తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

మితిమీరిన మూఢత్వంతో ప్రాణసంకటం

విశ్వాసం మితిమీరి మూఢత్వంగా మారితే.. వాస్తవిక ప్రపంచాన్ని వదిలి ఊహాలోకంలో విహరిస్తూ భ్రమల్లోకి వెళ్లిపోతే.. అది అనేక విపరిణామాలకు కారణమవుతోంది. స్వీయ బలిదానాలు, సామూహిక ఆత్మహత్యలు, హత్యలు వంటి ఘోరాలకు దారితీస్తోంది. ఒకరో.. ఇద్దరో కాదు.. దేశవ్యాప్తంగా ఏటా వందల మంది ఈ తరహా ఘటనలకు బలైపోతున్నారు. కుటుంబంలోనో, ఇంట్లోనో ఎవరో ఒక్కరి ప్రవర్తనలో ఇలాంటి తేడాలున్నా సరే అది మొత్తం సభ్యులందర్నీ కబళించేస్తోంది.

superstitions-sometimes-are-leading-to-murders
మితిమీరిన మూఢత్వంతో ప్రాణసంకటం

By

Published : Jan 28, 2021, 11:26 AM IST

మితిమీరిన మూఢత్వంతో వాస్తవిక ప్రపంచాన్ని వదిలి ఊహాలోకంలో విహరించే వారు ఇంటికి ఒకరున్నా.. ఆ కుటుంబమంతా ఛిన్నాభిన్నమైపోతుంది. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఈ తరహా మూఢనమ్మకంతో కన్న కుమార్తెలను తల్లిదండ్రులే చంపిన ఘటన నేపథ్యంలో మరోమారు ఇలాంటి వ్యక్తుల ప్రవర్తన చర్చనీయాంశమైంది.

సహజంగానే అనిపించినా..

ఈ తరహా విపరీత ప్రవర్తన కలిగిన వారు.. అందరిలాగే కనిపిస్తారు. ఎలాంటి సమస్యా లేనట్టే ఉంటారు. కానీ ఏదో ఒక సందర్భంలో వారిలోని అవాంఛనీయ లక్షణాలు బయటకు వస్తాయి. మొదట్లో వాటి తీవ్రత తక్కువగా ఉండటంతో వారి ప్రవర్తన ఒకటి రెండు సార్లు తప్ప సహజంగానే అనిపిస్తుందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆ దశలోనే వీరి సమస్యను గుర్తించి అవసరమైన చికిత్స, కౌన్సెలింగ్‌ ఇప్పిస్తే ఆ మానసిక దౌర్బల్యం నుంచి బయటకు తీసుకురావచ్చని సూచిస్తున్నారు. లేనిపక్షంలో ఆ సమస్య పెరిగి విపరిణామాలకు దారితీస్తుందని విశ్లేషిస్తున్నారు.
మదనపల్లె ఘటనలో చూస్తే పద్మజ ప్రవర్తనలో తేడాలున్నాయని కొన్నాళ్ల క్రితం గమనించిన ఆమె సోదరుడు.. ఎవరైనా మానసిక వైద్య నిపుణుడిని కలిసి చికిత్స తీసుకోవాలని వారికి సూచించినట్లు సమాచారం. తమకెలాంటి సమస్యా లేదని, ఇంకోసారి దానిపై మాట్లాడితే తమ ఇంటికి రావొద్దని పద్మజ చెప్పినట్లు తెలిసింది. జంట హత్యల తర్వాత పురుషోత్తం నాయుడు, పద్మజలను పరీక్షించిన మానసిక వైద్య నిపుణులు ఈ విషయం వివరించారు. మొదట్లోనే వారు తగిన చికిత్స తీసుకుంటే ఇంత ఘోరం జరిగేది కాదు.

ఒక్కరి విపరీత ధోరణి.. కుటుంబాల్నే కబళిస్తోంది

మూఢత్వంలో ఉంటూ.. భ్రమాత్మక లోకంలో విహరించే సమస్యలు ఇంట్లో ఒక్కరికి ఉన్నా చాలు.. ఆ ధోరణి కొన్ని సందర్భాల్లో కుటుంబం మొత్తాన్ని కబళిస్తుంది. రెండేళ్ల కిందట దిల్లీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మరణించారు. మోక్షప్రాప్తి కోసం వీరంతా ప్రాణాలు విడిచినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ‘మానవదేహం తాత్కాలికమైనది. కళ్లు, నోరు మూసుకోవటం ద్వారా భయాన్ని జయించొచ్చు. 11 మంది కలిసి సంప్రదాయాలు పాటిస్తే సమస్యలు తొలగిపోతాయి. మోక్షం లభిస్తుంది’ అంటూ మృతుల్లో ఒకరైన లలిత్‌ భాటియా తమ కుటుంబ సభ్యులందరి చావుకు కారణమైనట్లు వెల్లడైంది.

మదనపల్లె ఘటనలో తొలుత పెద్ద కుమార్తె అలేఖ్య మూఢత్వంలోకి వెళ్లారు. తర్వాత తమవాళ్లందరినీ ఆ మత్తులోకి తీసుకొచ్చారు. కొవిడ్‌ నేపథ్యంలో అంతా కలిసే ఉండటంతో అలేఖ్య మిగతా కుటుంబ సభ్యుల్ని కూడా ప్రభావితం చేయగలిగిందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.

అతి.. ప్రమాదమే

ఏ విశ్వాసమైనా పరాకాష్ఠకు చేరితే ప్రమాదమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెండున్నరేళ్ల కిందట తూర్పుగోదావరి జిల్లా కరపకు చెందిన అక్కాచెల్లెళ్లు సత్యవేణి, సత్తి ధనలక్ష్మి, ధనలక్ష్మి కుమార్తె వైష్ణవి ఆత్మహత్య చేసుకున్నారు. వీరంతా తమను దేవుడు పిలుస్తున్నారని, త్వరగా అక్కడికి వెళ్లాలంటూ పదే పదే కుటుంబసభ్యులతో చెప్పేవారు. తమ ఇంట్లో దుష్టశక్తులు తిరుగుతున్నాయని ప్రార్థనలు చేసేవారు. అదే మూఢత్వంలో బలవన్మరణాలకు పాల్పడ్డారు.

మరికొందరు ఈ తరహా మనస్తత్వంతో నరబలులు, చేతబడి, బాణామతి పేరిట హత్యలు చేస్తున్నారు. బలహీన మనస్కులను ఆసరాగా చేసుకుని మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. కొన్నాళ్ల కిందట తూర్పుగోదావరి జిల్లాలో రైస్‌పుల్లింగ్‌ ముఠా మాటలు నమ్మిన ఓ వైద్యుడు అధిక వడ్డీకి అప్పులు తెచ్చి రూ.5.50 కోట్లు చెల్లించారు. ఆ సంక్షోభంలో కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నారు.

అతిగా ఊహించుకుంటారు

మూఢత్వంతో వ్యవహరించేవారు.. ఏదో ఒక రూపంలో తమ భావాల్ని వ్యక్తపరుస్తారు. వాటిని మొదటే గమనించి వారికి మెరుగైన చికిత్స అందిస్తే నయమవుతుంది. ఇలాంటి ధోరణి కలిగినవారు అతిగా ఊహించుకుంటారు. తమ భ్రమే నిజమనుకుని.. ఎవరేం చెప్పినా వినరు. వీరికి కౌన్సెలింగ్‌ తప్పనిసరి. మదనపల్లె ఘటనలో అలేఖ్యకు భక్తి అధికం. ఆమె తనను తాను శివుడిగా భావించేవారు. ఆధ్మాత్మిక పుస్తకాలు చదివి.. ఆ ఊహాలోకంలోకి వెళ్లిపోయారు. కుటుంబం మొత్తం ఆమె వల్ల ప్రభావితం కావడమే ఈ ఘోరానికి దారి తీసింది.

శాస్త్రీయ దృక్పథాన్ని పెంచాలి

చిన్నతనం నుంచే విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచేలా పాఠ్యాంశాల్ని చేర్చి, బోధించాలి. గ్రంథాలయాల్లో శాస్త్రీయ విజ్ఞానాన్ని తెలియజేసే పుస్తకాలను అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వం వీటిపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలి. కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా తదితర రాష్ట్రాల తరహాలో ఏపీలోనూ మూఢవిశ్వాసాల వ్యతిరేక చట్టాన్ని రూపొందించాలి.

ABOUT THE AUTHOR

...view details