యూఎక్స్ డిజైనర్ మాన్సీకి ట్రెక్కింగ్ గురించిన అవగాహనే లేదు. 2017లో ఓరోజు ఈమె స్నేహితుడు హేమల్ తన ట్రెక్కింగ్ షో కోసం అమ్మాయి ఎవరూ దొరకడం లేదని వాపోయాడు. అతనికి సాయం చేయాలనే ఉద్దేశంతో మాన్సీ ఆ షోలో చేస్తానంది. దానికి శిక్షణ నిమిత్తం మనాలీ వెళ్లింది. కొండా కోనలూ, పచ్చదనం ఆమెను ఆకర్షించాయి. అది మొదలు.. మరుసటి ఏడాది నుంచి మాన్సీ కూడా పార్ట్‌టైమ్ ట్రెక్ లీడర్‌గానూ అతనితో పాటు పనిచేసింది. ఈ మూడేళ్లలో మనాలీ, కాసోల్, పవగథ్ పర్వతాలు, సపుతారాల్లో బృందాలను ముందుండి నడిపించింది. లాక్‌డౌన్ లేకపోతే మరింత ఎక్కువగా చేసే వాళ్లమంటోంది 25 ఏళ్ల మాన్సీ. ‘నేను లీడ్ చేసిన వాటిలో సపుతారా పర్వతాల ట్రెక్ కొంచెం సవాళ్లతో కూడుకున్నది.
స్నేహితుడికి సాయం చేద్దామని: మాన్సీ దవే
ఐదుగురం వెళ్లాం. అక్కడికి వెళ్లాక చిరుతపులి సంచరిస్తోందని స్థానికులు చెప్పారు. దీంతో ఆయుధాలనూ తీసుకెళ్లాం. రాత్రులు ముగ్గురు పడుకుంటే ఇద్దరం కాపలా కాసేవాళ్లం. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదాలూ ఎదురవలేదు. ఇప్పుడు లేహ్, లద్దాఖ్‌కు ప్లాన్ చేస్తున్నాం. ఎక్కువ మంది అమ్మాయిలను ట్రెక్కింగ్ దిశగా నడిపించాలనుకుంటున్నా’ అంటోందీ గుజరాతీ అమ్మాయి.
ఇదో థెరపీ: తాన్యా గిన్వాలా
క్లినికల్ సైకాలజిస్ట్‌గా తాన్యాకి ఐదేళ్ల అనుభవముంది. గదిలో నాలుగు గోడల మధ్య మానసిక సమస్యలకు పరిష్కారం చూపలేమన్నది ఆమె భావన. అప్పుడే అడ్వెంచర్ థెరపీ గురించి తెలుసుకుంది. సంబంధిత కోర్సులతోపాటు ట్రెక్కింగ్ అండ్ మౌంటెనీరింగ్‌లో సర్టిఫికేషన్‌నూ చేసింది. ఓ ఎన్‌జీఓతో కలిసి అంగవైకల్యం ఉన్న వారినీ ట్రెక్కింగ్, మారథాన్లకు తీసుకెళ్లేది. ఈ అనుభవంతో ఏడాది నుంచి అడ్వెంచర్ థెరపీ ట్రెక్కింగ్‌ని ప్రారంభించింది.