ఏపీలోని విజయవాడ క్రీస్తు రాజపురంలో గతనెల 15వ తేదీన పట్టపగలు ఇంజనీరింగ్ విద్యార్ధిని గొంతుకోసి హత్య చేసిన కేసులో నిందితుడు నాగేంద్రబాబుకు ఈనెల 20 వరకు రిమాండ్ విధించారు. గతనెల 15వ తేదీన విద్యార్ధిని హత్య అనంతరం తీవ్రగాయాలతో ఉన్న నాగేంద్రబాబును చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యం అనంతరం నాగేంద్రబాబును నిన్న పోలీసులు అరెస్టు చేశారు. న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే ముందు ఈఎస్ఐ ఆసుపత్రిలో బీపీ, షుగర్, ఈసీజీ తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం విజయవాడలోని ఒకటో మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు.
న్యాయమూర్తి యస్.కమలాకర్ రెడ్డి నాగేంద్రకు 14 రోజుల రిమాండ్ విధించారు. మచిలీపట్నంలోని జిల్లా జైలులో కరోనా పరీక్షలు నిర్వహించి అనంతరం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించాలని ఆదేశించారు. నాగేంద్ర తనకు ఉన్న గాయాల గురించి న్యాయమూర్తికి, వైదులకు తెలిపారు. ఐదు రోజులకు ఓసారి తనిఖీ చేయించుకోవాలని గుంటూరు వైద్యులు సూచించినట్లు తెలిపారు. ఈ విషయాలను పోలీసులు తమ నివేదికలో పొందుపరిచారని న్యాయమూర్తి అన్నారు. తేజస్విని హత్యోదంతం కేసును దర్యాప్తు చేస్తోన్న దిశా పోలీసులు... సమగ్ర విచారణ కోసం వారం రోజుల కస్టడీకి కోరేందుకు దరఖాస్తు చేసుకున్నారు.