రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రెండు పడక గదుల ఇళ్లను ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ఓ మహిళను నాచారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేదలకు ఇళ్ల ఆశచూపి డబ్బులు వసూలు చేస్తున్న మహిళపై ఈటీవీ భారత్ వరుస కథనాలు ప్రచురించింది. దీనిపై స్పందించిన రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని నాచారం, మేడిపల్లి పోలీసులను ఆదేశించారు. దర్యాప్తులో చెంగిచెర్ల గ్రామానికి చెందిన సరిత అనే మహిళ ఈ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు.
అక్రమానికి ఒప్పంద పత్రాలు
డబుల్ బెడ్ రూం పథకంలో ఇళ్లు ఇప్పిస్తానని సరిత అనే మహిళ తమ వద్ద డబ్బు వసూలు చేసిందని నాచారం ఠాణాలో ఓ బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇళ్లు ఇప్పిస్తానని నిందితురాలు పలువురికి ఒప్పంద పత్రాలు కూడా రాసిచ్చినట్లు గుర్తించామన్నారు. త్వరలోనే మరికొంత మంది అక్రమార్కుల పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశముందని పోలీసులు పేర్కొన్నారు.