తెలుగు రాష్ట్రాల్లో 'ఉగాది'
చైత్రమాసంలోని తొలి రోజును ఉగాదిగా పిలుచుకునే తెలుగు ప్రజలు ఆ రోజు నుంచే తమకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందని భావిస్తారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు తెల్లవారుజామునే తలస్నానాలు చేసి, కొత్త బట్టలు ధరిస్తారు. షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని సేవించాక పంచాంగ శ్రవణం చేస్తారు. పండగ రోజు కొత్త పంచాంగాన్ని బట్టి కొత్త సంవత్సరం వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుంటారు.
కర్ణాటకలోనూ 'ఉగాది'
ఉగాది పండగని అత్యంత సంబరంగా నిర్వహించే మరో రాష్ట్రం కర్ణాటక. ఇక్కడ కూడా ఈ పండగని 'ఉగాది' అనే పేరుతోనే పిలుస్తారు. పండగకు వారం ముందు నుంచే ఏర్పాట్లు మొదలుపెడతారు. ఉగాది రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి నువ్వుల నూనెతో శరీరాన్ని మర్దన చేసుకున్నాక తలస్నానం చేయడం ఇక్కడి ఆచారం. ఆ తరువాత ఘుమఘుమలాడే వంటలను తయారుచేసి అతిథులకు రుచికరమైన విందు ఏర్పాటు చేస్తారు. తెలుగు వారి ఉగాది పచ్చడిలానే కర్ణాటకలో 'బేవుబెల్లా' తయారుచేస్తారు. మనిషి జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను ప్రతిబింబిస్తూ వేపపువ్వు, బెల్లం, చింతపండు రసం, పచ్చిమామిడి ముక్కల మిశ్రమాన్ని మెత్తగా రుబ్బి పచ్చడి తయారు చేస్తారు. దీంతో పాటు ఒబ్బట్టు, పులిహోర తప్పనిసరిగా చేసుకొనే వంటకాలు.
మహారాష్ట్రలో 'గుడిపడ్వా'..
మహారాష్ట్రలో ఈ ప్రత్యేక పర్వదినాన్ని 'గుడిపడ్వా'గా పిలుచుకుంటారు. ఇక్కడి ప్రజలు ఆరోజు ఇంటి ముందు ముగ్గులు వేసి అందులో రంగులు నింపుతారు. ఇళ్లలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత.. లేత వేపాకులు, శనగపప్పు, జీలకర్ర, బెల్లం కలిపిన మిశ్రమాన్ని ప్రసాదంలా పంచుతారు. వెదురు కర్రకు సిల్క్ వస్త్రాన్ని చుట్టి కర్ర పైభాగంలో రాగి పాత్రను బోర్లించి ఉంచుతారు. ఇలా అలంకరించిన కర్రను ఇంటిముందు వరండాలో లేదా వాకిట్లో నిలబెడతారు. ఇలా చేస్తే ఇంట్లో ఉండే దారిద్య్రాన్ని, కీడును వెదురు పూర్తిగా నాశనం చేస్తుందని మహారాష్ట్ర ప్రజల విశ్వాసం.
కేరళలో 'విషు'
మలయాళ క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలోని తొలి మాసం పేరు 'మెదమ్'. ఈ నెలలోని మొదటి రోజే 'విషు'. తమిళనాడు, అసోం, పంజాబ్ రాష్ట్రాల్లా ఏప్రిల్ నెలలోనే కేరళ ప్రజలు కూడా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తారు. పండగ రోజు నిద్ర లేచిన వెంటనే తాళపత్రాలు, శుభ్రమైన తెల్లటి వస్త్రం, బంగారు ఆభరణాలు, వరి, కొన్నా అనే చెట్టు పూలు, సగానికి విడదీసిన పనసపండు, కొబ్బరికాయ, కుండలో నింపిన దోసకాయలు.. తదితర వాటిల్లో ఏదో ఒకదాన్ని చూసిన తరువాతే రోజును ప్రారంభిస్తారు.
కుటుంబంలోని పెద్దలు, పిల్లలకు ఆరోజు కొంత డబ్బు లేదా ఏదైనా బహుమతి ఇస్తారు. అలా చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని వారి నమ్మకం. ఈ పద్ధతిని 'విషు కైనీతమ్' అంటారు. ఆడవాళ్లు పనస, గుమ్మడి, పచ్చి మామిడితో వంటలు తయారుచేస్తారు. తెలుగువారికి ఉగాది పచ్చడిలా కేరళలో ఆరోజు 'వెప్పం పూరసం' (వేపతో చేసే వంటకం), 'మంపజ పచ్చడి'(పచ్చిమామిడి సూప్) ప్రత్యేక వంటకాలు.