తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

Teacher's Day : గురుశిష్యుల బంధం.. అమోఘం.. అద్వితీయం - relation between teacher and student

తల్లిదండ్రులు జన్మనిస్తే దాన్ని సార్థకం చేసేది గురువులు. ఆచార్యులే లేకుంటే అజ్ఞానంతో అలమటిస్తాం. అంధకారంలో కొట్టుకుపోతాం. అయోమయంలో మునిగిపోతాం! కుంగిపోతాం, కుమిలిపోతాం. పురాణాలూ ఇతిహాసాల్లో గురుశిష్యబంధం అమోఘమని చాటే కథలెన్నో ఉన్నాయి. ఆ సూచనలన్నీ ఇప్పటికీ అనుసరణీయమే.

గురుశిష్యుల బంధం.. అమోఘం.. అద్వితీయం
గురుశిష్యుల బంధం.. అమోఘం.. అద్వితీయం

By

Published : Sep 5, 2021, 5:19 AM IST

Updated : Sep 5, 2021, 6:10 AM IST

నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం

గురు పరంపరకు నమస్కరించే ఈ శ్లోకం నిత్యం ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటుంది. జ్ఞానసాగరాన్ని మథించినప్పుడే జీవన పరమార్థం నెరవేరుతుంది. ఇలాంటి ఉదాత్త జ్ఞానసాగర యానంలో గురుశిష్యులిద్దరికీ సనాతన ధర్మం కొన్ని నియమాలను నిర్దేశించింది. వాటిని అనుసరించినట్లయితే శిష్యుడి జీవనం సుడిగుండంలో చిక్కిన నావలా కాక సక్రమంగా సాగి, విజయం సాధిస్తాడు, గురువు తన జన్మను సార్థకం చేసుకోగలుగుతాడు. శిష్యులు గురువు నుంచి నేర్చుకుంటూ అభివృద్ధి పథంలో సాగాలన్నదే తాత్త్విక దృష్టికోణం.

గురువు లక్షణాలు

స్కాంద పురాణంలో గురువు బాధ్యతలు, కర్తవ్యాల గురించి శివుడు పార్వతీదేవికి ఇలా వివరించాడు..

శాంతో దాన్తో కులీనశ్చ వినీతశ్శుద్ధవేషవాన్‌
సదాచార స్సుప్రసిద్ధః శుచిర్దక్ష స్సుబుద్ధిమాన్‌
ఆశ్రయే ధ్యాననిష్ఠశ్చ మంత్ర తంత్ర విచక్షణః
నిగ్రహానుగ్రహేశక్తో గురురిత్యభిధీయతే

గురువు శాంతంగా ఉండాలి. వేషధారణ ఆదర్శవంతంగా ఉండాలి. నీతి నియమాలను పాటిస్తుండాలి. సద్బుద్ధి, మంత్ర తంత్రాలపై అవగాహన, అభినివేశం, నిగ్రహ, అనుగ్రహ సామర్థ్యాలు ఉండాలి. స్కందపురాణంతోపాటు యోగశిఖోపనిషత్‌, ముక్తికోపనిషత్‌, బ్రహ్మవిద్యోపనిషత్తులూ భారత భాగవతాది ఇతిహాస పురాణాలూ గురువును ఎలా సేవించాలి, గురువు అవసరం ఏమిటనే విషయాలను పలు సందర్భాల్లో పేర్కొన్నాయి.

కొద్దిపాటి తేడా

ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు, ఆచార్యుడు, గురువు అనే పదాల మధ్య కొద్దిపాటి భేదం వుంది. అధ్యయనం చేయించేవారు అధ్యాపకులు. వేదాలను బోధించడాన్ని అధ్యాపనం అనేవారు. అధ్యాపకునికి కింది స్థాయిలో బోధించేవారు ఉప-అధ్యాయి.. ఉపాధ్యాయుడు. ఆచార్య పదం ఆచరణ, ఆచార- పదాలకు సంబంధించింది. చర అంటే నడక, నడత. ఒక సాంప్రదాయంలోని నడవడికను గ్రహించి, చర్చించి, ఆచరించి, ఇతరులతోనూ ఆచరింపచేసేవాడు ఆచార్యుడు. విద్యార్థి, శిష్య పదాల్లోనూ చిన్నపాటి వ్యత్యాసముంది. విద్యను అర్థించేవారు విద్యార్థులు. శిష్యులంటే గురువుకు సేవచేస్తూ చదువుకోవడం. గురుకుల విద్యావ్యవస్థలో ఇలా ఉండేది.

ఆచినోతిహి శాస్త్రార్థాన్‌ ఆచారేస్థాపయత్యపి
స్వయం ఆచారతేయశ్చ తం ఆచార్యం ప్రచక్షతే

ఆచార్యుడంటే శాస్త్రాలన్నీ తెలిసి, సదాచారాలను తాను ఆచరిస్తూ ఇతరుల చేత ఆచరింపచేసేవాడు. ఆచార్యుని వద్దే ఉంటూ అధ్యయనం చేయడం గురుకులవాసం. ఒక స్థాయి వరకూ అధ్యాపకుడు, గురువు, ఆచార్యుడు అనే పదాలకు అర్థం ఒకటిగానే కనిపిస్తుంది. కానీ స్థాయిలో భేదముంది. గురువు ఏ శాస్త్ర విషయాలకీ కట్టుబడకుండా తనలో తాను ఆత్మానందాన్ని అనుభవిస్తుంటాడు. తాను చెప్పాలనుకుంటే శిష్యునికి చెబుతాడు. లేకుంటే మౌనంగా ఉంటాడు. ఎందరో మౌన గురువులు, ధ్యానంలో ఉండటం తెలిసిందే. సాధకునికి ఆచార్యుడిగా కూడా ఉండే గురువు దొరకటం అదృష్టం.

అడ్డదోవలు లేవు

భరద్వాజుడి కుమారుడు అవక్రీతుడు. అతను అందరి కన్నా గొప్పవాడు కావాలని, తపస్సుచేసి సకల విద్యలూ సంపాదించాలని అనుకున్నాడు. అందుకు తండ్రి సమ్మతి కోరాడు. భరద్వాజుడు విద్యలు గురువుల దగ్గరే నేర్చు కోవాలి తపస్సుతో కాదని హితవు చెప్పాడు. అవక్రీతుడు తండ్రి మాటను కాదని తపస్సు చేశాడు. దానికి మెచ్చిన ఇంద్రుడు వరం కోరుకోమన్నాడు. తనకు సమస్త విద్యలూ అనుగ్రహింమన్నాడు అవక్రీతుడు. విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవాలి గానీ, తపస్సుతో కాదని తండ్రిలానే చెప్పి వెళ్లిపోయాడు ఇంద్రుడు. అవక్రీతుడు మళ్లీ తపస్సు చేశాడు. అతనికి బుద్ధి చెప్పాలని వృద్ధుడి రూపంలో వచ్చాడు ఇంద్రుడు. పక్కనే ఉన్న గంగానదిలోకి గుప్పిళ్లతో ఇసుకను పోయసాగాడు. అదేమిటన్నాడు అవక్రీతుడు. ‘గంగానది పైన వంతెన కట్టడానికి’ అన్నాడు వృద్ధుడు. అవక్రీతుడు నవ్వి ‘అది సాధ్యమయ్యే పనేనా?’ అని ఎగతాళి చేశాడు. ఇంద్రుడు నవ్వి ‘తపస్సుతో సకల విద్యలూ నేర్వాలనుకోవడమూ ఇలాంటిదే! విద్య గురువు దగ్గరే నేర్చుకోవాలి. మరోలా చేస్తే నష్టమే’ అన్నాడు. దీని సారాన్ని విద్యార్థులు గ్రహించాలి. యుగాలు గడిచినా ఆ హెచ్చరికను విస్మరించలేం.

ఇలా ఆదర్శంగా..

గురువు కామక్రోధాదులకు దూరంగా వుండాలి. అజ్ఞాత వాసం చేసేటప్పుడు విరటుడి కూతురు ఉత్తరకు బృహన్నల రూపంలో ఉన్న అర్జునుడు గురువే. ఎంతో దగ్గరగా మెలిగాడు. కానీ ఆ సాన్నిహిత్యంలో కామ వికారాలేవీ లేవు. బోధన వృత్తిలో ఉన్న నేటి గురువులకు అర్జునుడు ఆదర్శనీయుడు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా వినయాన్ని వదలకుండా అభ్యసించాలనే విషయాన్ని భారతం అరణ్యపర్వంలోని కచ దేవయాని కథ వివరిస్తుంది. బృహస్పతి కుమారుడు కచుడు. విద్యార్జనకోసం శుక్రాచార్యుడ్ని ఆశ్రయించాడు. కచుడి మీద గురువు, ఆయన కుమార్తె చూపుతున్న శ్రద్ధకు తోటి విద్యార్థులు అసూయతో అంతంచేయాలనుకున్నారు. మరోపక్క దేవయాని తనను పెళ్లాడమని ఒత్తిడి. వీటన్నిటినీ ఎదుర్కొని విద్యార్జన చేశాడు కచుడు. ఇలా విద్యార్థులు గురువు మీద భక్తితో, బ్రహ్మచర్య దీక్షతో, సంకల్పశుద్ధితో మెలగాలి. అప్పుడే జీవిత పరమార్థం నెరవేరుతుంది.

పిల్లకోతి.. తల్లిపిల్లి..

తల్లికోతి పిల్లను పట్టుకోదు. పిల్లకోతే తల్లిని కరుచుకు పోతుంటుంది. ఇది మర్కటకిశోర న్యాయం. గురువు దగ్గర నేర్చుకునేందుకు ఇలా తపించాలి. అలాగాక గురువును లెక్కచేయకుంటే నష్టపోయేది శిష్యుడే. పిల్లి తన పిల్లలను రక్షించుకోవడానికి నోటితో జాగ్రత్తగా పట్టుకుని సురక్షిత స్థానానికి తీసుకెళ్తుంది. ఇదే మార్జాలకిశోర న్యాయం. గురువు తనను నమ్ముకున్న శిష్యుణ్ణి కనిపెట్టి కాపాడుతాడు. కనుకనే గురువు స్థితికారకుడైన విష్ణువుతో సమానుడయ్యాడు. గురుశిష్యుల అనుబంధం ఎంత గొప్పదంటే గురువుకు మరణానంతరం గయాశ్రాద్ధం పెట్టే అధికారం శిష్యుడికి ఉంది. గయలో శ్రాద్ధకర్మలు నిర్వహించడం ఉత్తమం అనే నమ్మకముంది.

Last Updated : Sep 5, 2021, 6:10 AM IST

ABOUT THE AUTHOR

...view details