తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

పింగాణీ పువ్వులు : చెట్టుకి పూయని పువ్వులివి! - flowers with Cold porcelain flour

రేక రేకనూ ఏరి కోరి గుదిగుచ్చినట్లూ.. ప్రకృతిలోని సౌందర్యమంతా పోగు పడి వికసించినట్లూ.. ఇంత అందం, ఇంత సౌకుమార్యం మరెక్కడా లేనట్లూ.. కనువిందు చేస్తున్న ఈ పువ్వులు ఎప్పటికీ వాడిపోవు. కానీ చెయ్యి జారాయంటే పగిలిపోతాయి.. ఎందుకంటే ఇవి పింగాణీ పువ్వులు.

Olesya Gluschenko made ceramic flowers with Cold porcelain flour
పింగాణీ పువ్వులు

By

Published : Sep 20, 2020, 11:03 AM IST

ఆ గులాబీలను చూస్తే చటుక్కున తీసుకుని తల్లో తురుముకోవాలనిపిస్తుంది. ముట్టుకుంటే నలిగిపోతాయేమో అనిపించినా ఆ లిల్లీలూ రంగు రంగుల చామంతుల్నీ పట్టుకుని ముద్దాడాలనిపిస్తుంది. అలా అని చేతిలోకి తీసుకున్నామా... షాకవ్వాల్సిందే. ఇవి రాయిలా గట్టిగా ఉంటాయి మరి. పువ్వులెక్కడైనా రాళ్లలా ఉంటాయా... అనొచ్చుగాక. కానీ సుతిమెత్తగా ఉండడానికి ఇవి చెట్టుకు పూసిన పువ్వులు కాదు. ఉక్రెయిన్‌కి చెందిన ‘ఒలెస్యా గలుషెంకొ’ అనే కళాకారిణి ‘కోల్డ్‌ పోర్సిలిన్‌’తో వీటిని తయారు చేసింది.

ఆన్‌లైన్‌లో పాలిమర్‌ క్లే ఆర్ట్‌ గురించి శిక్షణ పొందిన ఒలెస్యాకు ఆ క్లేతో చేసిన పువ్వులు సహజంగా అనిపించలేదట. దాంతో ఎన్నో ప్రయోగాలు చేసి కోల్డ్‌ పోర్సిలిన్‌ పిండితో పూల బొకేలు చెయ్యడం మొదలుపెట్టింది. ఈ తరహా పోర్సిలిన్‌తో చేసిన పువ్వులు నిజమైన వాటిలానే మృదువుగా కనిపిస్తాయి. పైగా పూరేకలూ వాటి మధ్య ఉండే కేశాలను కూడా విరిగిపోకుండా ఎంతో సన్నగా చేసే వీలుంటుంది. ఆరిన తర్వాత ఇవి మామూలు పింగాణీలానే గట్టిగా మారిపోతాయి. కానీ వీటిని చెయ్యడం చాలా కష్టం. ఒక్క లిల్లీ తయారీకి ఒలెస్యాకు అయిదారు గంటలు పట్టేస్తుందట. కానీ ఆ కష్టం ఊరికే పోదు. ఆమె తయారు చేసిన పువ్వులు నిజమైనవి కాదని చెప్పినా పట్టుకుని చూసేవరకూ ఎవరూ నమ్మలేరు.

ఎప్పుడూ తాజాగానే..

అందంగా వికసించిన పూలను ఫ్లవర్‌ వేజ్‌లో పెట్టి హాల్లో పెడితే.. చూసిన ప్రతిసారీ మనసుకి ఆహ్లాదంగా అనిపిస్తుంది. అయితే, ఆ పువ్వులు ఒకటీ రెండు రోజులకే వాడిపోతాయి. పెరట్లో మొక్కలుంటే రోజూ కొన్ని పూలను తెచ్చి పెట్టుకోవచ్చు. కానీ ఫ్లవర్‌ వేజ్‌లో పూలను అందంగా అలంకరించడం కూడా కాస్త సమయం పట్టే పనే. అందరికీ అంత ఖాళీ దొరక్కపోవచ్చు.

కొందరికి అసలు మొక్కలు పెంచుకునేంత చోటే ఉండదు. ఇక పువ్వులెక్కణ్నుంచి వస్తాయి..? రోజూ పువ్వుల్ని కొని ఫ్లవర్‌ వేజ్‌లో పెట్టాలన్నా కష్టమే. అదే.. ఇలా ఎంతో సహజంగా కనిపించే పోర్సిలిన్‌ పువ్వుల్ని ఫ్లవర్‌ వేజ్‌లో పెట్టామంటే నిజమైన పువ్వులకు పోటీనిచ్చే అంత అందంతో కనువిందు చేస్తాయి. రోజూ పువ్వులు మార్చే పనీ ఉండదు. అందుకే, ఆన్‌లైన్‌లో ఒలెస్యా పువ్వుల్ని కొనేందుకు ఎంతోమంది పోటీ పడుతుంటారట.

ABOUT THE AUTHOR

...view details