పంచభూతాలకు ప్రతీక అయిన ప్రకృతిని పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. మనం చేసే పూజలు భూ తత్త్వానికి, అభిషేకాదులు జలతత్వానికి, యజ్ఞయాగాది క్రతువులు అగ్నితత్వానికి, మంత్రోచ్చారణ వాయు తత్త్వానికి, ధ్యానం మొదలైన సాధనలు ఆకాశ తత్వానికి ప్రతీకలు. మొత్తంగా మనిషి మనిషిగా మారడానికి, ప్రకృతితో అనుబంధం పెంచుకోవడానికి, అంతిమంగా మోక్షాన్ని సాధించటానికి పంచభూతాత్మకమైన ప్రకృతే ఆలంబన అనే సందేశం ఇందులో దాగి ఉంది.
భూమండలాన్ని ఆవరించి ఉన్న పంచభూతాలు మనిషిలోనూ ఉన్నాయి. వాటి వల్లే మనిషి సుఖంగా జీవించగలుగుతున్నాడు. అవి తమ శక్తులు ప్రసారం చేయటంతో పాటు కర్తవ్యాన్ని ఏమరుపాటులేకుండా నిర్వహిస్తుంటాయి. అందువల్లనే మానవ జీవన వ్యవస్థతో పాటు మొత్తం ప్రాణి వ్యవస్థ నడుస్తోంది. ఈ విషయాన్ని మనిషి గుర్తించాలి. ఈ జీవనచక్రం సవ్యంగా సాగిపోవటానికి ప్రకృతితో, తనని తానను సమన్వయం చేసుకోవాలి. ప్రకృతిని ఆశ్రయించాలే కానీ ఆక్రమించకూడదు. ఈ సూత్రం ఆధారంగానే సనాతన భారతీయ ఆధ్యాత్మిక వ్యవస్థ రూపుదిద్దుకుంది.
మనిషిలో పంచకోశాలు ఉంటాయి. అవి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. వీటిలో అన్నమయ కోశం భూ తత్త్వానికి, ప్రాణమయ కోశం జలతత్వానికి, మనోమయకోశం అగ్నితత్వానికి, విజ్ఞానమయకోశం వాయుతత్వానికి ఆనందమయకోశం ఆకాశతత్త్వానికి సంబంధించి ఉంటాయి. వీటితో పాటు పంచభూతాల ప్రతీకలుగా మానవ శరీరంలో ఐదు నాడీకేంద్రాలు ఉంటాయి. వీటిని శక్తిచక్రాలు అంటారు. వీటిలో మూలాధార చక్రం భూ తత్వాన్ని, స్వాధిష్టాన చక్రం జలతత్వానికి, మణిపూరక చక్రం అగ్నితత్వానికి, అనాహతచక్రం వాయుతత్త్వానికి, విశుద్ధిచక్రం ఆకాశతత్త్వానికి ప్రతీకలుగా ఉంటాయి. ఈ ఐదు చక్రాలు కాకుండా శరీరంలో ఉండే ఆజ్ఞ, సహస్రార చక్రాలు అన్ని తత్త్వాలకు అతీతం. మనిషి ఆలోచనలు, నడవడిక, సంస్కారం, ప్రారబ్ధకర్మ వల్ల ఇవి ప్రభావితమవుతుంటాయి.
ప్రకృతిలోని పంచభూతాలను పరిరక్షించుకోవడం, కలుషితం కాకుండా చూడడం, భావితరాలకు ప్రాకృతిక వారసత్వ సంపద అందించడం మొదలైన అంశాల గురించి రుక్, యజుర్, అధర్వణ వేదాల్లో విస్తారంగా ఉంది.
- ‘ఓం భూశ్శాంతి ఓం భువశ్శాంతి..’ - భూమికి శాంతి కలుగుగాక. భూమ్యాకాశాల మధ్యలో ఉండే మొత్తం ప్రదేశమంతటికీ శాంతి కలుగుగా అంటుంది కృష్ణ యజుర్వేదం.
- అధర్వణవేదం వాయువును మొత్తం ప్రపంచానికి వైద్యుడిగా పేర్కొంది. రుగ్వేదంలో ‘యదతో వాత తే గృహే అమృతస్య నిధిరిత: తేన నో దేహి జీవాసి...’ అంటూ ప్రార్థన మంత్రం ఉంది. ‘నీతో అమృతనిధి ఉంది... ఓ వాయు దేవా! నీవు మాకు దీర్ఘ జీవనాన్ని ప్రసాదించమ’ని దీని అర్థం. మొత్తంగా ప్రకృతిలోని వాయుతత్త్వ ప్రాధాన్యాన్ని ఈ మంత్రాలు వివరిస్తున్నాయి.
- జలవనరుల పరిరక్షణ ప్రాధాన్యం అధర్వణవేదంలో కనిపిస్తుంది. నీటిని పాడుచేయటం మహాపాపమని, వర్షపునీరు అత్యంత పరిశుభ్రమైందని, ఈ నీటికి ఎన్నో వ్యాధులను నయం చేసే శక్తి ఉందని చెబుతుంది. ఇదే వేదంలో చెప్పిన ‘సముద్రే అంతర్నిహితాని నాభి’, రుగ్వేదంలోని ‘ఆప ఓషధుతః.. అవస్తు ద్యౌర్వనగిరయో హృషీకేశః’ తదితర మంత్రాలు జలవనరుల ప్రాధాన్యత, సంరక్షణ గురించి వివరిస్తాయి. నదుల్లో ఉమ్మి వేయడాన్ని కూడా నిషేధించాయి మన శాస్త్రాలు.