భోళాశంకరుడిని లింగ రూపంలో ఆరాధించడం మన సంప్రదాయం. ఆద్యంతాలు లేని ఆ అఖండ శక్తి అణువణువులో నిండి,నిబిడీకృతమై ఉందని శివారాధన పద్ధతులు చాటి చెబుతాయి. శివలింగాలను మూడు రకాలుగా చెబుతారు. అవి స్థావర, జంగమ, పార్థివ రూపాల్లో ఉంటాయి.. పర్వతాలు, వృక్షాలను లింగరూపంగా భావించి అర్చన చేస్తే అవి స్థావరాలు. చలనం ఉన్న క్రిమికీటకాదులను, జీవులను సంతృప్తి పరచడం జంగమారాధన. పాలు, మట్టి, గంధం మిశ్రమంతో లింగాన్ని చేసి ఆరాధించడం పార్థివం. ఈ పార్థివ లింగారాధనం సర్వాభీష్టాలను సిద్ధింపజేస్తుందని, స్థావర రూపంలో శివారాధనం ముక్తినిస్తుందని, జంగమారాథనం అంటే నేరుగా శివుడిని సంతోషపరిచినట్లని చెబుతారు. అందుకే కార్తీక మాసంలో ఈ మూడు రకాల ఆరాధనలకు విశేష ప్రాధాన్యం ఉంది. వేప, మామిడి, మారేడు, తులసి, రావి, జువ్వి, శమీ, కదంబం వంటి పవిత్ర వృక్షారాధన ఈ మాసంలో తప్పనిసరిగా చేయాలని చెబుతారు. తద్వారా ఆ వృక్షాల నుంచి లభించే స్వచ్ఛమైన జీవశక్తిని పొందుతారనేది అందులోని ఆంతర్యం. ఆవు, పాము, చిలక, పావురం, ఏనుగు, చేపలు, కాకులు వంటి జీవులకు ఆహారం వేయడం జంగమ తరహా శివపూజ. పార్థివ లింగాల అభిషేకాలకు ద్రవ పదార్థాలను వాడకూడదని, పూలతోనే అభిషేకం చేయాలని నిర్దేశించారు.
శివుడు అయిదు ముఖాలతో కూడిన అష్టమూర్తితత్త్వం. ఆయనకు అయిదు ముఖాలు, ఎనిమిది రూపాలు ఉన్నాయని చెబుతారు. శివ పురాణం, శత రుద్ర సంహిత వీటిని గురించి వివరిస్తుంది.
* శ్వేతలోహిత కల్పంలో శివుడి తొలి అవతారం ఎరుపు, నలుపు, తెలుపు రంగులతో కూడిన బాలుడిగా మొదలైంది. ఆ రూపాన్ని సద్యోజాత అని అన్నారు. అంటే బ్రహ్మ తలవగానే పుట్టినవాడని అర్థం. ఇతని వల్లనే బ్రహ్మకు సృష్టి చేసే సంకల్పం వచ్చిందని చెబుతారు.
* రెండో అవతారం రక్తకల్పంలో ఉంది. పరమేశ్వరుడు వామదేవుడనే పేరుతో ఎరుపు రంగులో ఉద్భవించాడు. ఈయన వల్ల బ్రహ్మకు సృష్టి చేసే శక్తి వచ్చింది.
* పీతవాసం అనే కల్పంలో శివుడు తత్పురుషుడనే పేరుతో పసుపు వర్ణంలో ఆవిర్భవించాడు. ఈయన బ్రహ్మకు సృష్టిని ఎలా విభాగించాలో తెలిపాడు.
* శివకల్పంలో ఈశ్వరుడు అఘోర అనే పేరుతో నల్లటి రూపంలో ఆవిర్భవించాడు. ఆయన సృష్టికి అవసరమైన జ్ఞానాన్నిచ్చాడు.