రథసప్తమి అనేది కాలానుగుణంగా జరిగే మార్పుని కూడా సూచిస్తుంది. ఎముకలు కొరికే చలికాలం నుంచి వెచ్చవెచ్చని వేసవికి ఆహ్వానం పలుకుతుంది. అంటే వసంత రుతువుకి స్వాగతం పలకడమే కాకుండా పంట కోతలను కూడా ప్రారంభించడానికి ఇది చాలా అనువైన సమయం. రథసప్తమి రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి పుణ్యస్నానం ఆచరిస్తారు. అయితే ఇలా స్నానం చేసే ముందు జిల్లేడు ఆకులు ఏడు తీసుకొని ఒకటి తల మీద, రెండు భుజాల మీద, రెండు మోకాళ్ల మీద మరో రెండు పాదాల మీద పెట్టుకొని తలస్నానం చేస్తారు. స్నానం చేసే సమయంలో-
'సప్త సప్త మహా సప్త
సప్త ద్వీప వసుంధర
సప్త అర్క పర్ణ మదయా
సప్తమ్యం స్నానమాచరేత్||' అనే శ్లోకాన్ని విధిగా పఠించాలి. ఇలా చేస్తే ఆ ఏడాదంతా చేపట్టిన ప్రతి పని విజయవంతంగా ముగుస్తుందన్నది భక్తుల నమ్మకం.
పూజా ఏర్పాట్లు..
స్నానానంతరం రథం లేదా రథం మీద సూర్యుడు ఉన్నట్లు ముగ్గులు వేసి రంగులతో అందంగా తీర్చిదిద్దుతారు. అలాగే పూజ కోసం పళ్లు, ఫలహారాలు.. వంటివన్నీ సిద్ధం చేస్తారు. ఈలోపు సూర్యోదయం అయిపోతుంది. అప్పుడు ఆ నునువెచ్చని ఎండలోనే పూజ చేయడం ప్రారంభిస్తారు. పూలు, పండ్లతో సూర్యభగవానున్ని ఆరాధిస్తూ ఆవు పిడకలతో ఏర్పాటు చేసిన పొయ్యి మీద ఆవుపాలతో పాయసాన్ని తయారుచేసి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ విధంగా నైవేద్యం సిద్ధం చేసే క్రమంలో పాలను మూడుసార్లు పొంగిస్తారు. అలాగే ఈ పూజలో ఆదిత్య హృదయం, సూర్యాష్టకం, సూర్య సహస్రనామం.. వంటి శ్లోకాలను భక్తి, శ్రద్ధలతో చదువుతారు.