తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

ఏపీలోని గోదావరి, కోస్తా జిల్లాల్లో జోరుగా కోడిపందేలు

బరులు బార్లా తెరుచుకున్నాయి....కత్తులు కుత్తికలను తెంపాయి.. కదన రంగాన్ని తలపించిన కోడిపందేల పోరులో రూ.వందల కోట్లు చేతులు మారాయి. పోలీసుల ఆంక్షలను దాటుకుని ఏపీలోని కోస్తా జిల్లాల్లో భారీ బరులు ఏర్పాటు చేశారు. ప్రజాప్రతినిధులే దగ్గరుండి మరీ పందేలు నిర్వహించారు.

cock-fighting-godavari-districts
ఏపీలోని గోదావరి, కోస్తా జిల్లాల్లో జోరుగా కోడిపందేలు

By

Published : Jan 14, 2021, 8:35 AM IST

ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సందర్భంగా.. కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. ఏలూరు గ్రామీణ ప్రాంతంలోని చాటపర్రు, భీమవరం మండలం పెదగరువు, కాళ్లమండలం సీసలి, ఉండి మండలం ఐ.భీమవరం, పాలకొల్లు మండలం పూలపల్లె,తాడపల్లిగూడెం, తణుకు నిడదవోలు, కొవ్వూరు ప్రాంతాల్లో పెద్ద బరులు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక్కో పందెం పది లక్షల రూపాయలకుపైగా జరిగింది. జిల్లాలో మొదటిరోజే సుమారు వంద కోట్లరూపాయలకు పైగా కోడిపందేల్లో జూదాలు సాగాయని అంచనా. ఇక చిన్నబరులైతే దాదాపు రెండువందలకుపైనే ఏర్పాటుచేశారు. తిరునాళ్లను తలపించే రీతిలో భారీగా టెంట్లు వేసి పందెంరాయుళ్లను నిర్వాహకులు ఆకర్షించారు.

గోదావరి, కోస్తా జిల్లాల్లో జోరుగా కోడిపందేలు

తూర్పుగోదావరిలోనూ జోరుగా పందేలు నడిచాయి. రావులపాలెంలో జరిగిన పందేలనుఎమ్మెల్యే చిర్లజగ్గిరెడ్డి స్వయంగా పందేలు ప్రారంభించారు. సినీ దర్శకుడు వి.వి. వినాయక్ కూడా ఇక్కడి పందేలు చూసేందుకు వచ్చారు. ఇక బరులు వద్ద భారీగా జూదాలూ జరిగాయి. గుండాట, మూడుముక్కలాట, కోత ఆట వంటి అనేక రకాల జూద క్రీడలు నిర్వహిచారు.

కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ జోరుగా కోడి పందేలు నడిచాయి. మొవ్వ మండలం కూచిపూడి, అయ్యంకి, కోసూరు గ్రామాల్లో కోడి పందేలు.. భారీగా నిర్వహించారు. బరుల పక్కనే పేకాట, కోతముక్క జూదాలు జోరుగా సాగాయి. మహిళలు సైతం.. హుషారుగా పందేలు కాశారు. ఉదయం కొద్దిసేపు పోలీసులు హడావుడి చేసినా మధ్యాహ్నం నుంచి యథేచ్ఛగా పందేలు సాగాయి. మైలవరం పరిసర ప్రాంతాల్లోనూ పెద్దఎత్తున టెంట్లు వేసి పందేలు వేశారు

గుంటూరు జిల్లాలో సంప్రదాయ పందేలకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. కత్తి పందేలు కాకుండా డింకీ పందేలు నిర్వహించారు. వేమూరు, రేపల్లె, పెదకూరపాడు, పల్నాడులో పలుచోట్ల పందెం రాయుళ్లు సందడి చేశారు. లక్షల రూపాయలు చేతులు మారాయి. జిల్లాలోని కొందరు ప్రజాప్రతినిధులు నేరుగా హాజరై కోడిపందేలను తిలకించారు.

ABOUT THE AUTHOR

...view details