రోజూ పూజ చేసినా చేయకపోయినా దేవుడి ఫొటోలూ, విగ్రహాలకూ కాసిని పూలు పెట్టి, దీపం వెలిగించేవారు కొందరైతే... పూజా మందిరాన్ని రకరకాల పూలతో అందంగా అలంకరించేవారు మరికొందరు. ఇక... ప్రత్యేక సందర్భాలూ, పండగరోజుల్లో అన్నిరకాలతోపాటూ తమ స్థాయిని బట్టి వెండి/వెండికి బంగారుపూత పోసిన పూలతోనూ పూజించేవారూ లేకపోలేదు. అయితే వెండి/బంగారు పూలు పేరుకు గొప్పగా అనిపించినా అవి నిన్నమొన్నటిదాకా రెండుమూడు రకాల్లో మాత్రమే దొరికేవి. కానీ ఇప్పుడొస్తున్నవి అలాంటివాటికి పూర్తిగా భిన్నం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే... సహజ పూల మాదిరి వీటిల్లోనూ చామంతి, మల్లె, మందారం, గులాబీ, సంపెంగ, పారిజాతం, జాజి... అంటూ బోలెడు రకాలు దొరుకుతున్నాయి. పైగా పేరుకు వెండిపూలు అన్నట్లు కాకుండా వాటికి ఎనామిల్ మెరుపులనూ జతచేస్తున్నారు తయారీదారులు. ఉదాహరణకు మందారాలనే తీసుకుంటే.... వెండికి బంగారుపూత పోసిన పువ్వుకు లోపలివైపు ఎరుపురంగు ఎనామిల్‌ని అందంగా అద్దుతారు. దాంతో ఒక్క పువ్వును పెట్టినా... చూసినవారు ‘అది నిజమైన మందారమే కదూ!’ అని అడగకుండా ఉండలేరు.
సహజ అందం ఉట్టి పడేలా
అదే విధంగా చామంతీ, గులాబీ, తామర లాంటివాటిని కూడా పూల స్వభావాన్ని బట్టి అంతే సహజంగా తయారుచేస్తున్నారు. కొన్నింటి తయారీలో రెండుమూడు రంగుల్ని వాడటంతోపాటూ... అదనంగా రంగురాళ్లను ముచ్చటగా పేర్చడం వల్ల అవి మరింత అందంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే... వెండిపూలను కొనుక్కుని పూజ చేసుకున్నాక... మళ్లీ జాగ్రత్తగా లెక్కపెట్టుకుని దాచుకోవడం పెద్ద పని కదా అనేవారికి ఇప్పుడు అవే దండలుగానూ కావాల్సిన సైజులో దొరుకుతున్నాయి. వెండిపూలలా బోలెడు రంగుల్లో ఉండకపోవచ్చు కానీ... గులాబీ, తామర, మందారం... వంటివి ఒకటి లేదా రెండు రంగుల్లో ఉంటాయి. అలాగే ఈ దండలు నిండుగా కనిపించేందుకు రెండు లేదా మూడు పూలను కలిపి... అక్కడక్కడా ముత్యాల్లాంటివి జత చేసి మరీ తయారుచేస్తారు. ఈ దండల్ని ఒకసారి దేవుడి ఫొటోలూ లేదా విగ్రహాలకూ వేస్తే శుభ్రం చేయాలనుకున్నప్పుడు తప్ప రోజూ తీయాల్సిన అవసరం కూడా ఉండదు.
‘కిందటి జన్మలో బంగారుపూలతో పూజచేసి ఉంటారు...’ అనే మాటల్ని అప్పుడప్పుడూ వింటూంటాం. బంగారు పూలతో పూజ చేయడం అందరికీ సాధ్యం కాకపోయినా... వెండికి బంగారు పూత పోసిన ఇలాంటి పూలూ లేదా దండల్ని కొనుక్కుని పెట్టుకుంటే ఎప్పుడైనా పూజకు వాడుకోవచ్చు. కాస్త భక్తి ఎక్కువగా ఉన్నవారికి బహుమతిగా ఇవ్వడానికీ బాగుంటాయి. ఏమంటారూ!
ఇదీ చదవండి:ఈసారి జకార్డ్ అంచు డిజైన్లతో బతుకమ్మ చీరలు