జన సంచారం తక్కువగా ఉన్న ఏటీఎంలే లక్ష్యంగా చేసుకుని... వాటిని ధ్వంసం చేసి చోరీలకు పాల్పడుతున్న కేసులు హైదరాబాద్‌లో పెరుగుతున్నాయి. ముందుగా రెక్కీ నిర్వహించి.. పోలీసులు గస్తీ సమయాలు కూడా పరిశీలించి.. చోరీలకు పాల్పడుతుండటంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. రెండు నెలల వ్యవధిలోనే... రెండు ఎస్బీఐ ఏటీఎంలు ధ్వంసం చేసి లక్షలు రూపాయలను దుండగులు కాజేశారు.
పక్కా ప్రణాళికతో...
అక్టోబర్ 5న హైదరాబాద్-ముంబై ప్రధాన రహదారిపై చందానగర్ వద్ద ఉన్న ఎస్బీఐ ఏటీఎంలోకి చొరబడిన దొంగలు గ్యాస్ కట్టర్ల సాయంతో లోపలికి ప్రవేశించి... అందులో ఉన్న 15లక్షల రూపాలయలు చోరీ చేశారు. అనంతర అక్కడి నుంచి పరారయ్యారు. వీరి కోసం పోలీసులు ఇప్పటికీ గాలిస్తూనే ఉన్నారు. కొన్ని రోజులుగా ఏటీఎం పనిచేయకపోవడం... దీంతో తక్కువ జనసంచారం ఉండడం చూసి... అదును చూసి అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. ఏటీఎంలో అలార్మ్ లేకపోవడంతో దొంగలు సులభంగా చోరీ చేశారు.
లక్షలతో పరారు..
తాజాగా వనస్థలిపురంలోని సహారా రోడ్డులో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి పాల్పడి దుండగులు ఆరు లక్షలకు పైగా నగదును దొంగిలించారు. కారులో వచ్చిన దుండగులు ఏటీఎం లోపలికి వెళ్లి... షట్టర్ మూసేశారు. తమతో తెచ్చుకున్న గ్యాస్ కట్టర్ల సాయంతో ముందు సీసీ టీవి కెమెరాలను కాల్చివేశారు. అనంతరం ఏటీఎం మెషిన్‌ను కత్తిరించి అందులోని సుమారు 8.5 లక్షల రూపాలయలను చోరీ చేశారు. వంద రూపాయల నోట్లు ఉన్న ర్యాక్ తెరుచుకోకపోవడంతో.. అక్కడి నుంచి ఎల్బీనగర్-విజయవాడ జాతీయ రహదారివైపు పరారయ్యారు.