తెలంగాణ

telangana

మాఘశుద్ధ పంచమి అంటే ఏమిటి? ప్రత్యేకతలేంటి?

By

Published : Feb 16, 2021, 9:36 AM IST

'మండుటెండలో విపరీతంగా శ్రమించినవాడు చెట్టు నీడను ఆశ్రయిస్తాడు. అలాగే అమితమైన జ్ఞానం కోసం అన్వేషణ సాగించేవారు నిన్ను శరణు వేడుతారు' అని అధర్వణ వేదం జ్ఞానదాయిని సరస్వతిని కీర్తించింది. అఖిల సంపదలకు ఆధారం జ్ఞానం. అక్షయమైన సిరుల్ని అందించేది విద్య. మనలో బుద్ధిమత్వం, విచార శీలత్వం, దూరదర్శిత్వం, జ్ఞానశక్తిత్వాల్ని పెంపొందించి, కార్యోన్ముఖుల్ని చేసే కల్పవల్లి- శ్రీవాణి.

హృదయానికి ఆమె అనుగ్రహం లభిస్తే అది జ్ఞానవేదికే..
హృదయానికి ఆమె అనుగ్రహం లభిస్తే అది జ్ఞానవేదికే..

అవిద్య ఉన్నచోట ఆమె దృక్కులు ప్రసరిస్తే అది విద్యావాటిక. అజ్ఞానం నెలకొన్న హృదయానికి ఆమె అనుగ్రహం లభిస్తే అది జ్ఞానవేదిక. జడత్వం నిండిన చోట ఆమె కరుణ పల్లవిస్తే అది చైతన్య దీపిక. చీకటి ఆవరించినప్పుడు ఆమె తేజస్సు ప్రసరిస్తే అది వెలుగువాహిక. నాదమనే పరంజ్యోతితో ఈ జగత్తు పరిఢవిల్లుతోంది. ఆ శబ్దశక్తి, నాదానురక్తి, అనంత జ్ఞానస్ఫూర్తి- శ్రీభారతి.

మాఘశుద్ధ పంచమి- శ్రీపంచమి. వాగ్దేవిగా, విజ్ఞాన ఘనరూపిణిగా మహాశక్తి సరస్వతి సాకారమైన రోజు. శక్తి, సంపద, విద్య- ఈ మూడింటినీ అందరూ ఆకాంక్షిస్తారు. శివశక్తితో శివానిగా దుర్గ, విష్ణుశక్తితో వైష్ణవిగా మహాలక్ష్మి, బ్రాహ్మీశక్తితో బ్రాహ్మణిగా సరస్వతి ఆవిష్కారమయ్యారు. లలితా సహస్రనామ స్తోత్రం వీణాపాణిని స్తుతించింది. సరస్వతి బహురూప సుధాయిని. శుద్ధ సత్వ స్వరూపిణిగా తేజరిల్లే శారదాంబ. జగన్మాత నుంచి ఆవిర్భావమైన బ్రాహ్మీశక్తి. దేవదానవ సంగ్రామంలో తన కమండలంలోని నీటిని చిలకరించి, దానవుల్ని ఆమె అంతం చేసింది. భండాసురుడు మూకాస్త్రాన్ని ప్రయోగిస్తే, దేవతాగణాలకు వాక్కు లోపించింది. ఆ సందర్భంలో శ్రీవిద్య, సారస్వతాస్త్రాన్ని ప్రయోగించింది. లోకంలో వాక్కును పునరుద్ధరించింది. రాక్షసులు స్మృతి నాశక అస్త్రాన్ని ప్రయోగిస్తే, జ్ఞాన రూపిణి మహాధారణాస్త్రాన్ని వారిపై ప్రయోగించి, చేతనత్వాన్ని నెలకొల్పింది.

ఈ శక్తితత్వాన్ని మన నిత్యజీవన సమరానికీ సమన్వయం చేసుకోవచ్చు. అచేతనత్వం ఆవరించినప్పుడు జ్ఞానాన్ని అందించే సారస్వతాన్ని ఆశ్రయించాలని, స్మృతి లోపిస్తే నిరంతర మననంతో మహా ధారణను సొంతం చేసుకోవాలని శ్రీవాణి రూపం మనకు తెలియజేస్తుంది. సరస్వతి ప్రధానంగా సప్తయుతమైన సారస్వత శక్తుల దివ్య ఆకృతి. శ్రద్ధ, ధారణ, మేధ, వాక్కు, విధివల్లభా, జిహ్వాగ్ర సదన, శమాది గుణదాయిని అనేవి సారస్వత శక్తులు. ‘సరః’ అంటే వెలుగు, ప్రవాహం. మన జీవితాల్లో జ్ఞానమనే వెలుగును నిరంతరం ప్రవహింపజేసే దివ్వ తేజోమయి- సరస్వతి.
‘ప్రాణశక్తిః సరస్వతి’ అని వేదం చెబుతోంది. మనలో ఆత్మజ్యోతి ప్రకాశమే ప్రాణం. ఆ ప్రాణం మనలోని సర్వాణువుల్లో ప్రవహిస్తోంది. ఆ ప్రసరణ శక్తే సరస్వతి. సర్వాంతర్యామి శక్తి నిత్యత్వ సుధాయినీ, నవనవోన్మేష విలాసినీ, జన్మ జరా జాడ్య వినాసినీ, సద్గుణ సంవర్ధినీ సనాతనీ- అని సరస్వతిని త్రిమూర్తులు సంస్తుతి చేశారని ‘చండీ సప్తశతి’ వివరించింది. సరస్వతి విరాణ్మూర్తిమత్వం, అవతార తత్త్వాలను ఈ స్తోత్ర వైభవం ప్రతిఫలిస్తుంది.

శ్రీ అంటే సంపద. పంచమి అయిదు సంఖ్యకు సంకేతం. మేధ, తేజం, చైతన్యం, విద్య, శ్రద్ధ- ఈ అయిదింటినీ హంసవాహిని అనుగ్రహిస్తుంది. ఈ అయిదే అసలైన సంపదలని శ్రీపంచమినాడు అభివ్యక్తమైన సరస్వతి మనకు సందేశమిస్తుంది. స్వచ్ఛ స్ఫటికంగా, ధవళవర్ణ శోభిత్వంగా అలరారే సరస్వతి నిర్మలతకు, నిష్కల్మషత్వానికి ప్రతీక. ‘నా రూపమే నా సందేశం’ అనే రీతిలో భారతి ఎన్నో అంశాల్ని మనకు ఉపదేశిస్తోంది. సత్వగుణంతో వర్ధిల్లుతూ, సౌమనస్య భావాలతో, సౌజన్య మనస్కులై మనల్ని విలసిల్లమని సరస్వతీమాత ప్రబోధిస్తోంది.

- డాక్టర్‌ కావూరి రాజేశ్‌ పటేల్‌

ABOUT THE AUTHOR

...view details