భారీ టెంట్లు...... వరుసకట్టిన వాహనాలు.. గుమికూడిన జనాలు.... వీక్షకుల కోసం సోఫాలు...చూశారుగా ఈ హంగామా....! ఇక్కడేమీ తాయిలాలు పంచడంలేదు. అమ్మవారి జాతరో, పోలేరమ్మ తిరునాళ్లో జరగడంలేదు. మరి.. ఇంత జనం ఏంటి అనేగా మీ సందేహం.! ఇది ఏటా సంక్రాంతికి జరిగే కోడిపందేల జాతర.....! మూడురోజుల పందేల కోసం....ఏపీలోని కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని అంపాపురం వద్ద ఏర్పాటు చేసిన బరులే ఇవి.
ఇక్కడి పందేలను తిలకించేందుకు... కృష్ణా జిల్లా నుంచేకాదు.. హైదరాబాద్ నిుంచీ వీక్షకులు వచ్చి వాలిపోయారు. ఇలా వందల సంఖ్యలో బారులు తీరిన కార్లు, బైకులు వాళ్లవే. ఇంత జనాన్ని చూసి ఆశ్చర్యపోకండి. ఇక్కడున్నఏర్పాట్లు అలాంటివి మరి. ఎండపడకుండా పెద్ద టెంట్లు, దర్జాగా కూర్చుని పందేలు తిలకించేలా సోఫాలు.. దూరంగా ఉన్నవారికీ బాగా కనిపించేలా పెద్ద ఎల్ఈడీ తెరలు ఇలా సౌకర్యాలకు లోటులేకుండా చేశారు నిర్వాహకులు. అందుకే మహిళలు కూడా ముందువరుసలో కూర్చుని కోడిపందేలను యమఆసక్తిగా తిలకించారు. పండుగ సందడంతా ఇక్కడే ఉదంటూ సంబురపడ్డారు. ఇక్కడ కోడిపందేలతోపాటు ఇతర క్రీడలూ వినోదాన్ని పంచాయని సంతృప్తి వ్యక్తంచేశారు.