Mahashivarathri: దేశమంతటా జరుపుకునే పర్వదినం మహాశివరాత్రి. అన్ని పండుగలూ పగటితో ముగిస్తే ఇది రాత్రి కూడా కొనసాగుతుంది. అందుకే పండుగ పేరులోనూ రాత్రి ఉంది. మాఘమాస బహుళ చతుర్దశి శివరాత్రి. చతుర్దశి అర్ధరాత్రి లోపు ముగిసి అమావాస్య ప్రవేశిస్తే ముందురోజే శివరాత్రి జరుపుకోవాలన్నది నియమం. బ్రహ్మ, విష్ణువులకు మహేశ్వరుడు ‘శివతత్త్వం’ ఉపదేశించిన సమయమే శివరాత్రి. నిరాకారుడైన ఈశ్వరుడు తనకు తానే రూపాన్ని సృష్టించుకున్నాడు. అదే లింగరూపం. లింగమంటే చిహ్నం, మంగళం, కల్యాణం, శ్రేయస్సు అనే అర్థాలున్నాయి. సమస్త జగత్తు దేనిలో లీనమై ఉందో అదే శివలింగం.
పంచభూతాత్మకమయం..
‘శివ’ అంటే పరమేశ్వరుడు. ‘శివా’ అంటే పార్వతి. ఇలా అయ్యవారిలో అమ్మవారు ఇమిడి ఉన్నారు. అంబికతో కలిసి సాంబశివుడై దర్శనమిస్తాడు. ఈ విశ్వం పంచభూతాత్మకమయం. మహా శివుడు విశ్వమంతటా తానే వ్యాప్తమై ఉన్నాడనేందుకు నిదర్శనంగా కంచిలో పృథ్విలింగం, జంబుకేశ్వరంలో జల లింగం, అరుణాచలంలో అగ్ని లింగం, శ్రీకాళహస్తిలో వాయు లింగం, చిదంబరంలో ఆకాశ లింగమై దర్శనం ఇస్తున్నాడు. లింగార్చనతో సర్వపాపాలూ హరించి సకల భోగాలూ ప్రాప్తిస్తాయట.
మోక్షప్రదాత..
దేవతాగణం శక్తి, యుక్తి, బలం, విద్య, ధనం మొదలైనవన్నీ ఇవ్వ గలదు. కానీ లయకర్త అయిన మహేశ్వరుడు మాత్రమే మోక్షం ప్రసాదించగలడు. అందుకే మహా శివరాత్రి నాడు నిద్ర మాని జాగరణ చేస్తూ ‘మనసును ఆవరించిన అవిద్య, అజ్ఞానం, అహంకారాలను తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించు స్వామీ’ అని ప్రార్థించమంటారు.
శివరాత్ర మహోరాత్రం నిరాహారో జితేంద్రియః
అర్చయేద్వా యథాన్యాయం యథాబలమవంచకః
యత్ఫలం మహాపూజయాం వర్షమేక నిరంతరం
తత్ఫలం లభతే సద్యః శివరాత్రౌ మదర్చనాత్
శివరాత్రినాడు ఉపవాసదీక్షతో ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తూ భక్తిశ్రద్ధలతో లింగాన్ని పూజిస్తే ఏడాదిపాటు పరమేశ్వరుణ్ణి పూజించినంత ఫలితం ప్రాప్తిస్తుంది. భక్తవశంకరుడైన శివుడు భక్తుల కష్టాలను తీరుస్తాడంటూ పురాణేతిహాసాల్లో కథనాలున్నాయి. భక్త కన్నప్ప నేత్రాలు అర్పించి శివసాయుజ్యం పొందాడు. అర్జునుడు శ్రీకాళహస్తి దర్శించి భరద్వాజముని ద్వారా ఆధ్యాత్మిక విషయాలు తెలుసు కున్నట్టుగా స్కందపురాణంలో ఉంది. బ్రహ్మ, విష్ణువులతో సహా దేవతా గణమంతా అర్చించే శివలింగాన్ని అర్చించడం వల్ల దుఃఖాలన్నీ తొలగి బుద్ధి వికసిస్తుందంటారు.