ఒక్కోసారి ఆశ.. మనిషిని బలహీనపరుస్తుంటుంది. అదే సైబర్ నేరస్తుల పాలిట వరంగా మారుతుంది. అమాయకులకు నగదు ఎరవేసి మాయమాటలు చెప్పి బుట్టలో పడేేేస్తారు. దశలవారీగా అందినకాడికి దోచుకుంటారు. ఏళ్లు గడుస్తున్నా.. మాయగాళ్లు తీరు మారలేదు. సైబర్ నేరం అంటే ముందు గుర్తొచ్చేది లాటరీ పేరుతో మోసాలు. ఆన్ లైన్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా.. నేరాలు మాత్రం ఇంకా తగ్గడం లేదు. మీరు మా లక్కీ డిప్లో లక్షల రూపాయలు గెలుచుకున్నారు.. అని ఫోన్ చేస్తారు. మేం వెంటనే మీకు నగదు పంపుతున్నామని అడ్రస్ వివరాలు తీసుకుంటారు. తర్వాత ఫోన్ చేసి రకరకాల పేర్లతో దశల వారీగా అందిన కాడికి దోచుకుంటారు.
లక్కీ డ్రాలతో జాగ్రత్త..
మీరు 10 వేల రూపాయలు నగదు పంపితే చాలు మీకు లక్షల రూపాయలు పంపిస్తామంటారు. మీకు అనుమానం వచ్చే వరకు మీ జేబును ఖాళీ చేస్తారని సైబర్ క్రైమ్ పోలీసులు చెపుతున్నారు. లాటరీ టిక్కెట్ కొనకుండా ఎలా లక్కీ డ్రాలో గెలుస్తారు. అన్న సందేహం ప్రతి ఒక్కరిలో రావాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిజంగా డ్రాలో గెలిస్తే టాక్స్ మినహాయించుకుని మిగిలిన నగదును ఇస్తారని.. టాక్స్‌ల పేరుతో డబ్బులు వసూలుచేయరని పోలీసులు తెలిపారు. ఈ తరహాలోనే విజయవాడలో ఓ సైబర్ నిపుణుడికే ఈ సమస్య ఎదురైంది. కోటి రూపాయల లాటరీ గెలుచుకున్నారని ఫోన్ వచ్చింది. మీ వివరాలు పంపాలని కోరారు. వివరాలు పంపటంతో మేం మీ నగదు తీసుకుని ఎయిర్ పోర్ట్‌కు వచ్చామని.. కస్టమ్స్ అధికారులకు టాక్స్ 30 వేల రూపాయలు చెల్లించాలని బ్యాంక్ ఖాతాలో వేయాలని కోరారు. లాటరీ నగదులో మినహాయించి ఇవ్వండి అని బాధితుడు చెప్పటంతో మాట మార్చి.. నమ్మించేందుకు ప్రయత్నించాడని బాధితుడు చెప్పాడు. మరికొంత మంది ఫోన్‌కు మెస్సేజ్ పంపి ఏపికే ఫైల్‌ను పంపుతారు. వాటిని క్లిక్ చేస్తే మీఫోన్.. నిందితుల కంట్రోల్లోకి వెళుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రీమియం పేరుతో మోసం
సైబర్ నేరాల్లో మరోతరహా మోసం ఇటీవల తరచుగా జరుగుతున్నాయి. ఎల్ఐసీ, ఇన్సూరెన్స్‌ల పేరుతో చాకచక్యంగా నగదు దోచుకుంటున్నారు. ముందుగా ఎల్ఐసీ పాలసీదారుల వివరాలను నిందితులు సేకరిస్తున్నారు. ప్రీమియం కొన్నేళ్లుగా చెల్లించని వారి వివరాలు సేకరించి.. మేం ఎల్ఐసీ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నాం.. మీ పాలసీ నెంబర్, మీ పేరు చెప్పి నమ్మిస్తారు. కొన్నేళ్లుగా ప్రీమియం చెల్లించటం లేదు. మీకు ఒక అవకాశమిస్తున్నామని మాయమాటలు చెబుతారు. కొంత మొత్తంలో నగదు చెల్లిస్తే మీ పాలసీని పునరుద్ధరిస్తామంటూ చెబుతారు. ఈ తరహాలోనే విజయవాడ భవానీపురానికి చెందిన సాయికి ఓ రోజు ఫోన్ వచ్చింది. ఐదేళ్ల కిందట నిలిపి వేసిన ఓ ఎల్ఐసీ పాలసీని పునరుద్ధరించాలంటూ ఫోన్ చేశారు. సదరు బాధితుడు అనుమానం వచ్చి స్థానికంగా ఉన్న ఎల్ఐసీ కార్యాలయానికి వెళ్లి అధికారులను సంప్రదిస్తే .. అది అవాస్తవమని తేలింది . దీంతో బాధితుడు నివ్వెరపోయాడు. నగదు చెల్లించకపోవటంతో ఊపిరి పీల్చుకున్నాడు. ఇదే విధంగా ఇన్సూరెన్స్ ల పేరులతో వసూలు చేస్తున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు.