ఆకతాయిల ఆగడాలు.. వెకిలిమాటలతో యువతులకు వేధింపులు - women's safety in Hyderabad
విశ్వనగరంగా దూసుకుపోతున్న భాగ్యనగరంలో.. మహిళలు. యువతులకు భద్రత కరువవుతోంది. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని రకాల భద్రతాచర్యలు చేపట్టినా.. ఆకతాయిల చేష్టలకు అవేమీ అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. కాస్త చీకటి పడితే చాలు.. కీచకుల్లా ఆడవాళ్లపై రెచ్చిపోతున్నారు. ఒంటరిగా వెళ్తున్న యువతులు, మహిళలను వెకిలి మాటలతో దూషిస్తూ వేధిస్తున్నారు.
హైదరాబాద్‌లో మహిళలపై వేధింపులు
By
Published : Dec 7, 2020, 8:46 AM IST
జూబ్లీహిల్స్‌లో విధులు ముగించుకున్నాక సాయంత్రం ఇంటికెళ్లేందుకు భయమేస్తోంది. వారాంతాల్లో హైటెక్‌సిటీ పైవంతెన నుంచి కూకట్‌పల్లి జేఎన్‌టీయూ మార్గంలో ఆకతాయిలు తిష్ఠ వేస్తున్నారు.
- బొల్లారానికి చెందిన యువతి ఆవేదన ఇది.
ఎల్‌బీనగర్ నుంచి బీఎన్‌రెడ్డినగర్ వెళ్లేందుకు రాత్రి 9.30 గంటలప్పుడు ఆటో కోసం ఎదురుచూస్తున్నా. బైకుపై వచ్చిన ఇద్దరు యువకులు అసభ్యకరంగా మాట్లాడారు. పోలీసులకు చెబుతాననగానే వెళ్లిపోయారు.
- మరో ఉద్యోగిని ఆగ్రహం.
గత నెల 7వ తేదీ రాత్రి అమీర్‌పేట బస్‌స్టాపులో వేచిఉన్న యువతిపై పంజాగుట్టకు చెందిన మహేశ్ అసభ్యంగా ప్రవర్తించాడు. అడ్డొచ్చిన పోలీసులపైనా దాడికి యత్నించడం గమనార్హం.
నగరంలో ఆకతాయిల వేధింపులకు గురవుతున్న యువతులు, మహిళల సంఖ్య పెరిగిపోతోంది. దేశవ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు కలవరపెడుతున్న వేళ కొందరు సామాజిక మాధ్యమాల వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంచెం చీకటి పడితే చాలు గల్లీకో కీచకుడు రెచ్చిపోతున్నారు. ఒంటరి మహిళలు, యువతులను వెకిలి చేష్టలతో, అసభ్యకర మాటలతో బాధిస్తున్నారు.
అసాంఘిక అడ్డాలే కారణం
రాత్రి 9 దాటితే రోడ్లపక్కన, మెట్రో స్టేషన్ల వద్ద, నిర్మానుష బస్టాపులను అడ్డాగా మార్చుకొని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. పలు మెట్రోస్టేషన్ల వద్ద, పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రి బస్టాపు, హైటెక్‌సిటీ అడ్డాలుగా మారుతున్నాయి.
మందుబాబులకు అడ్డే లేదు
రద్దీ ప్రాంతాల్లోనే మద్యం దుకాణాలు, పర్మిట్ గదులను నిర్వహిస్తున్నారు. రోడ్డుపైనే కూర్చుని మద్యం తాగేస్తున్నారు. మహిళలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులిచ్చినా స్పందన లేదు. ఎర్రగడ్డ మెట్రోస్టేషన్, కూకట్‌పల్లి బస్టాప్, మెట్రో కేంద్రం, షేక్‌పేట, నాచారంలో అమ్మవారి గుడికి ఆనుకొని ఉన్న వైన్స్, చక్రిపురం-చర్లపల్లి మార్గంలో ఈ దుస్థితి ఉంది.