రోజీ సల్దానా(roji saldana) కుటుంబం ముంబయిలోని మలావి చర్చ్(Malavi Church In Mumbai) ప్రాంతంలో నివాసముంటోంది. యాభై ఒక్క ఏళ్ల రోజీ సెయింట్ జేవియర్ స్కూల్లో టీచర్(Teacher). ఆమె భర్త పాస్కల్ ఆ దగ్గర్లోనే ఓ పూల దుకాణాన్ని నిర్వహిస్తుంటాడు. పెళ్లిళ్లు, స్కూల్లో వార్షికోత్సవాలకు పూలతో డెకరేషన్లు చేస్తుంటాడు. వారికి ఇద్దరు పిల్లలు. ఆ అందమైన కుటుంబాన్ని చూసి దేవుడికి కన్నుకుట్టిందేమో.. వారి సంతోషాలకు అడ్డుకట్ట వేశాడు. అయిదేళ్ల క్రితం రోజీకి మూత్రపిండాల సమస్య వచ్చింది. అప్పటివరకు సాఫీగా సాగిపోతున్న ఆ కుటుంబాన్ని ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలు చుట్టుముట్టాయి. రోజీకి డయాలసిస్(Dialysis) చేయిస్తేగాని బతకని పరిస్థితి.
‘ఏడాదిగా డయాలసిస్ చేయించుకుంటున్నా. 68 కిలోల నా బరువు 28కి పడిపోయింది. మంచానికే పరిమితమైపోయా. లేచి నాలుగడుగులు వేస్తే ఆ రోజు నరకమే. నాడి కొట్టుకోవడం తగ్గిపోయి కింద పడిపోయేదాన్ని. రోగనిరోధకతా తగ్గిపోయింది. దాంతో రకరకాల అనారోగ్యాలు చుట్టు ముట్టాయి. ఎన్నోసార్లు పక్షవాతం పలకరించింది. రక్తం గడ్డకట్టుకుపోవడంతో కొన్నాళ్లు కోమాలో ఉండిపోయా. మావారు, పిల్లలు నన్ను కంటికి రెప్పలా చూసుకోవడం మొదలుపెట్టారు. నాకు కావాల్సిన అత్యవసర వైద్య పరికరాలు, మందులు, అన్నింటినీ అందుబాటులో పెట్టే వారు. అలానే శ్వాస అందక ఇబ్బంది పడుతున్నప్పుడు ఆక్సిజన్ సిలిండర్లను తెచ్చిపెట్టారు’