కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరా నగర్ కాలనీకి చెందిన షేక్ పాషా అనే వ్యక్తి ఓ రేషన్ దుకాణంలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బక్రీద్ పండుగ జరుపుకునేందుకు పట్టణంలోనే ఉంటున్న తమ బంధువుల ఇంటికి వచ్చారు. ఆదివారం రోజు చిన్న తోడల్లుడు హుస్సేన్, పెద్ద తోడల్లుడి కొడుకు ఖజోద్దిన్లతో కలిసి షేక్ పాషా మద్యం సేవించడానికి ధరణి వెంచర్‌కు వెళ్లాడు. మద్యం మత్తులో వారి మధ్య గొడవ జరిగింది.
కోపోద్రిక్తులైన హుస్సేన్, ఖజోద్దిన్లు... షేక్ పాషాను దారుణంగా నరికి చంపేశారు. అనంతరం దగ్గర్లో ఉన్న పెట్రోల్ బంక్ నుంచి పెట్రోల్ తీసుకొచ్చి షేక్ పాషా మృతదేహాన్ని తగలబెట్టారు. అనంతరం ఏమీ జరగనట్లుగా ఇంటికి వెళ్లి అందరితో కలిసిపోయారు. సోమవారం రాత్రి వరకూ షేక్ పాషా ఇంటికి రాకపోవడం వల్ల కుటుంబ సభ్యులు... హుస్సేన్, ఖజోద్దిన్లను గట్టిగా నిలదీశారు. మద్యం మత్తులో షేక్ పాషాని తామే చంపినట్లు వారిద్దరూ ఒప్పుకున్నారు. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారమందించారు.