కుల, మత, వర్గ భేదాలు లేకుండా సమైక్యంగా జరుపుకునేది దివ్యదీప్తుల దీపావళి.
దీప్యతే అనేన దీపః
ప్రదీపశ్చ దీపీ దీప్తా
ప్రకాశించేది, ప్రకాశింపచేసేది దీపం. వెలుగున్న చోట చీకటి ఉండదు. చీకటి- నిరాశకు, అజ్ఞానానికి చిహ్నం. వెలుగు- ఆనందానికి, జ్ఞానానికి సంకేతం. అంధకారం లేని చోట అజ్ఞానమూ ఉండదు. జ్ఞానదీపం నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆ దీప ప్రకాశనమే దీపావళి పర్వోద్దేశం.
శుభం కరోతు కల్యాణ
మారోగ్యం ధన సంపదా
శత్రు బుద్ధి వినాశాయ
దీప జ్యోతిర్నమోస్తుతే
దీపాన్ని వెలిగించినా, దర్శించినా పాపాలన్నీ పటాపంచలైపోయి పుణ్యప్రాప్తి చేకూరుతుంది. శుభం కలుగుతుంది. ఆరోగ్య సంపద లభిస్తుంది. శత్రుభావాలు నశిస్తాయి. ఒక్క దీపం వెలిగిస్తేనే ఇంత భాగ్యం చేకూరితే, ఇక దీపాల వరుసే పెడితే - ఆ పుణ్యప్రాప్తికి కొలమానమే ఉండదు. అందుకే విద్యుద్దీపాల కాంతి ఎంత ఉన్నా.. ఎప్పటికీ మన ఇళ్లల్లో దీపారాధన చేస్తూనే ఉంటాం.
దీపం జ్యోతిః పరబ్రహ్మ
దీపం సర్వతమోపహమ్
దీపేన సాధ్యతే సర్వం
సంధ్యా దీపాన్నమోస్తుతే
దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపం వెలిగిస్తే అసాధ్యమన్నది మన దరి చేరదు. కోరికలన్నీ నెరవేరి మనో వికాసం పొందుతాం.
దీపం రోజూ పెట్టుకుంటున్నా దీపాల వరుస మాత్రం ఆశ్వియుజ అమావాస్య నాడు అమర్చుకుంటున్నాం. కారణం లోక కంటకుడైన నరకాసురుని వధించిన శుభ సందర్భం. నరకుడు ఆది వరాహమూర్తికి, భూమాతకు పుట్టినవాడు. సాక్షాత్తు పరంధాముని కొడుకు. కడుపున పుట్టిన కొడుకు అయినా సరే దుర్మార్గుడైనందున స్వయంగా తండ్రే సంహరించి, లోక కల్యాణాన్ని కలిగించాడు. కన్న తల్లి అయినా కూడా అలాంటి కొడుకు సమసినందుకు సంతోషించింది భూమాత. భూలోక జీవులంతా తన సంతానమే. లోక క్షేమం కోసం తన బిడ్డను చంపడానికి సత్యభామగా అవతరించి శ్రీకృష్ణుడికి సహకరించింది. తల్లిదండ్రులిద్దరూ ఏకమై నరకుని సంహరించిన శుభ సందర్భాన్ని వేడుక చేసుకున్నారు. అదే దీపావళి పర్వదినం.
మన పండుగలలో ప్రతి దానిలోనూ, లౌకికార్థం, అంతరార్థం, పరమార్థం దాగి ఉంటాయి. వాటిద్వారా మనందరిలో ప్రశాంతత చేకూరుతుంది. దీపారాధనలో కూడా ఇవన్నీ గోచరమవుతున్నాయి.
దీపంలో ముఖ్యంగా మూడు రంగులుంటాయి. తెలుపు, నీలం, ఎరుపు. వీటి కలయికతో పసుపు వర్ణం భాసిస్తుంది. తెలుపు సరస్వతికి, నీలం లక్ష్మికి, ఎరుపు దుర్గాదేవికి ప్రతీకలు. కలగలిసిన పసుపు రంగు త్రిమాతల కలయికనే సూచిస్తుంది. ఇవి సత్త్వ రజ స్తమో గుణాలకు రూపాలు. త్రిమాతల ఐక్యరూపమే త్రిగుణాల సంయగ్రూపం. అందుకే నిత్యం దీపారాధన చేయమని వేదాలు ప్రబోధిస్తున్నాయి.
నిజానికి దీపం అంటే కేవలం తైలంతో వత్తిని వెలిగించడం కాదు. మన మనస్సునే ప్రమిదగా చేసి, భక్తినే నూనెగా పోసి, ఆత్మనే వత్తిగా తీర్చి, జ్ఞానాన్ని వెలిగించాలి. అప్పుడు ఆత్మజ్యోతి ప్రకాశించి, దైవసాక్షాత్కారం కలిగి, జన్మ తరించి, మోక్షమే ప్రాప్తిస్తుంది. అసలైన దీపారాధన ఇదే.
ఇక లౌకికంగా, సామాజికంగా తరచి చూస్తే- దీపావళి పండుగ ప్రయోజనం స్పష్టంగా అర్థమవుతుంది. ఇది శరదృతువు. వర్షాకాలం. రకరకాల సూక్ష్మజీవులు వీర విజృంభణ చేసే కాలమిది. వాటివలన అనేకానేక విషరోగాలు, మరణ యాతనలు కలుగుతాయి. వాటి నిర్మూలనకే ఈ దీపావళి. చిన్ని చిన్ని పాము బిళ్ళలను ఇంట్లో నాలుగు వైపులా ఉంచి వెలిగిస్తాం. వాటినుండి వచ్చే పొగ మెలికలు తిరుగుతూ ఇల్లంతా వ్యాపించి సూక్ష్మ క్రిములను చంపేసి, వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తుంది. మందుగుండు సామాను వెలిగించినందువల్ల వచ్చేపొగను, వాటి వాసనను పీలిస్తే... మన కడుపులోని నులిపురుగులు నశించి, మనకు ఎలాంటి నొప్పులు, వాతాలు రాకుండా ఆరోగ్య క్షేమం కలుగుతుంది. బాంబుల పేలుళ్లతో వచ్చే శబ్దాలతో చాలావరకు విషజాతి మరణిస్తుంది. మన చెవులలోని తుప్పు వదిలిపోయి, వినికిడి శక్తి పెరుగుతుంది.
భూచక్రాలు కూడా - ఆనాటి మట్టి నేలమీద, నేటి సిమెంటు ఫ్లోరు మీద దాక్కుని ఉన్న క్రిములను చంపేసి నేలకు తద్వారా మనకు క్షేమాన్ని చేకూరుస్తున్నాయి. పువ్వొత్తులు, చిచ్చుబుడ్లు, అగ్గిపుల్లలతో సహా అన్నిటి ప్రయోజనం ఒక్కటే- కనిపించని విషక్రిములను నశింపచేసి, మానవాళికి ఆరోగ్యాన్ని ప్రసాదించడం.
ఈ దీపావళిని దక్షిణ భారతదేశం నరకచతుర్దశి, దీపావళి అని రెండురోజులు గాను, ఉత్తరభారతదేశం ధనత్రయోదశి, నరకచతుర్దశి, దీపావళి అమావాస్య, బలిపాడ్యమి, యమ ద్వితీయ- అని ఐదు రోజులుగాను జరుపుకుంటున్నారు. ధన త్రయోదశి నాడు లక్ష్మీదేవి పూజ తప్పనిసరిగా చేస్తారు. ఈ త్రయోదశి నాడు- అకాల మరణం కలగకుండా ఉండటానికి యముడికి నమస్కరించి ఒక దీపాన్ని ప్రత్యేకంగా పెడతారు. దాన్ని యమ దీపం అంటారు. చతుర్దశి, దీపావళి రోజుల్లో దీపాలను ఎన్నో వరుసలుగా పేర్చి, అందంగా అలంకరించి, టపాసులు పేల్చుకుని, తీపిని తిని, ఉల్లాసంగా గడుపుతారు. పాడ్యమి వారికి నూతన సంవత్సరం. కొందరికి దీపావళి అమావాస్య నాడే కొత్త సంవత్సరం. విదియనాడు భగినీ హస్త భోజన దినంగా జరుపు కుంటారు. స్త్రీలు అన్నదమ్ములను పిలిచి, వండివార్చి ఆత్మీయతను పంచుతారు.
యావద్భారత జాతి జరుపుకునే ఈ నరకాసుర వధ పండుగను మరో కోణంలో చూద్దాం... జీవుల పాప ఫలితమే నరకప్రాప్తి. నరకుని చంపినవాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. మనలోని నరకమనే రాక్షసుని.. అంటే సర్వపాప ఫలితాన్ని నశింపచేసేవాడు పరమాత్మ. అందుకే ఆత్మజ్యోతిని- పరంజ్యోతిగా వెలిగిస్తే.. పరమాత్మ మనలోనే ప్రకాశిస్తాడు.
పాపమంటే పరపీడనమే తప్ప మరొకటి కాదు. నరకుడు చేసింది అదే. పరపీడన రూపమైన పాపాన్ని రూపుమాపడమే నరకాసుర సంహారం. అంటే మనలోని పరపీడన గుణాన్ని తుడిచి వేయడం, మనలోని పాపచింతనను తొలగించుకోవడం, ఆత్మజ్యోతిని వెలిగించడం. అదే దీపావళి. సర్వేజనా స్సుఖినో భవంతు
- డాక్టర్ పులిగడ్డ లలితవాణి
ఇదీ చూడండి:లక్ష్మీదేవి వాళ్లనే వరిస్తుంది.. ఎందుకో తెలుసా?