తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

Women's Day Special: ఆమె లేకపోతే ఈ విశ్వమే శూన్యం.. - మహిళా దినోత్సవం 2022

Women's Day Special: ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఆమె లేకపోతే ఈ విశ్వమే శూన్యం. ఆమే అంతా.. ఆమెలోనే అనంతముంది. ఈ లోకానికి ఆమే ఓ వెలుగైంది. కిచెన్ నుంచి స్పేస్ దాకా ఆమె ముద్ర కనిపిస్తోంది. ఏ రంగంలో అడుగుపెట్టినా.. విజయాలందుకుంటోంది. ఎలా పొగిడినా... ఎంతలా చెప్పుకున్నా... తక్కువే అవుతుందేమో. అమ్మగా, ఇల్లాలిగా, అక్కా చెల్లిగా... ప్రతి బంధంతో ముడిపడి మన జీవనంలో భాగమైంది. . మహిళా దినోత్సవం సందర్భంగా 'ఆమె' కోసం ప్రత్యేకం.

Women's Day Special:
Women's Day Special:

By

Published : Mar 8, 2022, 6:30 AM IST

Women's Day Special:

ప్రతి మగాడి విజయం వెనక ఆడది ఉంటుందంటారు. అవునూ ఆమె లేకపోతే మగాడే లేడు. అంతెందుకు ఈ సృష్టే లేదు. ఆమె పోషించని పాత్రేదైనా... ఉందా? అంటే చెప్పడం కష్టమే. ప్రతి ఇంట్లో ఆమె లేనిదే పూట గడవదు. ఏ పని సాగదు. ప్రతి పనిలోనూ ఆమె ఉండాల్సిందే. ఆమె లేని ఇల్లు... ఎలా ఉంటుందో ఊహించడానికే కష్టంగా ఉంటుంది. పిల్లలను బడికి తయారు చేసే దగ్గర నుంచి... అలసిపోకుండా... ఆయాస పడకుండా... విసుగు చెందకుండా తాను ఉన్నన్నాళ్లు సేవ చేస్తూనే... ఉంటుంది. ఏ ప్రతిఫలం ఆశించని అమ్మగా, ఇల్లాలిగా... పాత్ర ఏదైతేనేం సమర్థంగా పోషిస్తూ... ఎవరూ భర్తీ చేయలేని విధంగా ముందుకు సాగే స్త్రీమూర్తి సేవలను ఏమని కీర్తించగలం.

చిన్నపిల్ల నుంచే ఆమెకు అన్ని పనులు అలవడుతాయి. అమ్మకు చేదోడు వాదోడుగా ఉంటూ... నాన్నకు సాయంగా.. ఇంట్లో సందడి చేస్తుంది. పెరిగి పెద్దైన తర్వాత ఓ ఇంటికి ఇల్లాలిగా వెళ్తుంది. అక్కడ అంతా కొత్త ప్రపంచం... అందరిలో కలిసిపోయి... ఆ ఇంటికి వెలుగులా మారిపోతుంది. భర్తే ప్రపంచంగా బతుకుతుంది. ఎంతలా అంటే ఆమె లేకుంటే భర్తకు ఏం పనిచేయాలో తోచనంత. భర్తకు అనుగుణంగా నడుచుకుంటూ... అత్తమామల బాగోగులు చూసుకుంటూ ఆమె పోషించే పాత్రకు వెలకట్టగలమా?

క్లిష్ట పరిస్థితులు ఎదురైతే... తాను సహనంగా ఉంటూ... ఎక్కడా కోపాన్ని ప్రదర్శించకుండా ఆమె పోషించే సంయమనం అనిర్వచనీయం. భర్తే సర్వస్వంగా బతికే ఆమెకు పిల్లలు మరో ప్రపంచం. వాళ్లే తన ధైర్యం. పిల్లల పెంపకం బాధ్యత మొత్తం తనదే. వాళ్లకు పాలు పట్టడం నుంచి వాళ్లు పెరిగి పెద్దయ్యే వరకు ఆమె చూపే ప్రేమకు ఏదైనా... కొలమానం ఉందా? భర్తలో సహభాగం అయిన ఆమె.. భర్తకు ఏ చిన్న హాని జరిగిన విలవిల్లాడిపోతుంది. ప్రతి పనిలోనూ ఆమె ఉండాల్సిందే.. లేకుంటే ఆ పని ముందుకు సాగదు.

పిల్లలను ఉదయాన్నే లేపడం, స్నానాలు చేయించడం, వాళ్లకు, ఆఫీస్​కు వెళ్లే భర్తకు బాక్సులు కట్టడం... టిఫిన్లు తయారు చేసి వాళ్లకి తినిపించడం.. పిల్లలను స్కూల్​కు పంపడం... తర్వాత ఇంటి పనులు చేయడం.. అత్తమామలను చూసుకోవడం.. బట్టలు ఉతకడం... ఇల్లు శుభ్రం చేసుకోవడం... మళ్లీ వంట చేయడం... పిల్లలను స్కూల్​ నుంచి తీసుకురావడం... ఆఫీస్​ నుంచి వచ్చిన భర్తకు సపర్యలు చేయడం... ఒకటా రెండా ఏమని చెప్పగలం... ఆమె సేవలను, కష్టాన్ని... తన ఇష్టాల్ని సైతం వదులుకుని కేవలం కుటుంబం కోసం పాటుపడే ఆ స్త్రీమూర్తిలేనిదే పూట గడవడం దేవుడెరుగు క్షణం గడవడమే గగనం.

సినిమాలోని పాత్రల్లాగా మనముంటే.. ఆ పాత్రల్ని నడిపించే డైరెక్టర్​లా ఆమె గైడ్ చేస్తుంది. తెరవెనకే పరిమితమై... తనపని తాను చేసుకుంటూ వెళ్తుంది. ఆమె సేవలను కేవలం మహిళా దినోత్సవం రోజునే గుర్తించకుండా... చేసే ప్రతిపని గుర్తిస్తే అదే చాలు... చిన్నపిల్లలా మురిసిపోతుంది. అమ్మా.. నువ్వు చేసిన వంట బాగుందని పిల్లలన్నా... నువ్వు అలసిపోయావు... కాసేపు రెస్టు తీసుకో అని భర్త అన్నా... అవే... ఆమెకు అపురూప క్షణాలు. అవే ఆమెకు వెలకట్టలేని బహుమానాలు. అవే మనం ఆమెకిచ్చే అవార్డులు.

ఇదీ చూడండి: మగువలు ఏం కోరుకుంటున్నారు?

ABOUT THE AUTHOR

...view details