తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

నేను చనిపోతున్నా.. వెతకొద్దు నాన్నా... - కామారెడ్డి లేటెస్ట్ న్యూస్

వారం రోజుల క్రితమే పెళ్లి నిశ్చయమైంది. బంధువుల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. మరుసటి రోజే... పెళ్లి పీటలెక్కాల్సిన ఆ యువతి శవమై తేలింది. వరకట్నమే ఆమె ప్రాణాలు తీసింది. ఈ ఘటన ఆ రెండు కుటుంబాల్లో తీరని విషాదం మిగిల్చింది.

young-woman-suicide-in-kamareddy-due-to-marriage-issues
నన్ను వెతక్కండి నాన్న... మీకు భారం కాదల్చుకోలేదు

By

Published : Dec 5, 2020, 9:04 AM IST

Updated : Dec 5, 2020, 1:27 PM IST

త్వరలో పెళ్లి పీటలెక్కాల్సిన ఓ యువతి అకస్మాత్తుగా శవమై తేలింది. నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజే బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

ఏం జరిగింది?

భూంపల్లికి చెందిన వాగుమారి ప్రవళిక (26) బావిలో దూకి శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. వాగుమారి చందర్ రావుకు ముగ్గురు కూతుళ్లు. ఇద్దరు కూతుళ్ల పెళ్లి చేశారు. చిన్న కూతురు ప్రవళికకి తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామానికి చెందిన యువకునితో పెళ్లి కుదిరింది. వరకట్నంగా రూ.8లక్షలు, నాలుగు గుంటల భూమిని ఇవ్వడానికి యువతి తల్లిదండ్రులు అంగీకరించారు. బంధువుల సమక్షంలో ఈనెల 3న నిశ్చితార్థం జరిగింది. అప్పటికే ఇద్దరు అక్కలు పెళ్లిళ్లు చేసి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుండటం, తండ్రి అనారోగ్యంతో బాధపడుతుండటం, తన పెళ్లి జరిగితే కుటుంబంపై ఆర్థిక భారం పడుతుందని భావించిన ప్రవళిక ఆవేదనతో వ్యవసాయ బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు.

చివరగా...

పెళ్లికి ఎక్కువ ఖర్చు ఎందుకు చేస్తున్నారని రెండు, మూడు సార్లు ఆ యువతి ప్రశ్నించినట్లు ఆమె తండ్రి వెల్లడించారు. చివరగా తన మేనబావకి ఫోన్ చేసి 'నన్ను వెతక్కండి, బావిలో దూకి చనిపోతున్నాను' అని చెప్పిందని వివరించారు. కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై గాలించగా ఓ బావిలో శవమై తేలింది. పెళ్లి పీటలెక్కాల్సిన తమ కూతురు శవమై కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఇంకేమైనా కోణాలున్నాయా?

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం కోసం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పెళ్లి ఇష్టం లేకనే యువతి ఆత్మహత్య చేసుకుందా? లేక ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ చేపడతామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:సిద్దిపేట శివారులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

Last Updated : Dec 5, 2020, 1:27 PM IST

ABOUT THE AUTHOR

...view details