ఖతర్... అరేబియా తీరంలోని ఓ చిన్న దేశం. కానీ ప్రపంచంలోకెల్లా సంపన్న దేశం. వాళ్ల తలసరి ఆదాయం సుమారు కోటి రూపాయలు. చమురు, సహజ వాయువుల నిల్వలతో సంపద సృష్టించుకున్న ఆ దేశం ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా ప్రపంచదేశాల్ని ఆకర్షిస్తోంది.
అందుకోసం సాగర జలాల్లో టన్నులకొద్దీ ఇసుకను నింపి, కృత్రిమ దీవిని సృష్టించింది. దానిమీద ఓ అందమైన నగరాన్ని నిర్మించింది. ‘స్వచ్ఛమైన సాగరజలాల్ని ఆనందిస్తూ ఇంట్లో కూర్చునే సుందర ప్రకృతి దృశ్యాల్ని ఆస్వాదించాలంటే మా కొత్త నగరానికి రండి, హాయిగా గడపండి’ అంటూ అటు వ్యాపారులతోబాటు ఇటు పర్యటకుల్నీ సాదరంగా ఆహ్వానిస్తోంది.
ఖతర్ రాజధాని నగరమైన దోహా, వెస్ట్ బే లాగూన్‌లో సుమారు నాలుగు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సృష్టించిన ఈ కృత్రిమ దీవిలో సుమారు 50 వేల కుటుంబాలు నిశ్చింతగా నివసించేందుకు వీలుగా విలాసవంతమైన అపార్టుమెంట్లూ విల్లాలూ పెంట్‌హౌసులూ టౌనుహౌసులూ ఉంటాయి. వీటితోబాటు విలాసవంతమైన వినోద కేంద్రాలూ సుందర సాగర తీరాలూ చూపరుల్ని ఆకట్టుకుంటాయి.
అరేబియా తీరంలో అందాల నగరం..! ముత్యాల నగరం!
ఒకప్పుడు చైనా, భారత్ నుంచి వచ్చే సరకుల రవాణాకి కూడలిగా ఉండేది ఖతార్ దేశం. ప్రస్తుత రాజధాని నగరమైన దోహా, ఒకప్పుడు చేపలు పట్టే గ్రామం. అయితే అప్పట్లో చేపలతోబాటు ముత్యాల్నీ వేటాడేవారు. జపాన్‌కు ముందు ముత్యాలకు పెట్టింది పేరు ఖతర్ ప్రాంతమే. ఆ తరవాత మేలుజాతి ఒంటెలూ గుర్రాల సంతానోత్పత్తికి ఈ దేశం పేరొందింది. ఆపై చమురు, సహజవాయువు నిక్షేపాలు బయటపడటంతో దాని దిశే మారిపోయింది.
కానీ తమ మూలాల్ని మర్చిపోలేదు. అందుకే ఒకప్పడు ముత్యాల వేటకు వెళ్లే ప్రదేశంలోనే ఈ కృత్రిమ దీవిని నిర్మించి దానికి ‘ద పెరల్ ఖతర్’ అని పేరు పెట్టారు. సుమారు 180 దేశాలకు చెందిన 28 లక్షల జనాభా ఉన్న ఈ దేశాన్ని గత 150 ఏళ్లుగా అల్ థాని కుటుంబం ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలిస్తోంది.
ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఎయిర్‌లైన్సులో ఖతర్ ఎయిర్‌లైన్సు ఒకటి. ఎడారి దేశమైన ఖతార్‌లో ఎటు చూసినా పొడి వాతావరణమే తప్ప పచ్చని చెట్లు అంతగా కనిపించవు. నీటి వనరులు చాలా తక్కువ. ఐదు శాతం నేల మాత్రమే వ్యవసాయానికి పనికొస్తుంది.
అదీ ఖర్జూర చెట్లు మాత్రమే. ఎక్కడా అటవీ ప్రాంతమనేదే ఉండదు. ఆహారపదార్థాలన్నీ చుట్టుపక్కల దేశాల నుంచే దిగుమతి చేసుకుంటారు. పండ్లూ కూరగాయల్ని మాత్రం పండించుకుంటుంటారు. అయితేనేం... చమురు తెచ్చిన సంపదతో సాగరజలాల్లోనూ నగరాల్ని సృష్టించేస్తూ ప్రపంచాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది ఖతర్.
అరేబియా తీరంలో అందాల నగరం..! ఆ దీవిలోకి అడుగుపెడితే..!
పన్నెండు జిల్లాలు లేదా ప్రాంతాలుగా విభజించి కట్టిన ఈ దీవిలో ప్రధాన ఆఫీసులూ వ్యాపారాల కోసం రెండు ఎత్తైన టవర్లు నిర్మించారు. వీటినే ‘ద పెరల్ గేట్ వే టవర్స్’ అంటున్నారు. ఫ్రెంచ్, ఇటాలియన్, స్పానిష్ డిజైన్లలో కట్టిన బీచ్ విల్లాలు చూడ్డానికే కాదు, నివసించడానికీ హాయిగా ఉంటాయి. అక్కడి నుంచి కోస్టా మలాజ్‌కి వెళితే అక్కడి ఇళ్లన్నీ ఉష్ణమండల దీవుల్లోని ఇళ్లను తలపిస్తుంటాయట.
రంగురంగుల పువ్వులూ మొక్కలతో అలంకరించినట్లున్న ఫ్లొరెస్టా గార్డెన్స్‌లోని ఇళ్లూ సందర్శకుల కళ్లను కట్టిపడేస్తాయి. హైరైజ్ అపార్టుమెంట్లూ భవంతులూ ఉన్న లా ప్లాజె సౌత్, మధ్యధరా తీర సంస్కృతిని ప్రతిబింబించే మెడినా సెంట్రల్, కృత్రిమ సరస్సులూ పచ్చని చెట్లతో కూడిన పెర్లిటా గార్డెన్స్, మొరాకన్ వాస్తు శైలిలో కట్టిన వివా బహ్రియా, ఇటాలియన్ వెనిస్ నగరాన్ని తలపించేలా కాలువలూ వంతెనలతో నిర్మించిన ఖానత్ క్వార్టియర్, క్రీడలన్నీ అందుబాటులో ఉండే జియార్డినో గ్రామం... ఇలా ఓ మినీ ప్రపంచాన్ని తలపించేలా ఈ దీవిని తీర్చిదిద్దారు. ఖానత్ క్వార్టియర్, వివా బహ్రియాలో నివసించేవాళ్లకి ప్రైవేటు బీచ్‌లతోబాటు రకరకాల నీటి క్రీడల్నీ ఏర్పాటుచేశారు.
అరేబియా తీరంలో అందాల నగరం..! పడవల్లో విహారం!
ఈ దీవిలో జనాభాని పెంచేందుకు ఇంటర్నేషనల్ స్కూలు, ఆసుపత్రి, ట్రాఫిక్ డిపార్టుమెంటు, సివిల్ డిఫెన్స్ సెంటర్, పెట్రోల్ స్టేషన్లు, ఫుట్‌బాల్ కోర్టు, సినిమా థియేటరు, పబ్లిక్ రవాణా, ఉద్యానవనాలు... ఇలా అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు సేవల్నీ అందుబాటులోకి తీసుకొచ్చింది ఖతర్ ప్రభుత్వం. దీవిలోని మెగాపోలిస్‌లో సినిమా చూడటం ఓ వింతైన అనుభూతిని అందిస్తుంది.
ఈ ఫైవ్ స్టార్ సినిమా కాంప్లెక్స్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన స్క్రీన్లతోబాటు పిల్లలకోసం వినోదాన్ని అందించే రకరకాల గేమ్‌జోన్లూ ఫుడ్‌కోర్టులూ షాపింగ్ మాల్సూ... ఇలా సకల హంగులూ వినోదాలూ ఉంటాయి. ఆ కృత్రిమదీవిలో స్వేచ్ఛగా విహరించేందుకు లిమోజీన్‌లూ వాటర్ ట్యాక్సీలూ సేవల్ని అందిస్తుంటాయి.
అరేబియా తీరంలో అందాల నగరం..! అరేబియా తీరంలో అందాల నగరం..! ఐరోపా, అరేబియా శైలిలో నిర్మించిన ద మర్సా మలాజ్ కెంపిస్కీ హోటల్ ఈ దీవికే ప్రత్యేక ఆకర్షణ. ఇందులో 69 సూట్లతో కూడిన 281 విలాసవంతమైన గదులు ఉంటాయి. ఈ గదుల్లో 24 గంటలూ పనిచేసేందుకు బట్లర్ అందుబాటులో ఉంటాడు.
హోటల్‌వాళ్లే పడవ టూర్లు ఏర్పాటుచేస్తారు. ఇక, దీవిలో దొరకని ఆహారం ఉండదంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు చెందిన రెస్టరెంట్లూ, కెఫెలూ ఉన్నాయిక్కడ. ఫిట్‌నెస్‌కోసం వందలకొద్దీ జిమ్‌లూ ఉన్నాయి. ఇంకా, జియార్జియో అర్మాణీ, హ్యూగో బాస్, హెర్మెస్, కెంజో, కిప్‌లింగ్, మల్బరీ... వంటి బ్రాండెడ్ సంస్థల అవుట్‌లెట్లూ ఫెరారి, రోల్స్‌రాయిస్... తదితర కార్ల షోరూమ్‌లతో కళకళలాడే ఈ దీవిని సందర్శించేందుకు విదేశీ పర్యటకులతోబాటు ఖతార్ ప్రజలూ ఎంతో ఆసక్తి కనబరచడం విశేషం.
ఇప్పటికే అల్లాదీన్ కింగ్‌డమ్, ఫ్లోటింగ్ మ్యూజియం, అల్ థకీరా నేచర్ రిజర్వ్, సూక్ వఖీఫ్ మార్కెట్... వంటి వాటితో పర్యటకుల్ని ఆకర్షిస్తోన్న ఖతర్, కొత్తగా సృష్టించిన ఈ సాగర నగరంతో పెట్టుబడిదారుల్నీ ఆహ్వానించడం విశేషం.
అరేబియా తీరంలో అందాల నగరం..!