పచ్చని పంటపొలాలూ.... ఆకట్టుకునే ప్రకృతి అందాల మధ్య వెలసిన క్షేత్రమే వేంకటేశ్వరస్వామి ఆలయం. గోకుల తిరుమల పారిజాతగిరిగా పిలిచే ఈ ఆలయం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలోని తల్లా - దేవరపల్లి ప్రధాన రహదారి దగ్గర కనిపిస్తుంది. ఈ పట్టణానికి ఉత్తరముఖంగా ఉన్న ఏడు కొండల్లో ఆరో కొండపైన స్వామి స్వయంభువుగా వెలిశాడని అంటారు. ఇక్కడ స్వామికి కుడి భాగంలో పద్మావతీ దేవి, ఎడమ భాగాన గోదాదేవి -ఆళ్వారాచార్యులు కొలువై కనిపిస్తారు.
కొండపైన ఈశాన్య భాగంలో క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి దక్షిణముఖంగా దర్శనమిస్తే... శ్రీనివాసుడు వెలసిన కొండకు ఎదురుగా ఉన్న గిరిపైన గరుత్మంతుడిని చూడొచ్చు. కొండ దిగువన గోకుల ఉద్యానవనంలో లక్ష్మి, దుర్గ, సరస్వతి, గాయత్రీ దేవి ఆలయాలూ, గోశాలా ఉంటాయి. అదేవిధంగా మెట్ల మార్గంలో గణపతి, గోవింద రాజ స్వామి, నటరాజ ఆలయాలు కూడా ఉంటాయి. ఇక్కడున్న మెట్ల మార్గంలోని ఆలయాల వద్ద రాయి రాయి పేర్చి గూడులా కడితే... చాలా తక్కువ సమయంలో సొంత ఇంటి కల నెరవేరుతుందని ప్రతీతి. ధనుర్మాసంలో గోదాదేవిని పూజిస్తే వివాహం జరుగుతుందనీ, ఆరోగ్య, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయనీ భక్తుల నమ్మకం. ఆలయం చుట్టు పక్కల పారిజాత వృక్షాలు ఎక్కువగా ఉండటం వల్లే ఈ గుడికి తిరుమల పారిజాత గిరి అనే పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది.
స్థలపురాణం
దాదాపు అరవైఏళ్ల కిందట చిట్టయ్య అనే భక్తుడికి ఓసారి స్వామి కలలో కనిపించి ఈ పట్టణానికి ఉత్తర దిక్కున ఉన్న ఏడు కొండలలో ఒక కొండపైన పారిజాత వృక్షాల దగ్గర తన పాదాలు ఉన్నాయనీ, అక్కడ ఆలయం నిర్మించమనీ చెప్పాడట. దాంతో ఆ భక్తుడు ఏడు కొండల్ని వెతికితే ఆరో కొండపైన పారిజాత వృక్షాల మధ్య ఒక శిలపైన స్వామి పాదాలు కనిపించాయట. ఆ పాదాలు వెలసిన శిలనే విగ్రహంగా మార్చి... చిన్న మందిరంగా నిర్మించాడట. క్రమంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారనీ... కొండపైకి వచ్చే భక్తుల సహకారంతో మెట్లదారినీ నిర్మించారనీ అంటారు. ఈ ఆలయం పరిసర ప్రాంతాలు పాడి పంటలతో అలరారుతుండటం వల్ల ఈ ప్రాంతాన్ని గోకులమనీ, వేంకటేశ్వరస్వామి వెలసిన ప్రదేశం కావడం వల్ల తిరుమల అనీ, పారిజాత వృక్షాలు ఎక్కువగా ఉండటం వల్ల పారిజాతగిరిగానూ పిలుస్తున్నారు భక్తులు.