో ఫ్యాక్టరీలో మిగిలిన చెత్తని కూడా పనికొచ్చే, కళాత్మక వస్తువులుగా మార్చడం మొదలెట్టాడు. వాహనాల విడి భాగాలూ, రంగుల డబ్బాలూ, గోనెసంచులూ... దేన్నీ వదలకుండా ఫర్నిచరుగా, అల్మారాలుగా, బ్యాగులుగా- ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతో అన్నీ అమ్ముడు పోయాయి. దాంతో రితేష్‌ ‘ప్రీతీ ఇంటర్నేషనల్‌’ సంస్థని పెట్టి రీసైక్లింగ్‌ ఉత్పత్తుల్ని పెద్ద ఎత్తున తయారుచేసి పలు దేశాలకు ఎగుమతులు చేస్తున్నాడు. ‘మొత్తానికి వ్యాపారంలో నెగ్గాలన్న నా పట్టుదల ఇలా తీరింది’ అంటాడు రితేష్‌.

పట్టు వదలని విక్రమార్కుడు!

ఇదీ చదవండిఃమా సేవ లక్ష మందికి చేరువయ్యింది!

ABOUT THE AUTHOR

...view details