కామారెడ్డిలోని అశోక్ నగర్ కాలనీలో భర్త ఇంటిముందే భార్య ఆందోళనకు దిగింది. తన భర్త తనకే కావాలని కోరుతూ ఆందోళన చేపట్టింది. తన భర్త వేరే పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడని... అందుకే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని వాపోయింది.
ఏం జరిగింది?
అశోక్ నగర్ కాలనీకి చెందిన పైడి నవీన్‌కు వేములవాడకు చెందిన అరుణతో 2017 వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.14 లక్షల నగదు, 23 తులాల బంగారం కట్నం ఇచ్చినట్లు బాధితురాలు తెలిపింది. ఆడపడుచు కట్నం కింద రూ.50 వేలు ముట్టజెప్పామని పేర్కొంది. పెళ్లైన ఆరు నెలల వరకు బాగానే ఉన్నా... ఆ తర్వాత వరకట్నం కోసం వేధింపులు మొదలయ్యాయని వివరించింది. మరొక రూ.15 లక్షలు వరకట్నం తేవాలని వేధించారని వాపోయింది. వివాహం అయిన 10 రోజుల నుంచే మామ సురేందర్ వింతగా ప్రవర్తించేవారని చెప్పింది. కట్టుబొట్టు ఆయనకు నచ్చినట్లు ఉండాలని డిమాండ్ చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది.
"ఎంఎన్‌సీ కంపెనీలో ఉద్యోగం అని నమ్మించాడు. ఇరవై రోజుల్లోనే పెళ్లి తంతు అంతా పూర్తి చేశారు. ఓ ఆరు నెలలు బాగానే ఉన్నా... ఆ తర్వాత అదనపు కట్నం కోసం వేధింపులు మొదలుపెట్టారు. నా భర్తతో కలిసి బయటకు వెళ్దామంటే ఎవరైనా రేప్ చేస్తే ఎలా అంటూ మా మామ మాట్లాడేవాడు. ఆరు నెలల తర్వాత వరకట్నం వేధింపులు మొదలయ్యాయి. కట్నం ఇవ్వలేనని చెప్పడంతో వారసుడిని ఇవ్వలేదని ప్రచారం మొదలుపెట్టారు. ఆరు నెలల తర్వాత నా భర్త మనసు మార్చేశారు. మరొక అమ్మాయితో పెళ్లి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నన్ను ఇంటి నుంచి గెంటేశారు."