తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

ఈశ్వరుడు లేని చోటెక్కడో చెప్పు..! - ramana maharshi

అరుణాచలంలోని ఆశ్రమంలో రమణ మహర్షిని సందర్శించేందుకు స్వదేశీయులే కాకుండా విదేశీయులు కూడా చాలా మంది వచ్చేవారు. స్థానిక భక్తులు, సిబ్బంది ఆచారాల పేరుతో అక్కడకు వచ్చేవారికి కఠిన నిబంధనలు పెట్టేవారు. ఇవి మహర్షి దృష్టికి కూడా వచ్చేవి.

ramana maharshi says a story about lord shiva
ఈశ్వరుడు లేని చోటెక్కడో చెప్పు..!

By

Published : Oct 16, 2020, 7:48 AM IST

ఓసారి ఓ అమెరికా భక్తురాలు అరుణాచలం వచ్చారు. భారతీయ సంప్రదాయాలు, ఆచారాలు అంతగా తెలియని ఆమె మహర్షి ఆశీనులయ్యే సోఫా వద్ద కుర్చీలో కూర్చున్నారు. ఆమెకు కీళ్ల నొప్పులు ఉండడంతో కాళ్లను చాచి కూర్చున్నారు. దీంతో ఆశ్రమ సిబ్బంది ఆమెను మందలించబోయారు. అప్పుడు రమణులు వారిని వారించారు. ఈ సందర్భంగా పెరియ పురాణంలోని ఓ శివ భక్తురాలి కథను చెప్పారు.

అవ్వయ్యార్‌ అనే భక్తురాలిని గణపతి సశరీరంగా కైలాసానికి తీసుకెళతారు. ఆమె బాగా వృద్ధురాలు కావడంతో కాళ్లు మడిచి కూర్చోలేక శంకరుడి ముందు కాళ్లు చాపి కూర్చుంది. ఆమె వైఖరి చూసి పరమేశ్వరుడి పక్కన ఉన్న పార్వతి మనసు చివుక్కుమంది. అలా కూర్చోవడం అపరాధం కదా.. ఆమెకు ఓ సారి చెప్పమని భర్త అయిన శంకరుణ్ణి కోరింది. ‘ఆమె పరమ భక్తురాలు ఆమెనేమీ అనకూడదు’ అంటూ ఆయన మౌనందాల్చాడు. పరమేశ్వరి వూరుకోలేదు. తన చెలికత్తెకు చెప్పి పంపింది.

పార్వతీ దేవి సఖి ఆ వృద్ధురాలిని సమీపించి ‘అవ్వా నీ కాళ్లు ఈశ్వరుడివైపు పెట్టకు’ అంది. అప్పుడామె ‘అలాగా అమ్మా! ఈశ్వరుడు లేని చోటెక్కడో చెప్పు. కాళ్లు అటు పెట్టుకుంటాను’ అంటూ కాళ్లను పక్కకు తిప్పింది. వెంటనే పరమేశ్వరుడు ఆ వైపు కనిపించాడు. మరో వైపు తిప్పితే అక్కడా శంకరుడే.

ఆ సర్వేశ్వరుడు సర్వకాలసర్వావస్థల్లోనూ ఉన్నాడు.. ఆచారాలు, సంప్రదాయాలకన్నా విశుద్ధ భక్తితోనే భగవంతుణ్ణి చేరగలమని బోధించారు మహర్షి.

ABOUT THE AUTHOR

...view details