కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన ఇద్దరు తెదేపా నాయకులపై సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో తెదేపా నాయకుడు నారాయణ, ఆయన సోదరుడు విష్ణుమూర్తి, బంధువు విశాల్ గాయపడ్డారు. అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని బాట సుంకలమ్మ దర్శనానికి సోమవారం రాత్రి నారాయణ, ఆయన సోదరుడు విష్ణుమూర్తి, బంధువులు బయలుదేరారు. విష్ణుమూర్తి, విశాల్‌లు ద్విచక్ర వాహనంపై, నారాయణతో పాటు కుటుంబ సభ్యులు ఐషర్ వాహనంలో ప్రయాణిస్తున్నారు.
ముందు వెళుతున్న ఇద్దరినీ గుంతకల్లు శివారులో రెండు బైకులపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తలు ఆపి.. దాడికి దిగారు. అంతలోనే నారాయణ వాహనం చేరుకుంది. తన తమ్ముడు విష్ణుకుమార్‌ను కొడుతున్న వారిని నారాయణ అడ్డుకోవటంతో ఆయనపైనా విరుచుకుపడ్డారు. రాళ్ల దాడిలో నారాయణ కుడికాలికి బలమైన గాయమైంది. వాహనంలో 50 మంది ఉండటంతో వారంతా ప్రతిఘటించగా ఆగంతకులు పారిపోయారు. గాయపడిన ముగ్గురిని గుంతకుల్లు ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు.