తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

ఒక్కడు.. లక్ష మందికి ఆసరా అయ్యాడు! - kadamadai area integrated farmers association

‘తుపానుతో తెగిన చెరువు కట్టలు.. నీట మునిగి దెబ్బతిన్న పంటలు’ ఇలాంటి వార్తలు విన్నప్పుడు రైతుల పట్ల సానుభూతి ప్రకటిస్తాం. వారి పరిస్థితి మరీ కదిలిస్తే పదో పరకో సాయం చేస్తాం. దుబాయ్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయిన రాఘవన్‌ మాత్రం తన ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ రైతుల బాగు కోసం శ్రమిస్తున్నాడు.

kadamadai area integrated farmers association by software engineer raghavan
ఒక్కడు.. లక్ష మందికి ఆసరా అయ్యాడు!

By

Published : Sep 20, 2020, 2:13 PM IST

తమిళనాడులోని తంజావూర్‌ జిల్లా పేరావూరని గ్రామానికి చెందిన నీమల్‌ రాఘవన్‌ది రైతు కుటుంబం. ఉన్నత చదువుల అనంతరం అతడు దుబాయ్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఉద్యోగం సాధించాడు. అక్కడ ఉద్యోగం చేస్తున్న సమయంలోనే 2018 నవంబరులో గజ తుపాను తమిళనాడు లోని కావేరి డెల్టా ప్రాంతంలో విలయం సృష్టించింది. దీని ప్రభావంతో పలువురు మరణించారు. ఇళ్లు కూలిపోవడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

ఎన్నో గ్రామాల్లోని చెరువు కట్టలూ, కాలువలూ ఎక్కడికక్కడ తెగిపోయాయి. పంటలు కొట్టుకుపోయి రైతులు నష్టపోయారు. ఈ వార్తలను టీవీల్లోనూ, పత్రికల్లోనూ చూసి చలించిన రాఘవన్‌... రైతులకు తనవంతుగా సాయం చేయాలనుకున్నాడు. కొన్ని రోజుల తరవాత ఉద్యోగానికి రాజీనామా చేసి పేరావూరనికి చేరుకున్నాడు. తన గ్రామంతో పాటు తుపాను ప్రభావిత పుడుకోట్టై, తంజావూరు జిల్లాల పరిధిలోని 90 గ్రామాల రైతులను కలుస్తూ దెబ్బతిన్న పొలాలను పరిశీలించాడు.

తుపాను మిగిల్చిన నష్టాన్ని రైతులు కన్నీళ్లు పెడుతూ వివరించడం, చాలా మంది గ్రామాన్ని వదిలి ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళ్లడం అతడిని మరింత బాధకు గురిచేసింది. అప్పటికే తుపాను ప్రభావిత గ్రామాల్లో సహాయక కార్యక్రమాలు చేపట్టిన తన మిత్రుడు నవీన్‌ ఆనందన్‌తో పాటు మరికొందరితో కలిసి రైతు సమస్యల పరిష్కారంపైన చర్చించాడు. చెరువుల్లో చేరిన మట్టిని తొలగించి కట్టలూ, కాలువలూ నిర్మించాలనీ, అవి వినియోగంలోకి వస్తేనే వలస వెళ్లిన రైతులు గ్రామానికి చేరుకుని వ్యవసాయం చేస్తారనీ వారు చెప్పారు.

చెరువుల బాగుకు ‘కైఫా’

తుపానుతో నష్టపోయిన ప్రజలకు మొదట కనీస అవసరాలను తీర్చడానికి రాఘవన్‌... తన మిత్రులతో కలిసి ‘బౌన్స్‌ బ్యాక్‌ డెల్టా’ కార్యక్రమాన్ని చేపట్టాడు. తాను సొంతంగా కొంత, బంధుమిత్రులతో మరికొంత డబ్బును పోగు చేసి, ఆ డబ్బుతో 90 గ్రామాల్లోని ప్రజలకు దుస్తులూ, ఆహార పదార్థాలూ, నిత్యావసర సరకులూ అందించాడు.

దాని తరవాత చెరువుల్లో పేరుకుపోయిన మట్టిని తొలగించాలనీ, కట్టలూ కాలువలూ నిర్మించాలనీ ప్రత్యేకంగా ‘కడైమడై ఏరియా ఇంటిగ్రేటెడ్‌ ఫార్మర్స్‌ అసోసియేషన్‌(కైఫా)’ను ప్రారంభించాడు. ఇందులో సుమారు వంద మందిని వాలంటీర్లుగా చేర్చుకుని రైతుల్లో చైతన్యం నింపాడు. పొక్లెయిన్లూ, ట్రాక్టర్ల కోసం రాఘవన్‌తోపాటు అతని మిత్రులూ కొందరు వాలంటీర్లూ తలో చెయ్యీ వేశారు. అలా కోటి రూపాయలకుపైగా జమ అయ్యాయి.

పట్టణాలు వదిలి సొంతూళ్లకు..

రైతులు తుపానుకు ముందులాగే వ్యవసాయ పనులు చేసుకోవాలన్న ఉద్దేశంతో రాఘవన్‌ గతేడాది తన గ్రామంలోని చెరువు పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రారంభించాడు. కైఫా సభ్యులూ, రైతులూ కలిసి ఆ చెరువులోని మట్టిని తొలగించారు. తెగిపోయిన కట్టనీ, కాలువల్నీ నిర్మించారు. వర్షాలు పడి నీరు పుష్కలంగా చేరడంతో ప్రస్తుతం ఆ చెరువు కింద ఆరు వేల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగవుతున్నాయి. ఆ తరవాత పుడుకోట్టై, తంజావూర్‌ జిల్లాల్లోని 90 గ్రామాల్లోనూ చెరువుల పునరుద్ధరణను చేపట్టారు.

అలా... గత సంవత్సరం నుంచీ ఇప్పటి వరకూ వారంతా కలిసి 54 చెరువులను పునరుద్ధరించారు. పూడిక మట్టిని తొలగించి కట్టలను ఎత్తుగా నిర్మించడంతో వాటిలో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. ఫలితంగా... నీరు లేక సాగును వదిలిన దాదాపు లక్ష మంది రైతులు మళ్లీ వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. వ్యవసాయమే తన కుటుంబాన్ని నిలబెట్టిందనీ, రైతులు బాగుంటేనే దేశానికి అన్నం దొరుకుతుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాననీ అంటాడు రాఘవన్‌. ఇలాంటి రాఘవన్‌ ఊరికి ఒక్కడున్నా... చెరువులు నీటితో కళకళలాడుతూ రైతుల జీవితాలు బాగుపడతాయి కదూ!

ABOUT THE AUTHOR

...view details