తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

Women's Day 2022: పురుషుల కంటే స్త్రీలు కొంచెం ఎక్కువ.. ఎందుకో తెలుసా..! - మహిళా దినోత్సవం 2022.

Women's Day 2022: స్త్రీపురుషులు సమానమే..! కానీ స్త్రీలు కొంచెం ఎక్కువ..! 'అదేంటీ.. జెండర్ ఈక్వాలిటీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు..?' అని అనుకోకండి.. నిజానికి సృష్టిలో స్త్రీపురుషులు ఎవరికి వారే ప్రత్యేకం. కానీ స్త్రీలకు కొన్ని ప్రత్యేకమైన సామర్థ్యాలు ఉంటాయి. సహనం, మానసిక పరిణతి, ఒక విషయాన్ని ఎదుటివారి కోణంలో ఆలోచించడం..ఇవే కాదు.. నిజానికి స్త్రీ సహజంగానే ఎన్నో అపూర్వ శక్తులు కలిగిన పవర్ హౌజ్..! ఆ ప్రత్యేకతలేంటో తెలుసుకోవాలంటే ఇది చదవండి మరి...

Special story on women's day 2022
Women's Day 2022: పురుషుల కంటే స్త్రీలు కొంచెం ఎక్కువ.. ఎందుకో తెలుసా..!

By

Published : Mar 8, 2022, 8:25 AM IST

Women's Day 2022:

రంగుల సంగతి మనకే బాగా తెలుసు..

రంగులు గుర్తించడంలో పురుషులకన్నా మహిళలు ఎన్నో రెట్లు మేలు..! ఇస్రాయిల్ అబ్రమోవ్ అనే సైంటిస్ట్ చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. దాదాపు యాభై సంవత్సరాలపాటు మానవ దృష్టిపై పరిశోధన చేసి, ఆయన ఈ విషయాన్ని కనుగొన్నారు. వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉన్న కాలంనుంచీ మహిళల్లో ఈ ప్రత్యేకమైన శక్తి ఏర్పడిందని వారి అభిప్రాయం. తినడానికి పనికివచ్చే ఆకులను, పండ్లను వాటి రంగునిబట్టి గుర్తించడంలో స్త్రీలు సిద్ధహస్తులట..!

ఒత్తిడిని కూడా ఆయుధంగా మార్చుకోగలం..

మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకునే వారిలో పురుషులతో పోలిస్తే స్త్రీలు చాలా తక్కువ. జార్జియా సిలానీ అనే పరిశోధకుడు దీనికి సైంటిఫిక్ కారణాన్ని కనుగొన్నారు. మానసిక ఒత్తిడికి గురైనప్పుడు స్త్రీలలో విడుదలయ్యే ఆక్సిటోసిన్ హార్మోన్ ఇందుకు కారణమని ఆయన నిరూపించారు. ఆయన పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే.. ఒత్తిడిలో ఉన్నప్పుడు స్త్రీలు తమ సమస్యను అధిగమించడానికి ఇతరులను సంప్రదిస్తారు. కానీ సమాజంలో ఉండే కొన్ని అపోహల వల్ల పురుషులు తమ సమస్యను ఎవరితోనూ పంచుకోకుండా లోలోపలే కుమిలి పోతారు. వారి ఒత్తిడిని కోపం రూపంలో దగ్గరి వారిపై చూపిస్తారు. దానివల్ల సమస్య మరింత జటిలమై తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే.. మహిళలు మానసిక ఒత్తిడిని జయించడంలో పురుషులకన్నా ముందున్నారు...!

మనకే బలమెక్కువ.!

ఆడది అబల అని ఈసారెవరైనా అంటే వూరుకోకుండా వారికి మీ బలం చూపించండి..! ఘెంట్ యూనివర్సిటీ పరిశోధనలో ఈ విషయానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు బయట పడ్డాయి. అవేంటంటే.. స్త్రీలు రెండు ఎక్స్- క్రోమో జోముల వల్ల జన్మిస్తారు. ఎక్స్ - క్రోమోజోము రిబో న్యూక్లియిక్ ఆమ్లాలను అధికంగా కలిగి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతే కాదు స్త్రీలలో ఉత్పత్తయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ అనేక రకాల నొప్పులను నివారిస్తుందట..! పరిశోధనల సారాంశం ఏంటంటే.. పురుషులతో పోలిస్తే స్త్రీలలో రోగనిరోధక శక్తి అధికం.

ప్రమాదాలు పసిగట్టగలం..

స్త్రీలలో ఉత్పత్తయ్యే కార్టిసాల్, ఎస్ట్రాడియోల్ హార్మోన్ల ప్రభావం వల్ల వారు ప్రమాదకరమైన వాతావరణాన్ని ముందే పసిగట్టగలరని క్యోటో యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. అంతేకాదు పాములని గుర్తించగల శక్తి మహిళలకు స్వతహాగా ఉంటుందని కూడా వీరు చెబుతున్నారు..!

ప్రపంచాన్ని చక్కదిద్దుతూ..

మహిళలందరూ ఒక స్థాయిలో తమ ప్రపంచాన్ని కాపాడుకునేందుకు రేయింబవళ్లూ కష్టపడేవారే. ఇంట్లోవాళ్లందరికీ సరైన సమయానికి అవసరమైనవన్నీ అందిస్తూ వారికి అన్నివేళలా తోడ్పాటునందించడం కేవలం మహిళల వల్లే సాధ్యం. వండర్ వుమన్ మొత్తం ప్రపంచాన్నే నిలబెట్టే బాధ్యతను భుజాల మీదకెత్తుకుంటే.. తమ ఇల్లనే ప్రపంచం బాధ్యతను ప్రతి మహిళా తన భుజాలపై మోస్తుంది. కొన్నిసార్లు అవసరమైతే దానికోసం త్యాగాలు కూడా చేస్తుంది. ఉదయాన్నే లేచిన దగ్గర్నుంచి ఇంట్లో ప్రతి ఒక్కరి అవసరాలు తెలుసుకుంటూ సూపర్ హ్యూమన్‌లా పనిచేయడంలోనే ఆమె రోజంతా గడిచిపోతుంది. అయినా తన చుట్టూ ఉన్నవారికి ఆనందాన్ని అందిస్తే చాలు.. ఆమె కళ్లలో సంతోషం కనిపిస్తుంది.

ప్రేమ విలువ తెలిసిన వ్యక్తులు..

మహిళలంటేనే ప్రేమమూర్తులు. ప్రేమ విలువ తెలిసిన వ్యక్తులు. ఆర్థిక సంబంధాల కంటే మానవ సంబంధాలకే స్త్రీలు ఎక్కువగా విలువనిస్తుంటారు. మగవారు ఎక్కువగా ఫలానా పనిచేయడం వల్ల వారికి వచ్చే లాభం గురించి ఆలోచిస్తే.. పదిమందికీ లాభం చేకూరే పనిని చేపట్టేందుకు స్త్రీలు ముందుంటారు. స్త్రీ అంటేనే అమ్మతనం. అమ్మ కంటే ఎక్కువ ప్రేమ విలువ తెలిసిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరుంటారు చెప్పండి? అందుకే ప్రేమనంతా ఏర్చికూర్చి ఒక్కచోట చేర్చిన వ్యక్తులుగా స్త్రీమూర్తులను చెప్పుకోవచ్చు.

కష్టసమయాల్లో ఆదుకుంటూ..

ఒక మహిళే మరో మహిళకు శత్రువు అన్నమాట మనం విన్నా.. అది తప్పని నిరూపించే సంఘటనలు నిత్యం అనేకం కనిపిస్తూనే ఉంటాయి. తోటి మహిళలకు సాయం చేయాలన్న తపనతో ఉండేవారు చాలామందే కనిపిస్తారు. మహిళా సమస్యలపై పోరాడేవారు.. బడుగుబలహీన వర్గాలకు చెందిన మహిళల కోసం పాటుపడేవారు.. ఇలా మన చుట్టూ చూస్తే ఎంతోమంది మహిళలు తోటి మహిళలకు సాయం చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే కేవలం మహిళలకే కాదు.. తోటివారందరికీ సాయం చేయాలనే తత్వం పురుషులతో పోల్చితే స్త్రీలలోనే ఎక్కువగా ఉంటుందట.

లోపాలున్నా పర్ఫెక్ట్..

మనుషులన్నాక లోపాలు లేని వ్యక్తులు ఎవరూ ఉండరు. అయితే ఆ లోపాలను తెలుసుకొని వాటిని ఒప్పుకొని.. సరిదిద్దుకోగలగడమే గొప్పదనం. ఇది స్త్రీలకూ వర్తిస్తుంది.ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక లోపం తప్పనిసరిగా ఉంటుంది. అయితే వాటిని తెలుసుకొని వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తూ ముందుకెళ్లేవారు ఎందరో.. అందుకే తప్పులు చేసినా ఎదుటివారు దాన్ని ఎత్తిచూపినప్పుడు బాధపడకుండా పాజిటివ్‌గా తీసుకోగలగాలి. ఆ తప్పును మరోసారి చేయకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. ఇలాంటి లక్షణం పురుషులతో పోల్చితే స్త్రీలలోనే ఎక్కువని ఎన్నో అధ్యయనాల్లో తేలింది.

మనమే వండర్ విమెన్.!

ప్రతి స్త్రీ స్వతంత్రంగా తన నిర్ణయాలు తనే తీసుకోగలిగిన రోజు తనలోనే కాదు.. ప్రపంచంలోనూ మార్పొస్తుంది. అయితే అలా ఆధారపడకుండా ఉండే రోజు రావాలంటే మాత్రం మహిళలు తమకున్న భయాలను వీడి ముందుకు నడవాల్సి ఉంటుంది.

  • ఆత్మవిశ్వాసం మనలోని భయాలను తొలగించేందుకు చక్కటి సాధనం. అందుకే స్త్రీలందరూ తమపై తాము నమ్మకం పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి.
  • దీంతో పాటు తప్పును తప్పుగా గుర్తించగలగడం, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే.. తాను సరైందని భావించిన విషయం వైపే ఉండడం అనేవి కూడా తన నుంచి మనం నేర్చుకోవాల్సిందే.
  • ప్రతి వ్యక్తిలో తనకు తెలియకుండానే ఎంతో శక్తి దాగి ఉంటుందట. నేను ఇది చేయగలనా? అని సందేహించినంత కాలం ఆ శక్తి ఎప్పటికీ బయటకు రాదు. అదే 'నేను చేయగలను..' అనుకుంటే మాత్రం ప్రతి ఒక్కరూ అది ఎంత కష్టమైన పనైనా చేయగలరు. ఇది స్త్రీలకైతే మరింతగా వర్తిస్తుంది.
  • ఎందుకంటే మగవారితో పోల్చితే స్త్రీలే ఎక్కువ పనిచేస్తారని ఎన్నో సర్వేల్లో వెల్లడైంది. పట్టుదలతో శ్రమిస్తే అనుకున్న దాన్ని సాధించడం వారికి పెద్ద కష్టమేమీ కాదు.
  • అన్ని విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి, మానవత్వం, జాలి, దయ వంటివన్నీ మహిళలకు కాస్త ఎక్కువే.. అయితే వీటిని మరింత ఎక్కువ చేస్తే చాలు.. మీరే వండర్ వుమన్..!

ఈ మహిళా దినోత్సవాన ప్రతి 'వండర్ వుమన్'కి వందనం. ప్రతి ఒక్కరి జీవితంలో వారి జీవితాన్ని మార్చిన, వారికి తోడుగా నిలిచిన వారి కోసం ప్రపంచంతో పోరాడి మరీ జీవితాన్ని నిలబెట్టిన వండర్ వుమన్ ఎవరో ఒకరు తప్పనిసరిగా ఉండే ఉంటారు. మరి, మీ జీవితంలో అలాంటి వండర్ వుమన్ ఎవరు?

ఇదీ చూడండి: 'ఆపదలో ఉంటే.. 9490555533నంబర్‌కు వాట్సాప్ చేయండి'

ABOUT THE AUTHOR

...view details