తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ప్రియుడి మోసంతో యువతి ఆత్మహత్యాయత్నం.. 2 నెలలుగా కోమాలో

ప్రేమించి పెళ్లాడిన యువకుడు.. ఆ యువతిని కాదన్నాడు. తక్కువ కులమన్న కారణంతో కాపురానికి తీసుకెళ్లలేదు. ఆవేదనకు గురైన యువతి ఆయువు తీసుకోవాలని ప్రయత్నించింది. కోమాలోకి వెళ్లి నెలలుగా చికిత్స పొందుతోంది. విషయం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావటంతో యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

women-attempts-suicide
women-attempts-suicide

By

Published : Dec 27, 2020, 10:55 AM IST

ప్రేమించి పెళ్లాడిన వ్యక్తి తనను మోసం చేసి వదిలేశాడన్న మనస్తాపంతో ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది. కడప జిల్లా రాయచోటిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

మూడు రోజులని చెప్పి...

రాయచోటికి చెందిన గిరిజన యువతి ఓ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతోంది. ఆమెకు పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న రాజశేఖర్​రెడ్డితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ ఈ ఏడాది జులైలో ఇళ్ల నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకున్నారు. తమ కుమార్తె కనిపించడం లేదని యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 3 రోజుల తరువాత ప్రేమికులు... యువకుడి ఇంటికి వెళ్లారు. తాము ఇష్టపడే వివాహం చేసుకున్నామని తల్లిదండ్రులకు చెప్పారు. రాజశేఖర్ కుటుంబ సభ్యులు తమ ఇంట్లో శుభకార్యం ఉందని... కొన్ని రోజులు పుట్టింట్లో ఉండాలని చెప్పటంతో యువతి తన ఇంటికి వెళ్లింది.

ఇంట్లోనే సపర్యలు

నెలలు గడిచినా కాపురానికి తీసుకెళ్లకపోవటంతో రాజశేఖర్ రెడ్డిని యువతి తల్లిదండ్రులు ప్రశ్నించారు. 'మీది తక్కువ కులం కావటంతో మా ఇంట్లో ఒప్పుకోకపోవటం లేదు' అని అతను సమాధానం ఇచ్చాడు. మనస్తాపానికి గురైన యువతి అక్టోబర్ 29న నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను కడపలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి బెంగళూరులోని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. రూ.20 లక్షలు ఖర్చు పెట్టినా పరిస్థితి మెరుగుపడక తమ కూతురు కోమాలోకి వెళ్లిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఖర్చు భరించలేక ఇంటికి తీసుకువచ్చి సపర్యలు చేస్తున్నామని పేర్కొన్నారు.

ఆ వీడియో వైరల్​

తమ కుమార్తెకు కారుణ్య మరణమే శరణమంటూ వారు మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతమైంది. ఈ విషయమై ఎస్సై నరసింహారెడ్డిని వివరణ కోరగా... బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు రాజశేఖర్ రెడ్డి, అతని తండ్రి శంకర్ రెడ్డితో పాటు పలువురిపై శుక్రవారం ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. బాధితులు తమకు గతంలో ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదని ఆయన చెప్పారు.

ఇదీ చదవండి:మాట్రిమోనీ సైట్లో నకిలీ ఖాతాతో సొమ్ము కాజేసిన కిలేడి

ABOUT THE AUTHOR

...view details