తెలంగాణ

telangana

By

Published : Sep 28, 2020, 9:12 AM IST

ETV Bharat / jagte-raho

మావోయిస్టుల ఉన్నతస్థాయి సమావేశం జరిగిందా?

సుదీర్ఘ విరామం తర్వాత మావోయిస్టులు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లాలోని పాలోడు అటవీ ప్రాంతంలో ఈ సమావేశం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

telangana mavoists news
మావోయిస్టుల ఉన్నతస్థాయి సమావేశం జరిగిందా?

విధానపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు మావోయిస్టు కేంద్ర కమిటీ గతంలో ప్రతి రెండేళ్లకు ఒకసారి ప్లీనరీ నిర్వహించేది. పోలీసుల నిఘా పెరగడంతో దాదాపు పదేళ్లుగా ప్లీనరీ జరగడంలేదు. రాష్ట్ర కమిటీ నుంచి కిందిస్థాయిలో మాత్రం అడపాదడపా సమావేశాలు జరుగుతున్నాయి. అవన్నీ ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రలోని గడ్చిరౌలి, ఒడిశా అటవీ ప్రాంతాలకే పరిమితమయ్యాయి. చివరిసారిగా 2018 జులైలో ఒడిశాలోని మల్కనగిరి జిల్లా అటవీప్రాంతంలో ఆంధ్రా ఒడిశా బోర్డర్‌(ఏవోబీ) రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది.

దీనిపై పోలీసులు జరిపిన దాడిలో 24 మంది మావోయిస్టులు మరణించారు. అప్పటి నుంచి మావోయిస్టులు ఎక్కువ మందితో సమావేశాలు నిర్వహించిన దాఖలాలు లేవు. ఇటీవల మావోయిస్టుల గాలింపులో భాగంగా పోలీసులు బీజాపూర్‌ జిల్లా పాలోడు అటవీ ప్రాంతంలో డ్రోన్లతో పరిశీలిస్తుండగా దాదాపు 300 మంది ఓ వాగు దాటుతున్న దృశ్యం నమోదైంది. తొలుత వారు మావోయిస్టులని భావించినప్పటికీ.. తర్వాత వారంతా చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ఆదివాసీలని గుర్తించారు. మావోయిస్టులు ఏదైనా పెద్ద సమావేశం నిర్వహించే ముందు.. రక్షణ చర్యల్లో భాగంగా పోలీసు వాహనాలు అటువైపు రాకుండా చిన్నచిన్న రహదారులపై కందకాలు తవ్వుతారు. ఇలా పాలోడు ప్రాంతంలో కందకాలు తవ్వించేందుకు సమీపంలోని గ్రామస్థులను మావోయిస్టులు తీసుకెళ్లినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఇలా రోడ్లు తవ్వించారంటే సమీపంలో ఎక్కడో పెద్ద సమావేశం నిర్వహించి ఉంటారని అంచనా వేస్తున్నారు. దీనిపై క్షేత్రస్థాయి నుంచి కచ్చితమైన సమాచారం కోసం పోలీసులు కృషి చేస్తున్నారు.

అజ్ఞాతంలో 136 మంది:

పోలీసుల తాజా గణాంకాల ప్రకారం.. తెలంగాణకు చెందిన మావోయిస్టులు 136 మంది అజ్ఞాతంలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీలో 109 మంది సభ్యులు ఉండగా అందులో 29 మంది మాత్రమే ఈ రాష్ట్రానికి చెందిన వారు. మిగతా 80 మంది ఇతర రాష్ట్రాల వారు. ఈ లెక్కన మొత్తం తెలంగాణ రాష్ట్రానికి చెందిన 136 మందిలో 107 మంది కేంద్ర కమిటీకి, ఇతర రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

ఇవీ చూడండి: రాగల మూడ్రోజులు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

ABOUT THE AUTHOR

...view details