దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న నగరాల్లో బెంగళూరు ఒకటి. అక్కడ ఆస్పత్రుల్లో పడకలే కాదు అంబులెన్స్‌లు కూడా దొరకని స్థితి. ‘‘ఇంటి నుంచి ఆస్పత్రికి, చనిపోయిన వారిని శ్మశానాలకు చేరవేసేందుకు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ పరిస్థితులను గమనించి ‘షీ ఫర్ సొసైటీ’ తరఫున తక్షణం పది అంబులెన్స్‌లను సిద్ధం చేశాం. ఆక్సిజన్ సదుపాయం ఉన్న ఈ అంబులెన్స్‌లను సదా సిద్ధంగా ఉంచుతూ రోగులను ఆస్పత్రులకు తరలిస్తున్నాం’’ అని వసుంధరకు వివరించారు ఆ సంస్థ వ్యవస్థాపకురాలు హర్షిణీ వెంకటేశ్. ఈ సేవలన్నీ ఉచితమే. మే 1న ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 1500మందికి పైగా రోగులను ఆస్పత్రులకు తరలించారు. ఈ సంస్థకు చెందిన పది మంది సభ్యులు వాట్సప్, ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా అంబులెన్స్ సేవలను పర్యవేక్షిస్తుంటారు. ఒకప్పుడు బెంగళూరుకే పరిమితమైన వీరి సేవలు క్రమంగా మరో ఐదు జిల్లాలకూ విస్తరించాయి. ‘షీ ఫర్ సొసైటీ’ సాయం అర్థించినవారి దగ్గరకు నిమిషాల్లోనే ఈ అత్యవసర సర్వీసులు బయలుదేరతాయి.
ప్రస్తుతం అంబులెన్స్‌లతోపాటు అత్యవసర సేవలకు వినియోగించే క్యాబ్‌లకు ఉన్న డ్రైవర్‌ల కొరతను తీరుస్తున్నారు. అలానే హోం క్వారంటైన్‌లో ఉంటున్న వారు, బయటకు వెళ్లలేని వృద్ధులు దివ్యాంగులు, గర్భిణులు వారి చిరునామా, ఔషధాల చీటీ వాట్సాప్ చేస్తే చాలు ఈ బృంద సభ్యులు వాటిని ఇంటికి చేరుస్తారు. మందుల ఖర్చు మాత్రం తీసుకుంటారు. బెంగళూరు నగరంలో 34 మురికివాడలున్నాయి. వాటిలో జీవనోపాధి కోల్పోయిన వారిని ఈ సంస్థ ఆదుకుంటోంది. సామాజిక మాధ్యమాల ద్వారా విరాళాలు సేకరించడం, లేదా దాతలే అవసరార్థులకు ఆహార పదార్థాలు అందించేలా చూస్తారు ఈ సభ్యులు. లాక్‌డౌన్ ఉన్న ఏప్రిల్, మే నెలల్లో 350 కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందించారు. ఉపాధి కోల్పోయిన వలసకార్మికుల్లో కొందరిని గుర్తించి పనులు చూపించారు.