తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

రథ సప్తమి విశేషం ఏమిటి? ఏమేం చేయాలి? - History of Rathsaptami

మాఘ మాసం శుక్లపక్షం సప్తమి తిథి 'రథ సప్తమి'గా ప్రసిద్ధం. సూర్యరథం దక్షిణాయనం ముగించి, పూర్వోత్తర దిశగా పయనం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. మాఘ సప్తమి మొదలు.. వచ్చే ఆరు మాసాలూ ఉత్తరాయణ పుణ్యకాలం. అదితి, కశ్యప ప్రజాపతి దంపతులకు మహావిష్ణువు సూర్య భగవానుడిగా ఉదయించాడు కాబట్టి, నేడు 'సూర్య జయంతి' అని పురాణ గాథలు చెబుతాయి.

special story on Ratha Sapthami in telugu
special story on Ratha Sapthami in telugu

By

Published : Feb 19, 2021, 6:35 AM IST

సూర్యరథానికి కూర్చిన ఏడు గుర్రాలు ఏడు వారాలకు, పన్నెండు చక్రాలు పన్నెండు రాశులకు సంకేతాలు. సూర్యుడి పేరుతో ప్రారంభమయ్యేది భానువారం. శనివారంతో వారాంతమవుతుంది. మేషం నుంచి మీనం దాకా పన్నెండు రాశుల్ని పూర్తిచేయడానికి, సూర్యరథానికి ఒక ఏడాది పడుతుందంటారు. ఒకే సూర్యుడు పన్నెండు రూపాలు, పన్నెండు పేర్లతో ప్రకాశించడాన్ని ఆ విరాట్‌ పురుషుడి నేత్రావధాన ప్రభావంగా పరిగణిస్తారు. వేదవాక్యాన్ని అనుసరించి- ఉత్తరాయణం పుణ్యకాలంలా, ఆ సూర్యకాంతిలో జీవితం సాగడం మహాభాగ్యంగా వర్ణిస్తారు. ఉత్తరాయణ పుణ్యకాలం కోసమే భీష్మాచార్యులు అంపశయ్యపై ఎదురుచూశారు.

రుగ్వేదంలోని పదో మండలం ఎనభై అయిదో మంత్రమే సూర్యుడి పరంగా చెప్పిన గాయత్రీ మంత్రం! రోజూ ఉదయం సూర్యుడికి ఎదురుగా నిలిచి నమస్కరించే ఆచారం అనాదిగా వస్తోంది. సూర్యోపాసకుల నిత్య జీవితంలో సూర్యనమస్కారాలకు ప్రత్యేక స్థానముంది. ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్యుడికి యోగాభ్యాసం చేసేవారూ పెద్దపీట వేశారు.

రథ సప్తమి నుంచి వాతావరణంలో మార్పు కనిపిస్తుంది. ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుంది. ఉగాది నాటికి ప్రకృతికాంత సొగసులు సంతరించుకుంటుంది. పంటల పండుగ సంక్రాంతి తరవాత అవతరించే రథం పండుగ ఇది. రథ సప్తమినాడు ముంగిట్లో రథం ముగ్గులు సుందరంగా కనిపిస్తాయి. ఆ ముగ్గుల నడుమ పిడకలు వేసి, సూర్యభగవానుడికి ప్రియమైన పాయసం వండుతారు. పిడకలపైన పాలు పొంగించడాన్ని ‘సిరుల పొంగు’కు సంకేతంగా భావిస్తారు. అప్పటికే రైతులు ధాన్యరాశులను ఇళ్లకు చేర్చి ఉంటారు. ఉదయాన్నే ఇంటిల్లిపాదీ స్నానాలు ముగిస్తారు. గాయత్రీ జపం, ఆదిత్య హృదయం, సూర్యాష్టకం, సూర్య సహస్రం వంటి స్తోత్ర పాఠాలు వల్లిస్తూ పూజలు చేయడం రివాజు.

మహా విష్ణువు ప్రతిరూపంగా పూజించే సూర్యభగవానుడికి దేశవిదేశాల్లో ఘనంగా పూజలు నిర్వర్తిస్తారు. రథసప్తమి రోజున అరసవల్లి సూర్యదేవాలయం, కర్ణాటకలోని మైసూరు ఆలయాల వద్ద సూర్యమండల, సూర్యదేవర వూరేగింపులు ఉత్సాహంగా నిర్వహిస్తారు. మంగళూరు వీర వేంకటేశ్వరస్వామి కోవెలలో రథోత్సవం వైభవంగా జరుగుతుంది. తిరుపతి క్షేత్రంలో మలయప్పస్వామిని రథసప్తమి నాడు అలంకరించి- శ్రీదేవి, భూదేవి సమేతంగా సప్త వాహనాలపైన వూరేగిస్తారు. తిరుమాడ వీధుల్లో స్వామి సూర్యప్రభ, చిన శేష, గరుడ, హనుమ, చక్రాసన, కల్పవృక్ష, సర్వభూపాల వాహనాల్ని అధిరోహించి నయనానందంగా విహరిస్తారు. ఏడుకొండలవాడు సప్తవాహనుడై సప్తాశ్వ సూర్యుడిలా ప్రకాశిస్తాడు.

సూర్యుడి దేవాలయాల్లో కోణార్క్‌, విరించి నారాయణ క్షేత్రాలు (ఒడిశా); మొధేరా (గుజరాత్‌) ప్రఖ్యాతమైనవి. విదేశాల్లోనూ సూర్యారాధన సాగుతోంది. అందుకు చైనా, జపాన్‌, ఈజిప్టులు ఉదాహరణలు.

జీవరాశికి ప్రాణశక్తిని, ఉత్తేజాన్ని ప్రసాదించే అధిదేవత సూర్యుడు. సూర్యుడు జ్ఞానమండలం అని సూర్యమండలాష్టకమ్‌ చెబుతుంది. ‘జయాయ జయ భద్రాయ’ అంటుంది ఆదిత్య హృదయం. శరీరయాత్రలో జీవుడు చేసే కర్మలన్నింటికీ సాక్షీభూతుడు సూర్యుడు. బాహ్యప్రపంచాన్ని వెలిగించడంతో పాటు, అంతరంగంలో ఆవరించిన అజ్ఞాన అంధకారాన్ని తొలగించే జ్ఞానదీపం రవిబింబం. ప్రత్యక్ష దైవంగా సూర్యుణ్ని ఆరాధిస్తే పరబ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుందని సాధకుల ప్రగాఢ నమ్మకం. అందుకే సూర్యుడు సూర్యనారాయణ స్వామిగా రథ సప్తమినాడు పూజలందుకుంటున్నాడు.

ABOUT THE AUTHOR

...view details