వనపర్తి జిల్లా కేంద్రంలో మహేష్ అనే యువకుడు మొబైల్ దుకాణం పెట్టి ఉపాధి పొందుతున్నాడు. ఆగష్టు 20న తన షాపులో రూ.74 వేలు విలువ చేసే ఆరు మొబైల్ ఫోన్లు పోయినట్టు గుర్తించాడు. వెంటనే వనపర్తి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దొంగతనం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. మొబైల్ ఐఎంఈఐ నెంబరు నమోదు చేసుకొని పోయిన ఫోన్ల మీద నిఘా పెట్టారు.
మొబైల్ కొట్టేశాడు.. సిమ్‌కార్డు వేసి దొరికిపోయాడు
కరోనా ప్రభావంతో ఆరు నెలల పాటు ఇంట్లోనే ఉంటున్నాడు. చేతిలో డబ్బులు అయిపోయాయి. పనీపాట లేకుండా ఖాళీగా తిరుగుతున్నావంటూ తండ్రి మందలించాడు. ఏం చేసైనా సరే.. డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో ఓ యువకుడు దొంగతనానికి పాల్పడ్డాడు. పట్టణంలోని ఓ మొబైల్ దుకాణంలో ఆరు ఫోన్లు దొంగిలించి రెండు నెలలు కూడా తిరక్కుండానే దొరికిపోయిన ఘటన వనపర్తి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.
రెండు రోజుల క్రితం పోయిన ఫోన్లలో ఒక ఫోన్ ఆన్ చేసినట్టు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే విచారణ చేపట్టిన పోలీసులు పడమటి తండాకు చెందిన సాగర్ అనే యువకుడు ఆ మొబైల్ వాడుతున్నట్టు తెలుసుకున్నారు. అక్కడికి వెళ్లి సాగర్‌ను విచారించగా.. ఆరు మొబైల్ ఫోన్లు తనే దొంగతనం చేసినట్టు అంగీకరించాడు. కరోనా వల్ల కాలేజీకి వెళ్లడం లేదని... ఇంట్లో ఖాళీగా ఉండటం వల్ల తండ్రి మందలించాడని.. ఎలాగైనా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో మొబైల్స్ దొంగతనం చేసినట్టు పోలీసులు తెలిపారు. సాగర్‌ను అదుపులోకి తీసుకొని దొంగతనం కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి:విద్యార్థుల ఎంపికను తాత్కాలికంగా నిలిపేయాలని ప్రభుత్వం ఆదేశం