మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. వీరన్నపేటకు చెందిన ఇద్దరు చిన్నారులు ఆడుకోవడానికి వెళ్లి నీట మునిగి మృతి చెందారు. వీరన్నపేట రెండు పడకగదుల ఇళ్ల సముదాయానికి సమీపంలో రాళ్లను తవ్వితీసిన చోట ఏర్పడిన గుంతలలో పడి చనిపోయారు.
ఆట మిగిల్చిన విషాదం: నీటిలో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి
నలుగురు చిన్నారులు ఆడుకోవడానికి నీటి గుంత వద్దకు వెళ్లారు. సరదాగా స్నానం చేయడానికి నీళ్లలోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండడంతో వీరన్నపేటకు చెందిన ఇద్దరు పదేళ్ల చిన్నారులు నీట మునిగి మృత్యువాత పడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఈ విషాదం చోటు చేసుకుంది.
వీరన్నపేట, ఎర్రమన్నుగుట్టకు చెందిన నలుగురు స్నేహితులు శనివారం ఆడుకోవడానికి నీటి గుంత వద్దకు వెళ్లారు. చిన్నారులు సరదాగా స్నానం చేయడానికి నీళ్లలోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో పదేళ్ల ఇద్దరు చిన్నారులు ఆద్నాన్, మొహసిన్ నీట మునిగారు. మిగతా ఇద్దరు చిన్నారులు కాలనీలోకి వచ్చి స్థానికులకు విషయం చెప్పారు.
గుంతలో వెతకగా ఇద్దరు చిన్నారుల మృతదేహాలు బయటపడ్డాయి. మహబూబ్‌నగర్ జనరల్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మొహసిన్‌కు తండ్రి లేకపోగా.. ఆద్నాన్ తండ్రి సౌదిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు పేర్కొన్నారు.