తల్లిదండ్రులు దైవంతో సమానం అంటారు. కానీ ఆస్తికోసం జన్మనిచ్చిన తల్లిదండ్రుల చిత్రపటాలకు చెప్పుల దండ వేసి అవమానపర్చారు ఇద్దరు ప్రబుద్ధులు. తండ్రిని బలవంతగా తీసుకెళ్లి ఆస్తిని వారి పేరున రాయించుకున్నారు. తల్లి ఫిర్యాదుతో ఇద్దరు కుమారులపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన నూనె సంజీవరావు, సరోజ దంపతులకు ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె. వారందరికీ వివాహం అయింది. తహసీల్దార్‌గా ఉద్యోగం చేసి విశ్రాంతి తీసుకొని సంజీవరావు సూర్యాపేటలో నివాసం ఉంటున్నారు. ఆయన సొంత గ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో వారికి సాగు భూమి ఉంది. హైదరాబాద్‌లో ఓ ప్లాటు ఉంది.
ఆస్తి పంచాలంటూ ఆయన కుమారులైన రవీందర్, దయాకర్ కొన్నాళ్లుగా ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆ వృద్ధ తల్లిదండ్రులు వాపోయారు. ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్న మూడో కుమారుడు కరుణాకర్ వద్ద సంజీవరావు దంపతులు నివాసం ఉంటున్నారు. చిన్నకుమారుడికే ఆస్తి అంతా ఇస్తారనే అనుమానంతో పలుసార్లు బెదిరింపులకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.