21 రకాల పత్రులు సాధారణమైన ఆకులు కావు. అవన్నీ ఎన్నో ఔషధ గుణాలు కలిగినవి. వాటితో పూజ చేయడం వల్ల కొత్త మట్టితో చేసిన ప్రతిమతో కలిసి వీచే గాలి మనలో ఉండే అనారోగ్యాలని హరించేస్తుంది. ఇక నవరాత్రులు గణనాథుడిని పూజించి ఆ తర్వాత పత్రితో కలిపి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. ఇలా చేయడం వెనుకా ఓ కారణం ఉంది. వర్షాకాలంలో ఎక్కడెక్కడి నుంచో నీరు వచ్చి చెరువులు, బావులు, నదుల్లో చేరుతుంది. పైగా అది కలుషితమై ఉండటంతో దానిలోని క్రిమి కీటకాలను నాశనం చేసే శక్తి 21 పత్రాలకు ఉంది. ఆ పత్రాలు నీటిలో కలిసి బ్యాక్టీరియాను తొలగించి ఆక్సిజన్ స్థాయులను పెంచుతాయి. ఇదీ వినాయక నిమజ్జనం వెనక ఉండే ‘పర్యావరణ పరిరక్షణ’ రహస్యం. వినాయకుడిని పూజించే ఏకవింశతి పత్ర (21 ఆకుల) పూజ చాలా విశిష్టమైంది. ఈ 21 పత్రాలు వివిధ గ్రంథాల్లో ప్రస్తావించారు.
మాచీ పత్రం:దీనిని తెలుగులో మాచ పత్రి అంటారు. చామంతి జాతికి చెందిన దీని ఆకులు సువాసనా భరితంగా ఉంటాయి. తలనొప్పి, చర్మ సంబంధ సమస్యలు, కండరాల నొప్పులతో బాధపడేవారు వాడితే విశేషమైన ప్రభావం ఉంటుంది.
బృహతీ పత్రం:దీనిని ములక అంటారు. దీనిలో చిన్న ములక, పెద్ద ములక అని రెండు రకాలున్నాయి. పత్రాలు వంగ ఆకులు మాదిరి. తెల్లని చారలుండే గుండ్రని పండ్లతో ఉంటాయి. జీర్ణ, గుండె, చర్మ సంబంధ సమస్యలను నివారించగలదు.
బిల్వ పత్రం:బిల్వ పత్రం అంటే మారేడు ఆకు. మూడు ఆకులుగా, ఒక ఆకుగా ఉంటాయి. ఇవి శివుడికి చాలా ఇష్టం. శ్రీ మహాలక్ష్మీదేవికి కూడా ఇష్టమైందిగా చెబుతారు. డయాబెటిస్ నియంత్రణకు, డయేరియా, గ్యాస్టిక్ సమస్యలను నివారించగలదు.
దూర్వా పత్రం:దూర్వా పత్రం అంటే గరిక. తెల్ల గరిక, నల్ల గరిక అని రెండు రకాలుంటాయి. గడ్డిజాతి మొక్కలు విఘ్నేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనవి. గాయాలు, అలర్జీలు, ఉదర సంబంధ సమస్యలను నివారించే గుణం దీనికి ఉంది.
దుత్తూర పత్రం:దుత్తూర పత్రం అంటే ఉమ్మెత్త. ముళ్ళతో కాయలు వంకాయ రంగు పూలు ఉంటాయి. కాలిన చర్మానికి, బొబ్బలకు ఈ ఆకు చక్కగా పని చేస్తుంది.
బదరీ పత్రం:బదరీ పత్రం అంటే రేగు. దీనిలో రేగు, జిట్రేగు, గంగరేగు అని మూడు రకాలు ఉంటాయి. జీర్ణ సంబంధ సమస్యలు, గొంతు సమస్యలు, దగ్గును నియంత్రించగలదు.
అపామార్గ పత్రం:దీనిని ఉత్తరేణి అంటారు. ఆకులు గుండ్రంగా ఉంటాయి. శివునికి ఇష్టమైన ఆకుగా చెబుతారు. పాము కాటుకు, గాయాలు నయం కావడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
తులసీ పత్రం:హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తులసీ పత్రాలను దేవతార్చనలో వాడతారు. వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడానికి, దగ్గు, జలుబు, జ్వర నియంత్రణకు పనిచేస్తుంది. అనేక అనారోగ్య సమస్యలకు ఏకైక ఇంటి చిట్కా తులసి.
చూత పత్రం:చూత పత్రం అంటే మామిడి ఆకు. ఈ ఆకుకు శుభకార్యాల్లో విశిష్ట స్థానం ఉంది. మామిడి తోరణం లేని హిందూ కుటుంబాల్లో పండగ వాతావరణం కనిపించదు. రక్త విరేచనాలు, చర్మంపై దద్దుర్లును తగ్గించడంతో పాటు, కీటకాలను ఇంట్లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది.
కరవీర పత్రం:దీనినే గన్నేరు అంటారు. తెలుపు, పసుపు, ఎరుపు రంగుల పూలుంటాయి. పూజలో ఈ పూలకు విశిష్ట స్థానం ఉంది. క్యాన్సర్, ఆస్తమా నివారణకు ఉపయోగపడుతుంది.