తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

మహావిష్ణువు కొలువుండే ఐదు ప్రదేశాలేంటో తెలుసా? - Five places where Lord Vishnu resides according to mythology

గోవిందా అంటూ ఏడు కొండలు ఎక్కిన తర్వాత...ఆ అలౌకిక రూపం భక్తులకు తన్మయులను చేస్తుంది...క్షణకాలం చూసినా చాలు దివ్యానుభూతినిస్తుంది..నిలువెత్తు ఆ మూర్తి దర్శనం ఓ అద్భుతం...స్థితికారుడి ఆ మహోన్నత స్థితి అపురూపం..

Five places where Lord Vishnu resides according to mythology
మహావిష్ణువు కొలువుండే ఐదు ప్రదేశాలేంటంటే?

By

Published : Mar 25, 2021, 6:59 AM IST

శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం మహావిష్ణువు అయిదు ప్రదేశాల్లో ఉంటాడని నమ్మకం. వాటిని స్థితి పంచకం అంటారు. అందులో మొదటిది పరాస్థితి... అంటే వైకుంఠంలో ఉండే విష్ణుదేవుడు. రెండోది వ్యూహస్థితి... క్షీరసాగరంలో శయనించి సృష్టి నిర్వహణ చేస్తుంటాడు. మూడోది విభవ స్థితి... వివిధ అవతారాలెత్తి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసే రూపం. నాలుగోది అంతర్యామి... ఈ స్థితిలో శ్రీ మహావిష్ణువు జీవుల హృదయాల్లో ఉండి తన మహాత్మ్యాన్ని ప్రకటిస్తుంటాడు. అయిదోది అర్చాస్థితి...విగ్రహ రూపాల్లో ఉంటూ ఆయా క్షేత్రాల్లో పూజలందుకునే స్వరూపం. తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరుడి విగ్రహంలో ఈ అయిదు స్థితుల్లోని శక్తి సంపత్తులు, వరాభయాలు ప్రకటితమవుతున్నాయని సాధకులు చెబుతారు. నూట ఎనిమిది దివ్య తిరుపతుల్లోని ప్రతిమల ప్రాభవమంతా తిరుమల వేంకటేశ్వరుడి మూల విరాట్టులోనే నిబిడీకృతమైందని ఆస్తికుల నమ్మకం. ఈ రూపాన్ని ఆరాధించడం వల్ల సిరులే కాదు అణిమాది సిద్ధులు కూడా సొంతమవుతాయంటారు. అన్నమాచార్యులవారు కూడా ‘అణురేణు పరిపూర్ణమైన రూపము, అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము’ అని సప్తగిరీశుడిని కీర్తించారు. ఈ స్వామి రూపం దర్శన భాగ్యానికే కాకుండా ఆధ్యాత్మిక సాధనలకు, ఉపాసనకు కూడా ఆలవాలమైన రూపంగా భావిస్తారు.

శిలప్పదికారం గ్రంథంలో వేంకటేశుని దివ్య మంగళరూపంపై పరిశోధనాత్మక వివరణ కనిపిస్తుంది. స్వామిరూపంలో ఉన్న సాలగ్రామ శిలను పోలిన శిల ప్రపంచంలో మరెక్కడా లేదని చెబుతారు. శ్రీనివాసుని స్థానకమూర్తి ప్రతిమా లక్షణాలు మరే విగ్రహంలోనూ కనిపించవని స్థపతులు, ఆలయ నిర్మాణ నిపుణుల వివరణ. క్రీ.పూ.2 శతాబ్దానికి చెందిన జైన సాధువు ఇలాంగో అడిగల్‌ తిరుమల సందర్శించారు. తిరుమల మూలవిరాట్టు అప్పటికి ఎంతో కాలం క్రితం నుంచే అక్కడుందని ఆయన నిర్ధరించారు. ‘అందమైన కొలనులు, పూలతోటల మధ్య వేంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది ఆయనను సాక్షాత్తు సెంగన్‌ నడియన్‌ అంటే శ్రీ మహావిష్ణువుగా భావిస్తున్నారు. నిలువెత్తు ఆ మూర్తికి శంఖుచక్రాలు, కౌస్తుభం, పట్టు పీతాంబరాలు ఉన్నాయ’ని ఆయన చెప్పారు.

మహర్షులు ఆ స్వామిని స్తుతిస్తూ...

శ్రీవేంకటేశమతి సుందర మోహనాంగం
శ్రీభూమికాంత మరవింద దళాయతాక్షమ్‌
ప్రాణప్రియం ప్రవిలసత్కరుణాంబురాశిం
బ్రహ్మేశ వంద్య మమృతం వరదం భజాతి!

‘ఆనంద నిలయంలో కొలువైన ఆ మూర్తి అందరినీ సమ్మోహన పరిచే అతిలోక సుందరుడు. ఆ స్వామివి పద్మాల్లాంటి నయనాలు. శ్రీదేవి, భూదేవితో కూడి ఉన్న ఆ శ్రీనివాసుడు అందరికీ అత్యంత ప్రాణప్రదమైనవాడు. సాక్షాత్తు బ్రహ్మదేవుడు, పరమ శివుడు కీర్తించిన ఆ స్వామి కరుణా సముద్రుడు. మోక్ష ప్రదాయకుడు’ అని కీర్తించారు. ఏడు కొండలపై ఆనంద నిలయంలో వెలసిన శ్రీ వేంకటేశ్వరుడి విగ్రహాన్ని ధ్రువమూర్తి అని కూడా అంటారు. స్వామి తిరునామం ఎంతో ప్రత్యేకం. వేంకటేశ్వరస్వామి మూలవిరాట్టు దయ, శాంతం మూర్తీభవించిన సౌమ్యమూర్తి. స్వామి ఒక్కొక్కరికి ఒక్కో భావనతో దర్శనమిస్తారు. భక్తునికి భక్తునికి మధ్య ఆయన దర్శనమయ్యే తీరు వేరుగా ఉంటుందని చెబుతారు.

నిత్యాత్ముడై యుండి, నిత్యుడై వెలుగొందు
సత్యాత్ముడై యుండి, సత్యమై తానుండు
ప్రత్యక్షమై యుండి బ్రహ్మమై ఉండు
సంస్తుత్యుడీ తిరు వేంకటాద్రి విభుడు

- అన్నమాచార్య

ABOUT THE AUTHOR

...view details