వైద్యుల నిర్లక్ష్యంతో.. ఓ పసికందు పురిటిలోనే ప్రాణాలు కోల్పోయిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని మల్దకల్ మండల కేంద్రానికి చెందిన పద్మమ్మ, భర్త తిమ్మప్పలకు ఇద్దరు ఆడ పిల్లలు. వారు మూడో కాన్పు కోసం ఈ నెల 2న గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. ప్రసవానికి ఇంకా సమయం ఉందని.. ఈ నెల 10న రావాలని వైద్యులు చెప్పడంతో తిరిగి వెళ్లిపోయారు.
ఎముకలు విరిగి ఉబ్బిపోయింది..
నాలుగు రోజుల తర్వాత పద్మమ్మకు పురిటి నొప్పులు రావడంతో ఈనెల 7న జిల్లా ఆసుపత్రికి చేరుకున్నారు. పురిటి నొప్పులు ఎక్కువైనప్పటికీ.. అక్కడ డాక్టర్లు ఎవ్వరూ పట్టించుకోకపోవటంతో ఇదేమిటని ప్రశ్నించారు. పరిస్థితి తీవ్రంగా మారటంతో సాధారణ ప్రసవం చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో శిశువు చేతిని లాగడంతో ఎముకలు విరిగి ఉబ్బిపోయింది. కంగారు పడ్డ వైద్యులు రాత్రికి రాత్రి హుటాహుటిన ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు. అప్పటి వరకు కడుపులో శిశువు బాగానే ఉందని కుటుంబీకులకు తెలిపిన వైద్యులు.. మగ బిడ్డ పుట్టాడు కానీ అప్పటికే బిడ్డ చనిపోయిందని తెలపడంతో బోరున విలపించారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తన బిడ్డ చనిపోయినట్లు శిశువు తండ్రి వాపోతున్నాడు.