తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

Dhanteras Special Story : ధంతేరాస్​ స్పెషల్.. బంగారం ఎలా కొనాలంటే? - gold ornaments

నానమ్మ చంద్రహారం,  అమ్మమ్మ రవ్వల గాజులు,  అమ్మ అరవంకీ....అంటూ బంగారం గురించి మురిపెంగా చెప్పుకుంటాం.  వాటిని పెండెంట్‌గానో, నెక్లెస్‌గానో మార్చుకుందామంటే...తరుగు పేరుతో విలువ తగ్గిపోతుందేమోనని భయం... ఇక మధ్యతరగతి ఇళ్లల్లో రూపాయి రూపాయి పోగేసి...పండగ రోజు రవ్వంతైనా పసిడి(Gold ornaments) కొందామనుకుంటే... అసలు ధరకు చేరిన ఛార్జీల మోత చూస్తే గుండె గుభేల్‌ మంటుంది. మరి ఎలా కొనాలి?

Dhanteras Special Story
Dhanteras Special Story

By

Published : Nov 2, 2021, 8:15 AM IST

ఆషాఢం, దీపావళి డిస్కౌంట్లు....అక్షయ తృతీయ, ధన త్రయోదశి ఆఫర్లు(Dhanteras offers)...జీరోమేకింగ్‌ ఛార్జీలు...అంటూ బంగారు దుకాణాలూ రాయితీలు ప్రకటించినా...పసిడి(How to buy Gold ornaments) కొనేటప్పుడు ఆచితూచి అడుగేయాల్సిందే. ప్రతి రూపాయీ లెక్కేసుకోవాల్సిందే.

గుర్తింపు ఇలా...

‘ఎంతైనా బంగారం...బంగారమే. ఏటికేడు పుత్తడి విలువ పెరుగుతున్నా డిమాండ్‌ మాత్రం తగ్గేదే లేదు’ అంటోంది. స్వచ్ఛమైన బంగారాన్ని 24 క్యారెట్ల(24 Carets gold)లో చెబుతారు. ఇది కాయిన్లు, బార్లు, బిస్కెట్ల రూపంలో లభిస్తుంది. ఈ పుత్తడికి వెండి, రాగి...వంటి లోహాల్ని కలిపి 22 క్యారెట్లలో 916 నాణ్యతతో నగలు తయారు చేస్తారు. పసిడి ప్యూరిటీని గుర్తించడానికి వాటి మీద హాల్‌మార్క్‌ ముద్రని తప్పనిసరి చేసింది ప్రభుత్వం. ప్రతి ఆభరణం మీదా బీఐఎస్‌ ముద్ర(BIS stamp), నాణ్యత, హాల్‌మార్కింగ్‌ సెంటర్‌ గుర్తు, ఏ సంవత్సరంలో ఆ ముద్ర వేశారు, నగ అమ్మిన సంస్థ లోగో... వంటి మొత్తం ఐదు గుర్తులు ఉంటాయి. కొనేటప్పుడు వాటిని సరిచూసుకోండి. అవి భూతద్దంలో పెట్టి చూస్తేనే కనిపిస్తాయి. గోల్డ్‌ జ్యుయలరీని పెద్ద పెద్ద దుకాణాల్లో కొన్నప్పుడే కాదు...స్వర్ణకారులతో చేయించుకున్నా హాల్‌మార్క్‌ వేయించుకోవాల్సిందే. రసీదు తీసుకోవడం, స్వచ్ఛత, ధరల్ని నమోదు చేయించుకోవడం కూడా తప్పనిసరి.

స్వచ్ఛత ఇలా...

రాగి, వెండి...వంటి లోహాల్ని పసిడితో కలిపే మోతాదును బట్టి వాటి స్వచ్ఛత ఆధారపడి ఉంటుంది. విదేశాల్లో తొమ్మిది, పది క్యారెట్ల నుంచే ఆభరణాలు దొరుకుతాయి. కానీ మన దగ్గర పద్నాలుగు క్యారెట్ల నుంచి 24 వరకూ ఉంటాయి. హాల్‌మార్క్‌ లేకుండా విక్రయించే ఆభరణాల్లో బంగారం 18 క్యారెట్లకు మించి ఉండదని ఓ అంచనా. ఈ విషయం తెలియక చాలామంది 22 క్యారెట్లకి డబ్బులు చెల్లించి మోసపోతుంటారు.

లెక్క తప్పొద్దు...

గ్రాము బంగారం కొన్నా ప్రతి రూపాయీ లెక్కేసుకోవాలి. ప్రతి వివరం పక్కాగా తెలుసుకోవాలి. మజూరీ, తరుగులను కలిపి వాల్యూ యాడెడ్‌ ఛార్జీలుగా లెక్కేస్తాయి షాపులు. ఇవి నగ డిజైన్‌ బట్టి 6 నుంచి 25 శాతం వరకూ ఉండొచ్చు. వీటికి అదనంగా జీఎస్టీ చెల్లించాలి. అంటే ఉదాహరణకు పది గ్రాముల బంగారం ధరకు.. తయారీ రుసుము, తరుగు, జీఎస్టీ అన్నీ కలిపితే మరో రెండు గ్రాముల బంగారానికి సరిపడా మొత్తాన్ని బిల్లుగా చెల్లించాల్సి రావొచ్చు. కొన్ని నగల దుకాణాలు జీరోమేకింగ్‌ ఛార్జీలు అంటూ రాయితీలు ఇస్తాయి. అయితే వీటిని మరో రూపంలో వసూలు చేయొచ్చు. అది గమనించుకోవాలి. ఇక పాత బంగారాన్ని మారిస్తే తరుగు పేరుతో విలువ తగ్గిపోతుందేమోనని భయపడుతుంటాం. నగ కరిగించి లెక్కకట్టించుకుంటే మేలు. ఆ పసిడి ముద్ద స్వచ్ఛత ఆధారంగా... దానికి 24 క్యారెట్ల పుత్తడి ధరను దుకాణదారులు చెల్లించాలి. చాలావరకూ ఆ పని చేయవు. అప్రమత్తంగా ఉండి అడిగితే మీ సొమ్ము కాపాడుకోవచ్చు.

బిల్లు వేయించండిలా...

బీఐఎస్‌ నిబంధనల ప్రకారం రాళ్ల బరువు, బంగారం బరువు విడివిడిగా వేయాలి. ఆ వివరాలన్నీ కొనుగోలు చేసిన రసీదులో స్పష్టంగా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ పచ్చలు, రూబీ వంటి విలువైన రాళ్లు ఉంటే...వాటిని మార్చితే ఎంత శాతం తిరిగి వస్తుందో కూడా అందులో నమోదు చేయించుకోవాలి. ఈ రసీదు కంప్యూటర్‌ బిల్లు అయితే మంచిది. అది కాదన్నప్పుడు దుకాణం వివరాలూ, రిజిస్ట్రేషన్‌ ఉన్న ఇన్‌వాయిస్‌ కాగితం మీదే వేయించాలి. అరగ్రాము బంగారం కొన్నా...బిల్లు తప్పనిసరి. భవిష్యత్‌లో బంగారం మార్చేటప్పుడైనా, అమ్మేటప్పుడైనా అది ఉపయోగపడుతుంది.

ధరలు షాపు షాపునకీ మారుతూ ఉంటాయి. బిల్లింగ్‌కి సంబంధించిన ఒకే ప్రామాణిక విధానం మన దగ్గర లేదు. కాబట్టి కొనేటప్పుడే ఒకటికి రెండు సార్లు గమనించుకోవాలి.

మీకు స్వచ్ఛమైన బంగారం అని చెప్పి దుకాణదారు మోసం చేస్తే వినియోగదారుల కోర్టును ఆశ్రయిస్తే డబ్బులు తిరిగి పొందొచ్చు. ఇందుకూ బిల్లు తప్పనిసరి. బీఐఎస్‌కి ఆన్‌లైన్‌ ఆఫ్‌లైన్‌లో ఫిర్యాదు చేయొచ్చు.

ABOUT THE AUTHOR

...view details