అయ్యప్ప స్వామి స్వయంగా తిరుగాడిన ప్రాంతమే పందళం. అచ్చెన్ కోవిల్ నది ఇక్కడ ప్రవహిస్తుంటుంది. ఈ నదీ తీరంలో అయ్యప్ప మణికంఠుని పేరుతో 12 ఏళ్ల పాటు నివసించిన పందళ రాజ మందిరాన్ని నేటికీ సందర్శించవచ్చు. మణికంఠుడు తపస్సు చేయాలని నిర్ణయించకున్నాక అతని పట్టాభిషేకం కోసం చేయించిన ఆభరణాలను మకర సంక్రాంతి రోజు మాత్రం ధరిస్తానని తల్లిదండ్రులకు మాట ఇచ్చినట్లు చెబుతారు. శబరిమల దివ్య మందిరంలో మకర సంక్రాంతి సందర్భంగా రాజలాంఛనాలతో పందళ రాజ వంశీయుల ఆధ్వర్యంలో పూజలు జరిగేట్లు అనుగ్రహించాడు. అప్పటి నుంచి సంక్రాంతి సందర్భంగా ఈ వేడుక అత్యంత వైభవంగా జరుగుతోంది.
అయ్యప్పను స్వయంగా సేవించుకున్న పరిచారకుల వంశీకులకు తిరువాభరణాల పెట్టెలను మోసే అవకాశం సొంతం.
ఏడాది పొడవునా ఈ తిరువాభరణాలను పందళం రాచమందిరంలో ఉంచుతారు. వీటికి పెద్దఎత్తున భద్రత ఉంటుంది. పందళ రాజ వంశీయులు రోజూ వీటికి పూజలు చేస్తుంటారు. ఈ వంశంలోని అతి పెద్ద వ్యక్తిని వళియ రాజు అని పిలుస్తారు. ఈయన ఆధ్వర్యంలోనే తిరువాభరణాల వేడుక జరుగుతుంది. ఈ లాంఛనాలు సంక్రాంతికి నాలుగు రోజుల ముందు ప్రారంభమవుతాయి. అప్పటికే పందళం అంతటా పండగ వాతావరణం నెలకొంటుంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది అయ్యప్ప భక్తులు అక్కడకు చేరుకుని ఇరు ముడులు కట్టుకొని ఎదురు చూస్తుంటారు. మొదటిరోజు పందళ రాజు సమక్షంలో ప్యాలెస్లో తిరువాభరణం పెట్టెలకు పూజలు చేశాక అక్కడే ఉన్న వలియ కోయిక్కర్ ధర్మశాస్త్ర ఆలయానికి చేర్చి భక్తుల దర్శనానికి అనుమతిస్తారు. ప్రభుత్వ అధికారులు, శబరిమల అధికారులకు పందళరాజు లాంఛనంగా తిరువాభరణాలు అప్పగిస్తారు.
తిరువాభరణాలకు పరశురాముడు గరుడ నాగ బంధనం చేసినట్లు చెబుతారు. అందుకే యాత్ర సాగినంతమేరా ఓ గరుడ పక్షి ఆకాశంలో చక్కర్లు కొడుతుందని చెబుతారు.
మంగళ వాద్యాల నడుమ ఇరుముడి కట్టుకొన్న స్థానిక భక్తులు ముందుగా బయలుదేరతారు. అనంతరం వలియ రాజు పెట్టెలను సాగనంపుతారు. ఈ యాత్రని తిరువాభరణ ఘోష యాత్ర అని పిలుస్తారు. ఈ యాత్ర జరిగినంత మేరా గ్రామాల్లో ప్రజలు ఇంటి ముంగిట దీపం వెలిగించి, పువ్వులతో అలంకరించి స్వాగతం పలుకుతారు. ప్రజలు మహారాజ వంశీయులకు మర్యాదలు చేస్తూ అభిమానం చాటుకొంటారు. అయిరూర్, పెరియాడ్, పుంగావనం, నీలక్కల్ మీదుగా దట్టమైన అటవీ ప్రాంతానికి చేరగానే గిరిజన ప్రజలు జేజేలు పలుకుతారు. అట్టతోడు మార్గం మీదుగా శబరిపీఠం చేరాక దేవాలయం దగ్గర నుంచి ఒక బృందం ముందుకు వచ్చి ఘనంగా స్వాగతం పలుకుతారు. ఆలయం దగ్గర పూజలు పూర్తవుతున్న వేళ.. తిరువాభరణం ఊరేగింపు స్వామివారి సన్నిధికి చేరుకుంటుంది. స్వామి వారికి అలంకరించే ఆభరణాలు కలిగిన పెట్టెను పవిత్ర పదునెనిమిది మెట్ల మీదుగా గర్భాలయానికి చేరుస్తారు. అక్కడ మేల్ శాంతి చేతుల మీదుగా ఆభరణాలను స్వామి వారికి అలంకరిస్తారు. వెనువెంటనే శబరిమలకు ఎదురుగా ఉన్న కాంతిమల మీద మకర జ్యోతి రూపంలో స్వామి దర్శనం ఇస్తారు. తరువాత రాత్రివేళ తిరువాభరణములతో స్వామి భక్తులను అనుగ్రహిస్తారు.