‘నకార్తికే సమో మాసం.. న కృతేన సమం యుగం.. నవేద సద్రసం శాస్త్రమ్.. నతీర్థ గంగాయ సమం..’ అంటే యుగాలలో కృతయుగంతో సమానమైన యుగం, వేదాలకు సమానమైన శాస్త్రం, గంగకు సమానమైనటువంటి నది లేనట్టే.. మాసాల్లో కార్తిక మాసానికి(Karthika masam 2021) సమానమైనదేదీ లేదని పెద్దల మాట. ఈ మాసం శివుడికి, మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. కార్తిక పురాణంలో కార్తీక సోమవార మహత్యం, కార్తీక పౌర్ణమినందు(karthika pournami 2021) జ్వాలాతోరణం.. ఇవన్నీ మహాశివుడి ప్రాముఖ్యతను తెలియజేసినట్టే కార్తిక శుక్ల బలి పాడ్యమి, కార్తిక ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి శ్రీహరి ప్రాముఖ్యతను స్పష్టంగా తెలియజేస్తాయి. కార్తిక పురాణంలో మొదటి 15 అధ్యాయాలు ఈశ్వరుడి ప్రాముఖ్యతను తెలియజేస్తే.. ఆఖరి 15 శ్రీహరి ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి. అందులోనూ అంబరీశుని కథా వృత్తాంతంలో మహా విష్ణువు దశావతారాల మూలం ఉండటం ఈ పుణ్యసంలో హరిహరాదులకు ఎంతటి ప్రాధాన్యత ఉన్నదో తెలుపుతుంది.
కార్తిక మాసంలో ముఖ్యంగా పాటించాల్సినవి..నదీ స్నానం, శివారాధన, దీపారాధన-దీపదానం, విష్ణు ఆరాధన-పురాణ పఠనం లేదా శ్రవణం, దానములు చేయడం. ఈ మాసంలో దీపాలు వెలిగించి శివ కేశవులను ఆరాధించి కార్తీక పురాణం ఎవరైతే చదువుతారో వారు చేసిన పాపాలు తొలగి, పుణ్యం కలిగి, జ్ఞానం సిద్ధించి, మోక్ష సాధనకు మార్గం ఏర్పడుతుంది.
స్నానం..
కార్తిక మాసంలో(Karthika masam 2021) రవి తుల రాశిలో ఉండటం వల్ల నదిలో నదీ ప్రవాహానికి ఎదురుగా నిలబడి స్నానం ఆచరించడం వల్ల మానవుడి శరీరానికి శక్తి కలిగి ఆరోగ్యసిద్ధి కలుగుతుంది. ఈ మాసంలో పుణ్య నదీ స్నానం వల్ల పాపాలు తొలగి పుణ్యం లభిస్తుంది.
దీపం..
‘దీపం జ్యోతి పరబ్రహ్మం.. దీప జ్యోతి జనార్దన.. దీపో మేహరతు పాపం.. సంధ్యాదీపం నమోస్తుతే!’. దీపమే పరబ్రహ్మం. దీపంలో లక్ష్మీ దేవి ఉందనీ.. దీపం నుంచి వచ్చేటువంటి తేజస్సులో బ్రహ్మ, విష్ణు,మహేశ్వరులు ఉన్నారనీ పురాణాలు చెబుతున్నాయి. అలాగే, అంధకారం దారిద్య్రానికి చిహ్నమని, కాంతి లక్ష్మీప్రదమని.. జ్ఞానానికి అభివృద్ధికి చిహ్నమని పెద్దలు చెబుతున్నారు.
♦ ప్రతి మనిషీ నిత్యం ఇంట్లో దీపం వెలిగించి దీపారాధన చేస్తే మంచిది. దీపారాధన ఇంటి యజమాని చేయాలి. కలియుగంలోని ప్రస్తుత కాలంలో ప్రతిరోజూ దీపం వెలిగించడం సాధ్యంకాని వారికి ఈ పుణ్య మాసంలో దీపారాధనకు మించిన గొప్ప అవకాశం ఏదీ ఉండదు.
♦ కార్తిక మాసంలోనూ నిత్యం దీపారాధన చేయడం సాధ్యపడని వారికి కార్తిక శుక్ల ద్వాదశి/కార్తీక పౌర్ణమి రోజు చేస్తే సంవత్సరంలో దీపారాధన చేస్తే వచ్చే పుణ్యఫలం ఈ రెండు రోజుల్లో చేయడంతో కలుగుతుంది.