తాను వసతి గృహాలకు నిత్యావసరాలు సరఫరా చేస్తానని నమ్మబలుకుతుంది. మొదట్లో కొద్ది మోతాదులో కూరగాయలు, సరుకులు కొనుగోలు చేస్తుంది. సక్రమంగా డబ్బులు చెల్లిస్తుంది. ఒక్కసారి నమ్మకం కుదిరిన తర్వాత తన అసలు రూపాన్ని బయట పెడుతుంది. పెద్ద ఆర్డర్ వచ్చిందంటూ.. భారీ మొత్తంలో సరుకులు కొనుగోలు చేసి.. డబ్బులు చెల్లించే సమయానికి పెట్టే, బేడా సర్దుకొని ఊరు దాటేస్తోంది. ఇలా వేలు కాదు.. లక్షలు కాదు.. ఏకంగా కోట్ల రూపాయలు మోసం చేసింది ఈ ఘరానా లేడి. ఈమె చేతిలో మోసపోయిన ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వగా తతంగం వెలుగు చూసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆమె కోసం గాలిస్తున్నారు.
అంతా ప్లాన్ ప్రకారమే...
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో గల భవాని నగర్‌కు చెందిన పురాణం శివకుమారి అనే మహిళ తన ముగ్గురు కుమారులతో కలిసి రైతులను, వ్యాపారులను టార్గెట్‌గా చేసుకొని నిత్యావసరాల వ్యాపారం ప్రారంభించింది. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఎక్కువ మొత్తంలో ధర చెల్లిస్తానని పెద్ద ఎత్తున సరుకు కొనుగోలు చేస్తుంది. అనంతరం అక్కడి నుంచి ఉడాయిస్తోంది. పథకం ప్రకారం శివ కుమారి ఓ గ్రామాన్ని ఎంచుకుంటుంది. ఆ గ్రామంలో వరి, మిర్చి, కందులు, పెసర్లు ఇతర నిత్యావసర పంటలు ఎవరు ఎక్కువగా పండిస్తారో తెలుసుకుంటుంది. తాను ప్రభుత్వ వసతి గృహాలకు నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తానని చెప్పి.. పరిచయం చేసుకుంటుంది. ఆ తర్వాత వారి వద్ద రూ.3 నుంచి రూ.5 లక్షల విలువ చేసే సరుకులు కొని.. తక్షణమే నగదు చెల్లిస్తుంది. ఇలా రెండు మూడు సార్లు కొన్న తర్వాత.. ఒకేసారి పెద్ద ఆర్డర్ వచ్చిందని.. పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తుంది. డబ్బులు తర్వాత ఇస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. వెంటనే ఆ ఊరి నుంచి మకాం మార్చి.. మరో ఊరిలో దందా మొదలు పెడుతుంది. ఈ దందాలో తన ముగ్గురు కొడుకులను కూడా భాగస్వామ్యం చేసింది. ఈమె చేతిలో మోసపోయిన రైతులు, వ్యాపారులు ఇప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు.