విశ్వశాంతికి, సామాజిక అభ్యున్నతికి ధర్మమే ఏకైక మార్గమని రాముడు ఆచరించి మానవజాతికి మార్గదర్శిగా నిలిచాడు. విశ్వసాహితిలో రామ కథ, రామచరితం అద్భుతమైనవి. రామాయణాన్ని రసమాధుర్య రమ్యయుత మహాకావ్యంగా ఆర్షధర్మం దర్శిస్తోంది. పర్వతాలు స్థిరంగా ఉన్నంతవరకు, నదీనదాలు ప్రవహించేవరకు తాను రచించిన రామాయణం వర్ధిల్లాలని వాల్మీకి ఆకాంక్షించాడు. ఆ మహర్షి అభీష్టానికి అనుగుణంగా రామకథా రసవాహిని, నవనవోన్మేష జీవన పావన తరంగిణిగా నిరంతరం మన సంస్కృతిలో మమేకమైంది. భారతీయతకు దర్పణమై భాసిల్లుతోంది.
సమాజవికాసానికి, సంస్కృతీ పరిరక్షణకు వేదవిజ్ఞానం దారిదీపమై నిలుస్తుంది. అలాంటి వేద ధర్మాన్ని సమగ్రంగా, సంపూర్ణంగా శ్రీమద్రామాయణం ప్రతిఫలిస్తుంది. ర, అ, మ- అనే మూడు అక్షరాల మేలుకలయికే, రామశబ్దం. అగ్ని, సూర్య, చంద్ర తత్త్వాల్ని ఈ బీజాక్షరాలు సంకేతిస్తాయి. అష్టాక్షరీ, పంచాక్షరీ మంత్రాల సంపుటీకరణే రామనామం. అందుకే రామశబ్దాన్ని దివ్యతారకమంత్రంగా యజుర్వేదం కీర్తించింది. ‘ర’కారం సృష్టి ఆవిర్భావానికి, ‘మ’కారం సంలీనానికి సూచికలని, రామనామం సృష్టిచక్రానికి అవ్యక్త రూపమని కాళికాపురాణం ప్రకటించింది. ‘రామ’ అనే రెండక్షరాలు జీవాత్మ, పరమాత్మలకు సాకల్య ఆకృతులు. శ్రీరాముడి హృదయేశ్వరి సీత ఆత్మజ్ఞానానికి, రాముడు దైవత్వానికి ప్రతిబింబాలు. జీవుడు, దేవుణ్ని అనుసరించి ఉండాలనడానికి సీతారాముల అనుబంధమే తార్కాణం. ప్రాపంచిక విషయ భోగాలనే మాయ కమ్ముకున్నప్పుడు దైవస్మృతికి జీవుడు దూరమవుతాడు. సీతకు బంగారు లేడి కావాలనే లౌకికమైన కోరిక రాముడికి దూరం చేసింది. పరమాత్మ సామీప్యాన్ని కోల్పోయి అశాంతిని పొందింది. దుఃఖ కారకుడైన రావణుడి చెరలో చిక్కుకుని, పరంధాముడి రాకకై నిరీక్షించింది.