తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

Dowry Free Zone‌: ఇక్కడ.. వరకట్నానికి అనుమతి లేదు! - dowry problems

ఆడపిల్ల పుట్టగానే వరకట్నం గురించి భయపడే కుటుంబాల గురించీ వినుంటారు, కట్నం ఇచ్చుకోలేక ఇబ్బందులు పడ్డ తల్లిదండ్రులూ తెలిసే ఉంటారు, కట్నం కోసం వేధింపులకు గురైన ఆడపిల్లల వార్తలూ చదివే ఉంటారు. మరి ‘మేం కట్నం ఇవ్వం. తీసుకోం’ అంటూ అందరికీ ఆదర్శంగా నిలిచిన ఈ గ్రామాల గురించి విన్నారా..

Dowry Free Zone‌
Dowry Free Zone‌

By

Published : Oct 18, 2021, 5:52 PM IST

కేరళలోని మలప్పురం జిల్లాలో ఉన్న నిలాంబుర్‌ గ్రామం పొలిమేరల్లో అడుగుపెట్టగానే ఓ బోర్డు కనిపిస్తుంది. అదేదో స్వాగతం తెలిపేది కాదండోయ్‌. దాని మీద ‘మీరు వరకట్న నిషేధిత ప్రాంతంలోకి అడుగు పెడుతున్నారు’ అన్న అక్షరాలుంటాయి. దాదాపు 50 వేల జనాభాతో ఉండే ఈ మున్సిపాలిటీలో కట్నం ఊసే వినిపించదు. ఇంతకీ ఆ మార్పు ఎలా వచ్చిందీ అంటే... 2007లో నిలాంబుర్‌లో సొంత ఇల్లు లేని వారెందరున్నారో తెలుసుకోవడానికి ప్రభుత్వం ఒక సర్వే చేయించింది. అప్పుడు ఎక్కువశాతం ఇళ్లు బ్యాంకులో తాకట్టులో ఉన్నాయని తెలిసింది.

కారణం ఏంటంటే..

తాకట్టుకు కారణం ఏంటా అని ఆరా తీస్తే, కూతుళ్లకు కట్నం ఇవ్వడానికి ఇళ్లను తనఖా పెట్టారని తేలింది. పైగా ఆ ఊళ్లో పెళ్లి వయసు దాటినా పెళ్లి కాని ఆడపిల్లలు వెయ్యిమంది దాకా ఉన్నారనీ, పెళ్లయిన ఆడపిల్లల్లో సగం మంది ఒప్పుకున్న కట్నం ఇవ్వలేక పుట్టింటికి వచ్చారనీ బయటపడింది. ఈ సర్వే రిపోర్టు చూసి ఊరి పంచాయితీ ప్రెసిడెంట్‌ ఆర్యదాన్‌ షౌకత్‌ చలించిపోయాడు. ఎలాగైనా ఈ పరిస్థితిని మార్చాలనుకున్నాడు. వరకట్నాన్ని నిషేధించడానికి వర్క్‌షాపులూ, సమావేశాలూ పెట్టి ప్రజల్లో అవగాహన కల్పించడం మొదలుపెట్టాడు. చాలామంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయడమూ, వీధి నాటకాలు వేయడం లాంటివి చేశారట. నెమ్మదిగా ప్రజల్లో మార్పు వచ్చింది. అలా కొంతమంది అబ్బాయిలు కట్నం తీసుకోకుండా వివాహం చేసుకుంటామంటూ ముందుకొచ్చారు. మొత్తానికి ఆ ఊరి ఆడపిల్లలందరికీ కట్నాలు లేకుండా పెళ్లిళ్లు అయ్యాయి. ఊరేమో ‘డౌరీ ఫ్రీ జోన్‌’ గా మారింది.

ఆ ఊసెత్తినా ఊరుకోరు!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌ అనే జిల్లాలో సేవాఖేడా అనే ఓ చిన్న ఊరుంది. 400 మంది ఉండే ఆ ఊళ్లో దాదాపు 80 ఇళ్లు ఉంటాయంతే. కానీ ఆ చిన్న పల్లెనే ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాలనూ మారుస్తోంది. ఓ ఏడాది క్రితం వరకూ ఇక్కడ కూడా అప్పు చేసైనా సరే ఆడపిల్లలకు కట్నం ఇచ్చి పెళ్లిచేసేవారు. అలా 78 కుటుంబాలు అప్పుల్లో మునిగిపోయాయి. కొంతమంది అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్నారట కూడా. దీంతో ఊరంతా కలిసి ఈ వరకట్నం పీడ వదిలించుకోవాలను కున్నారు. దీనికి ఓ సేవా సంస్థను నడిపే పుత్తన్‌ లాల్‌పాల్‌ కూడా సాయం చేయడంతో ‘మనమంతా అసలు కట్నం తీసుకోవద్దూ, ఇవ్వద్దూ’ అంటూ ఊరి ప్రజలందరూ ప్రతిజ్ఞ చేసుకున్నారు. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనను పాటించకపోతే వాళ్లను ఊరి నుంచి బహిష్కరిస్తారట. దీంతో ఇప్పుడు ఇక్కడి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ ఊళ్లోనే కాదు, చుట్టుపక్కల గ్రామాల నుంచీ సంబంధం కుదుర్చుకున్నా కట్నం అనే మాటలేకుండానే పెళ్లి చేసుకుంటున్నారు. ప్రతి ఇంటి గోడ మీద కూడా ‘మేం కట్నం తీసుకోలేదు’ అని రాసుకుంటున్నారు.

కట్నమడిగితే వెలేస్తారు!

ఎక్కడైనా బాండ్‌ పేపర్‌ మీద క్రయవిక్రయాల గురించో ఆస్తుల పంపకాల సంగతో రాసుకుంటారు. కానీ జమ్ము కశ్మీర్‌లోని గందర్‌బల్‌ జిల్లా బాబా వయిల్‌ అనే ఊళ్లో మాత్రం ‘మా గ్రామంలో వరకట్నాన్ని వ్యతిరేకిస్తున్నాం. దీనికి మేం ఎప్పటికీ కట్టుబడే ఉంటాం’ అని రాసుకుని ఊరి పెద్దలంతా కలిసి సంతకాలు చేశారు. 30 ఏళ్ల క్రితం చేసుకున్న ఆ ఒప్పందానికి విలువ ఇస్తూ నేటి యువకులూ పాటిస్తున్నారు. పేదరికం, వరకట్నం కారణంగా అమ్మాయిలకు పెళ్లిళ్లు కాకుండా ఉండిపోవడం చూసి ఊరి పెద్దలంతా కలిసి అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నారట. వెయ్యిమంది జనాభా ఉండే ఈ ఊళ్లో కట్నం తీసుకోకపోవడమే కాదు, వివాహాలు కూడా సింపుల్‌గా చేయాలనే నిబంధన ఉంది. పైగా పెళ్లి ఖర్చులకూ, పెళ్లికూతురు దుస్తులకూ అబ్బాయే డబ్బులు ఇవ్వాలట. కట్నం అడిగితే ఆ కుటుంబాన్ని ఊరంతా వెలేస్తుందట. మసీదుల్లోకి కూడా వాళ్లను అనుమతించరట.

ఇదీ చూడండి: Manasulo Maata: నువ్వు లేవన్నది అబద్ధం అని చెప్పరా...

ABOUT THE AUTHOR

...view details